ఆక్రమణలను తక్షణం తొలగించండి

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికతో పనులు చేపడతామని, హార్సిలీహిల్స్‌లో త్వరలోనే 5 స్టార్‌ హోటల్‌ వస్తుందని అందుకోసం స్థలం కేటాయించడం కూడా జరిగిందని కలెక్టర్‌ గిరీషా తెలిపారు.

ఆక్రమణలను తక్షణం తొలగించండి
హార్సిలీహిల్స్‌లో పర్యటిస్తున్న కలెక్టర్‌ గిరీషా

అనుమతి లేకుండా ఒక్క ఇటుకా పేర్చకూడదు

హార్సిలీహిల్స్‌లో 5 స్టార్‌ హోటల్‌ 

ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయండి : కలెక్టర్‌ గిరీషా


బి.కొత్తకోట, మే 21: ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికతో పనులు చేపడతామని, హార్సిలీహిల్స్‌లో త్వరలోనే 5 స్టార్‌ హోటల్‌ వస్తుందని అందుకోసం స్థలం కేటాయించడం కూడా జరిగిందని కలెక్టర్‌ గిరీషా తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన హార్సిలీహిల్స్‌లో పర్యటించారు. కొండపై గల సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొండపై అక్రమ నిర్మాణాలు పెరిగాయని వెంటనే వాటిని తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రోడ్లపైకి అక్రమ నిర్మాణాలు రావడం, ప్రభుత్వ శాఖలకు కేటాయించిన స్థలాలలో ప్రైవేటు నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎ్‌సఎన్‌ఎల్‌కు కేటాయించిన స్థలంలో సబ్‌ లీజు పేరుతో ప్రైవేటు వారు నిర్మిస్తున్న భవన నిర్మాణాలను ఆపేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గేటుకు తాళం వేసి సీజ్‌ చేయాలని, సంబంధిత శాఖకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. టౌన్‌ షిప్‌ కమిటీ అనుమతులు లేకుండా ఒక్క నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదని నిర్మాణం చేపట్టాలంటే టౌన్‌షిప్‌ కమిటీ ద్వారా కలెక్టర్‌ దృష్టికి తేవాలని ఆదేశించారు. హార్సిలీహిల్స్‌పై అనుమతి లేకుండా చెట్లను నరకరాదని ఒక్క చెట్టును ఎవ్వరైనా నరికినా రెవెన్యూ, అటవీ శాఖ వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చెత్తా, చెదారం పేరుకుపోవడం, అపరిశుభ్రత నెలకొనడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తూ పరిశుభ్రత పాటించాలని అందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని డీఎల్పీవో లక్ష్మీ, బి.కొత్తకోట ఎంపీడీవో శంకరయ్యలకు సూచించారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అతిథి గృహ ఆధునీకరణకు ప్రతిపాదనలు పంపాలని ఆర్డీవో మురళికి సూచించారు. టౌన్‌షి్‌ప కమిటీ కార్యాలయం, అతిథి గృహం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అవసరమైన నిధులు పంజూరు చేస్తానని ఆయన తెలిపారు.ఘాట్‌ రోడ్‌ నుంచి కొండపై వరకూ అక్కడక్కడా వినూత్నమైన డస్ట్‌ బిన్‌లు ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కొండపై వెలసిన ఏనుగు మల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చరిత్ర, అభివృద్ధి గురించి ఆలయ అర్చకులు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు వివరించారు.  కార్యక్రమంలో మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎల్పీవో లక్ష్మీ, తహసీల్దారు ధనుంజయులు, ఎంపీడీవో శంకరయ్య, మదనపల్లె రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ రామ్మోహన్‌, ఉద్యాన శాఖాధికారి ప్రతాప్‌రెడ్డి, టూరిజం మేనేజర్‌ సాల్విన్‌రెడ్డి, అటవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ శివకుమార్‌, ట్రాన్స్‌కో డీఈ విజయన్‌తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST