‘అద్దెల’ దరువు!

ABN , First Publish Date - 2021-07-25T04:48:20+05:30 IST

‘అద్దెల’ దరువు!

‘అద్దెల’ దరువు!
పలాస : మహాత్మగాంధీ పునరావాస షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మూతపడిన దుకాణాలు

- మునిసిపాలిటీల్లో దుకాణాలపై అద్దె పెంపు

- ఆందోళన చెందుతున్న వ్యాపారులు

- కరోనా వేళ బేరాలు లేవంటూ దిగులు

- భారం మోయలేక షాపులు ఖాళీ చేస్తున్న వైనం

(పలాస)

కార్పొరేషన్‌, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో దుకాణాలపై ప్రభుత్వం అద్దె పెంచింది. ఇందుకు సంబంధించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వేళ వ్యాపారాలు సన్నగిల్లి.. దుకాణాల నిర్వహణ కష్టమవుతోందని, ఈ సమయంలో ప్రభుత్వం అద్దె రూపంలో అదనపు భారం మోపడం తగదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో.. కొందరు చేసేది లేక షాపులు ఖాళీ చేసేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, రాజాం పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచాయతీ ఉంది. వీటి పరిధిలో ఐడీఎస్‌ఎంటీ,  పునరావాస షాపింగ్‌ కాంప్లెక్స్‌, మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో దుకాణాల అద్దెలను ప్రభుత్వం అమాంతం పెంచేసింది.   దీనికి సంబంధించి ఇటీవల జీవో జారీచేసింది. వాస్తవానికి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాల షాపులకు సంబంధించి 200 శాతం మేర అద్దెను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబరు 56/2011ను విడుదల చేసింది. కానీ, గత ప్రభుత్వ హయాంలో ఈ జీవో అమలుకు నోచుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షాపుల అద్దెను రూ.ఐదు వేల వరకు పెంచాలని నిర్ణయించింది. దీనికితోడు ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పెంచిన అద్దెలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో వ్యాపారులు కలవరపడుతున్నారు. అద్దెల పెంపు నిర్ణయం ఉపసంహరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉత్తర్వులను తాము ధిక్కరించలేమని, అద్దెలు పెంచడం తప్ప మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. పాలకులు కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


ప్రభుత్వ ఆదాయానికి గండి

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 2007లో నిర్మించిన ఐడీఎస్‌ఎంటీ, మహాత్మగాంధీ పునరావాస షాపింగ్‌ కాంప్లెక్స్‌, కోట్ని గురుమూర్తి కాంప్లెక్స్‌, సీతమ్మతల్లి కూరగాయల మార్కెట్‌లో 160కు పైగా మునిసిపల్‌ షాపులు ఉన్నాయి. ఇచ్ఛాపురంలో 250కుపైగా దుకాణాలు ఉన్నాయి. ఆమదాలవలసలో 60, శ్రీకాకుళంలో 200 వరకు నగర పాలక సంస్థకు చెందిన దుకాణాలు ఉన్నాయి. వీటిని పదిహేనేళ్ల కిందట.. అప్పటి నిబంధనల మేరకు ఒక్కో షాపునకు రూ.600 నుంచి రూ.1200 వరకు అద్దె నిర్ణయించారు. రెండేళ్లకోసారి ఉన్న అద్దెపై 30 శాతం పెంచాలని నిర్ణయించి నిర్వాసితులు, వేలంపాట దారులకు అప్పగించారు. షాపుల అద్దెతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరేది. కేవలం పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘానికి ఏటా రూ.50లక్షల ఆదాయం వస్తోంది.    తాజా నిర్ణయంతో చాలామంది షాపులు ఖాళీ చేసేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. జిల్లాలో మొత్తంగా షాపుల అద్దె ద్వారా రూ.3 కోట్ల వరకు ఏటా ఆదాయం కోల్పోనుంది. 


60 శాతం దుకాణాలు ఖాళీ

ప్రభుత్వ నిర్ణయంతో చాలామంది వ్యాపారులు అద్దెల భారం మోయలేక దుకాణాలు ఖాళీ చేసేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ఇప్పటికే మహాత్మగాంధీ పునరావాస షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 60 శాతానికి పైగా షాపులు ఖాళీ అయ్యాయి. మిగిలినవి కూడా ఖాళీ చేసేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఐడీఎస్‌ఎంటీ షాపుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం కేటీరోడ్డు, బస్టాండులో ఉన్న షాపుల్లో మాత్రమే వ్యాపారం కొనసాగిస్తున్నారు. వాస్తవానికి మొదటి అంతస్తులో ఉన్న షాపులతో పాటు మహాత్మగాంధీ పునరావాసంలో ఉన్న షాపులకు మినహాయింపు ఇవ్వాలి. కానీ, మొత్తం అన్ని షాపులకు ఒకే నిబంధన ఉండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రభావంతో వ్యాపారాలు మందగించాయని.. ఈ నేపథ్యంలో అద్దె కట్టడం కంటే దుకాణాలు ఖాళీ చేయడమే మేలని వ్యాపారులు నిర్ణయించారు. అద్దె పెంపుపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మునిసిపాలిటీల్లో వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. కొంతమంది వ్యాపారులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో కోర్డు పరిధిలో ఉన్న షాపుల అద్దె జోలికి వెళ్లకుండా మిగిలిన వాటిపై మునిసిపల్‌ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. దీంతో చాలామంది షాపులు ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అద్దెల భారం తగ్గించాలని వ్యాపారులు కోరుతున్నారు. 

 

Updated Date - 2021-07-25T04:48:20+05:30 IST