అద్దెలు కట్టకుండానే ఖాళీ చేస్తారా?

ABN , First Publish Date - 2020-12-02T06:30:34+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దెకు తీసుకున్న భవనాలకు అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయా భవనాల యజమానులు సర్కారును డిమాండ్‌ చేశారు.

అద్దెలు కట్టకుండానే ఖాళీ చేస్తారా?
అద్దెలు చెల్లించాలని రిలే నిరాహారదీక్ష చేపడుతున్న భవన యజమానులు

గొల్లపూడి, డిసెంబరు 1: ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దెకు తీసుకున్న భవనాలకు అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయా భవనాల యజమానులు సర్కారును డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించేవరకు రిలే నిరాహారదీక్షలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నాటి ప్రభుత్వం గొల్లపూడిలో పలు ప్రభుత్వ శాఖల ఏర్పాటు కోసం భవనాలను అద్దెకు తీసుకుంది. అయితే, గత 11 నెలలుగా అద్దె బకాయిలు చెల్లించడం లేదు. ఇదిలావుంటే, ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులు తమ కార్యాలయాన్ని గుట్టుచప్పుడు కాకుండా మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలోకి తరలించేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మంగళగిరి నుంచి పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం గొల్లపూడిలోని భవన యజమానులకు 11 నెలల అద్దె సుమారు రూ.77 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఉన్నతాధికారులు భవన యజమానులకు బకాయి అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తూ, మొత్తం పాలనను మంగళగిరికి తరలించాలని ప్రయత్నిస్తుండటంతో గొల్లపూడిలోని ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద భవన యజమానులు మంగళవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

Updated Date - 2020-12-02T06:30:34+05:30 IST