ఎస్‌.కోటలో కిరాయి రౌడీయిజం

ABN , First Publish Date - 2021-06-17T05:04:05+05:30 IST

‘శృంగవరపుకోటలో కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి. మీ దృష్టికి వచ్చిందా? మాకైతే కొన్ని వివరాలు తెలిశాయి... ఓ జిల్లా అధికారి నాతో చెప్పార’ని స్థానిక శాసన సభ్యుడు కడుబండి శ్రీనివాసరావు ప్రకటించడం చర్చనీయాంశమైంది. స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్‌ దాసరి సంతోషి కుమారి, వార్డు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.

ఎస్‌.కోటలో కిరాయి రౌడీయిజం
ఎస్‌.కోట పంచాయతీ కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

తప్పుడు పనులు జరుగుతున్నాయి

జిల్లా అధికారి చెప్పారు

 ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

 శృంగవరపుకోట, జూన్‌ 16: ‘శృంగవరపుకోటలో కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి. మీ దృష్టికి వచ్చిందా? మాకైతే కొన్ని వివరాలు తెలిశాయి... ఓ జిల్లా అధికారి నాతో చెప్పార’ని స్థానిక శాసన సభ్యుడు కడుబండి శ్రీనివాసరావు ప్రకటించడం చర్చనీయాంశమైంది. స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్‌ దాసరి సంతోషి కుమారి, వార్డు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా తప్పులు చేస్తే పార్టీ సమర్థించదని స్పష్టం చేశారు. ఈ రెండేళ్లలో తాను ఎవరి దగ్గరా లంచం తీసుకోలేదని.. సీఎం జగన్‌కు, పార్టీకి నష్టం తెచ్చే పనులేవీ చేయలేదని చెప్పుకొచ్చారు.  గ్రామంలో పద్ధతులు, సంస్కృతి బాగోలేదని ఎస్‌.కోట మేజర్‌ పంచాయతీ నుంచే ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. పంచాయతీ అంటే కార్యాలయమనే కాదు... గ్రామంలో కూడా అవినీతి కార్యక్రమాలు, బెదిరింపులు, కిరాయి రౌడీయిజం జరుగుతోందన్నారు. ‘ఎస్‌.కోట నుంచి ఎవరినో చంపేందుకు కత్తులు పట్టుకొని జమ్మాదేవిపేట వెళ్లారని... హత్యా సంస్కృతి ఇంత చిన్న ఊరిలో ఉందా?’ అని తనను అడిగారని గుర్తుచేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అవినీతి రహిత పరిపాలన అందించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా తాను లంచం తీసుకున్నట్లు విన్నారా? అని విలేకర్లను, వార్డు సభ్యులను ప్రశ్నించారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల నియామకంలో ఎక్కడా పైసా అవినీతి జరగలేదని చెప్పుకొచ్చారు. తనకు తెలియకుండా ఎక్కడైనా అవినీతి జరిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తనపేరు చెడగొట్టకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ‘మా దగ్గరకు వస్తేనే పని అవుతుందని కొందరు వ్యక్తులు డబ్బులు దండుతున్నట్లు తెలిసిందని చెప్పారు. కత్తులు పట్టుకుని బెదిరించే వారిపై పోలీస్‌ విచారణ జరుగుతోందని, పంచాయతీ అధికారులను బెదిరించే విధంగా మాట్లాడుతున్నట్లు తన దృష్టికీ వచ్చిందని’ ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, సర్పంచ్‌ దాసరి సంతోషి కుమారి, ఉప సర్పంచ్‌ మోపాడ కుమార్‌, తహసీల్దార్‌ సురేష్‌, ఈవోపీర్డీ ఎంవీఏ శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఎస్‌.కోటలో రౌడీయిజం, తప్పుడు పనులు జరుగుతున్నాయని సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రస్తావించడం అటు అధికారుల్లోనూ...ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.




Updated Date - 2021-06-17T05:04:05+05:30 IST