సర్కారీ దవాఖానాల్లో వైద్య పరికరాలు ఇకపై గంటల్లో మరమ్మతు

ABN , First Publish Date - 2022-08-14T08:22:36+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో యంత్ర పరికరాలను ఇకపై గం టల వ్యవధిలోనే మరమ్మతు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

సర్కారీ దవాఖానాల్లో వైద్య పరికరాలు ఇకపై గంటల్లో మరమ్మతు

మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, సంగారెడ్డి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో యంత్ర పరికరాలను ఇకపై గం టల వ్యవధిలోనే మరమ్మతు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌ కోఠిలోని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ) కార్యాలయంలో ఈ మేరకు ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (పీఎంయూ)తో పాటు ఈ-ఉపకరణ్‌ వెబ్‌సైట్‌ను ఆ యన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్ర భుత్వ ఆస్పత్రుల్లో పరికరాల నిర్వహణ విధానం అమలుకు పీఎంయూ యూనిట్‌ను ప్రారంభించామని వెల్లడించారు. ఇందుకోసం రూ.17 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. ఏదైనా పరికరం చెడిపోతే పీఎంయూ ద్వారా.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఆ వెంటనే.. పరికరం తయారీ సంస్థ సిబ్బంది వచ్చి మరమ్మతు చేస్తారని పేర్కొన్నారు.


పీఎంయూతో పాటు కాల్‌సెంటర్‌ (నం.8888526666)ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సూపరింటెండెంట్లు ఈ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి వైద్య పరికరాల మరమ్మతుపై ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. పీఎంయూతో.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాదిరిగానే సర్కారీలో కూడా గంటల వ్య వధిలోనే మరమ్మతు సాధ్యమవుతుందని వెల్లడించా రు. సర్కారీ దవాఖానాల్లో తప్పనిసరి, అదనపు ఔషధాల జాబితాను బుక్‌లెట్‌గా ప్రచురించి వైద్యులందరికీ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. శస్త్రచికిత్స పరికరాల జాబితాను ముద్రించి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఔషధాల కొనుగోలుకు రూ.500 కోట్లు కేటాయించామని.. ఇందులో రూ.100 కోట్లను ఆస్పత్రుల సూపరింటెండెంట్‌ దగ్గర ఉంచామని వివరించారు.


వచ్చే నెల నుంచి న్యూట్రిషన్‌ కిట్లు

వచ్చే నెల నుంచి బతుకమ్మ కానుకగా.. ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని లక్షన్నర మంది గర్భిణులకు రెండు ద శల్లో ‘కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌’ ఇవ్వనున్న ట్లు మంత్రి తెలిపారు. ఈ జిల్లాల్లోని గర్భిణుల్లో రక్తహీనత ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రొటీన్స్‌, మినరల్స్‌, విటమిన్ల తో కూడిన పోషకాహారం అందించి రక్తహీనతను నివారిస్తూ.. హీమోగ్లోబిన్‌ శాతం పెంచడమే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ల పంపిణీ ఉద్దేశంగా మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, అర్హులందరూ టీకా బూస్టర్‌ డోసు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్రాన్ని 50 లక్షల డోసులు కోరితే 5 లక్షలే పంపిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.  


ఆదాయం పెంపులో తెలంగాణ నంబర్‌వన్‌

సొంతంగా ఆదాయం పెంచుకోవడంలో తెలంగా ణ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రి హరీశ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శనివారం సంగారెడ్డిలో 750 మీటర్ల జాతీయ పతాకంతో నిర్వహించిన ఫ్రీడమ్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఏడేళ్ల కాలంలో 11.5 శాతం వృద్ధి రేటుతో దేశంలో ముందంజలో ఉన్నామన్నారు. దేశంలోని 20 సంసద్‌ ఆదర్శ గ్రామాల్లో 19 మన రాష్ట్రంలోనివేనని తెలిపారు. తెలంగాణ స్థాయి అభివృద్ధి బీ జేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. ఈ ర్యాలీలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. 


వైద్య విద్యార్థుల సర్దుబాటుకు ఏర్పాట్లు

వైద్య విద్య సంస్థ అనుమతులు కోల్పోయిన ఆ మూడు కళాశాలల విద్యార్థులకు సర్కారు శుభవార్త చెప్పింది. మహావీర్‌, ఎంఎన్‌ఆర్‌, టీఆర్‌ఆర్‌ కాలేజీల విద్యార్థులను ఇతర మెడికల్‌ కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దం అయింది. టీఆర్‌ఆర్‌ వైద్యవిద్య కళాశాల చేసుకున్న చివరి అప్పీల్‌ను జాతీయ వైద్య కమిషన్‌ తిరస్కరించింది. ఈ మేరకు ఆ సమాచారాన్ని శుక్రవారం రాష్ట్రవైద్యఆరోగ్యశాఖ కార్యదర్శికి తెలిపింది. ఆ కాలేజీ విద్యార్థులను ఇతర కళాశాలల్లో రీ-ఆలకేట్‌ చేయాలని సూచించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం వెల్లడించారు. వారం, పది రోజుల్లో ఆ మిగిలిన రెండు కాలేజీలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎన్‌ఎమ్‌సీ నుంచి సమాచారం రాగానే కౌన్సెలింగ్‌ చేపట్టి, మెరిట్‌ ఆధారంగా ఇతర కాలేజీల్లో సీట్లు కేటాయించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్‌లర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-14T08:22:36+05:30 IST