పొరపాటు చేశాం..తప్పు జరిగింది!

ABN , First Publish Date - 2021-04-23T09:56:23+05:30 IST

లింగోజిగూడ డివిజన్‌ను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతల బృందం ప్రగతిభవన్‌కు వెళ్లిన ఘటనపై విచారణ ముగిసింది. ‘‘పొరపాటు చేశాం.. తప్పు జరిగింది..

పొరపాటు చేశాం..తప్పు జరిగింది!

‘ప్రగతిభవన్‌’ రగడపై బీజేపీ నేతల పశ్చాత్తాపం

ముగిసిన విచారణ.. త్వరలో సంజయ్‌కు నివేదిక


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): లింగోజిగూడ డివిజన్‌ను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతల బృందం ప్రగతిభవన్‌కు వెళ్లిన ఘటనపై విచారణ ముగిసింది. ‘‘పొరపాటు చేశాం.. తప్పు జరిగింది.. ఇలా అవుతుందనుకోలేదు’’ అని పలువురు నాయకులు విచారణ సందర్భంగా వెల్లడించినట్లు సమాచారం. కనీస సమాచారం ఇవ్వకుండా కొందరు నేతలు ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పార్టీ సీనియర్‌ నేతలు ఎస్‌.మల్లారెడ్డి, ఎస్‌.కుమార్‌, యెండల లక్ష్మీనారాయణతో కూడిన నిజనిర్ధారణ కమిటీ రెండురోజుల పాటు మొత్తం 15 మందిని విచారించింది.


అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ ఏం మాట్లాడారు?  నాయకులు ఎలా స్పందించారు? ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎందుకు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది? తదితర అంశాలపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర నివేదికను ఈ కమిటీ నేడో, రేపో రాష్ట్ర అధ్యక్షుడికి అందజేయనుంది. తదుపరి చర్యల కోసం నివేదికను జాతీయ నాయకత్వానికి అందించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, విచారణ పూర్తయిన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఎలాం టి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 

Updated Date - 2021-04-23T09:56:23+05:30 IST