క్షమాభిక్షపై రీ పిటిషన్‌

Jun 17 2021 @ 01:10AM

- గల్ఫ్‌కు సైతం వెళ్దాం : మంత్రి కేటీఆర్‌ హామీ 

సిరిసిల్ల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): హత్య కేసులో దుబాయ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి క్షమాభిక్షపై రీపిటీషన్‌ వేద్దామని, ఆందోళన చెందవద్దని పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని జైల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు కలిసి మొరపెట్టుకున్నారు. 2004లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి ఉపాధి కోసం దుబాయ్‌కి వలస వెళ్లారు. ఒక కంపెనీలో పనికి కుదిరారు. జిల్లాలోని కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్‌, చందుర్తి మండలానికి చెందిన గోలం నాంపల్లి, శివరాత్రి హన్మాండ్లు  అదే కంపెనీలో పని చేశారు.  వీరంతా 2005లో కంపెనీలోని  వైర్లను దొంగతనం చేశారు.  నేపాల్‌కు చెందిన బహదూర్‌ అనే వాచ్‌మన్‌ చూడడంతో అందరూ కలిసి అతడిని హత్య చేశారు. అనంతరం పారిపోతుండగా అక్కడి పోలీసులు పట్టుకున్నారు.  వీరు వాచ్‌మన్‌ను హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో అక్కడి కోర్టు  25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దుబాయ్‌ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వంతోపాటు మానవహక్కుల సంఘాన్ని  ఆశ్రయించారు. దీంతో చలించిన మంత్రి కేటీఆర్‌ ఆ కేసు వివరాలను తెలుసుకొని  హత్యకు గురైన బహదూర్‌ కుటుంబసభ్యులతో  సంప్రదింపులు జరిపారు. విడుదల కోసం పరిహారం కింద మంత్రి కేటీఆర్‌ రూ. 15 లక్షల అందజేశారు. క్షమాభిక్ష పత్రాలపై సంతకాలు చేయించారు. అదే సమయంలో దుబాయ్‌ చట్టాల్లో మార్పులు రావడంతో వారి క్షమాభిక్షను కోర్టు కొట్టివేసింది. దీంతో 15 సంవత్సరాలుగా జైలు జీవితం గడుపుతున్నారు. తాజా చట్టాల ప్రకారం 15 ఏళ్లు గడిచిన తరువాత క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. దీంతో జైల్లో ఉన్నవారు క్షమాభిక్ష కోసం అక్కడి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 14వ తేదీన విచారణకు వచ్చినా సరైన పత్రాలు లేకపోవడంతో మళ్లీ కొట్టివేశారు. దీంతో  జైలులో ఉన్న వారికి  విముక్తి  కల్పించాలని బాధిత కుటుంబాలు మంత్రిని కలిసి విన్నవించుకున్నాయి. దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ దుబాయ్‌ రాయబార కార్యాలయం అధికారులను   సంప్రదించి సమయం తీసుకుంటానని, గల్ఫ్‌కు వెళ్లి క్షమాభిక్ష రీ పిటీషన్‌ వేద్దామని అన్నారు. బాధిత కుటుంబాలను కూడా తీసుకెళ్తానని తెలిపారు. 

Follow Us on: