10,00,000 ఉద్యోగాలను వచ్చే 18 నెలల్లో భర్తీ చేయండి

Published: Wed, 15 Jun 2022 02:56:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
10,00,000 ఉద్యోగాలను వచ్చే 18 నెలల్లో భర్తీ చేయండి

కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ప్రధాని మోదీ ఆదేశం

ఈ నిర్ణయంతో యువతలో నమ్మకం, ఆత్మవిశ్వాసం: అమిత్‌ షా

ఉద్యోగాల కల్పనలో కాదు.. వార్తల కల్పనలో మోదీ దిట్ట: రాహుల్‌

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని మోదీ గతంలో హామీ ఇచ్చారు

ఈ లెక్కన 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది

బూటకపు వాగ్దానాల ప్రహసనం ఇంకెన్నాళ్లు: కాంగ్రెస్‌ ధ్వజం

పీఎంవో ప్రకటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విపక్షాలు

రానున్న ఏడాది కాలంలో 1.48 లక్షల పోస్టుల భర్తీ: రైల్వే శాఖ

ప్రధాని ఆదేశాల మేరకు నియామకాలు చేపడతామన్న శాఖలు


న్యూఢిల్లీ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు శుభవార్త. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్‌ మోడ్‌లో భర్తీ చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను, విభాగాలను ఆదేశించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాని ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పీఎంవో ట్విటర్‌ ద్వారా తెలిపింది. నిజానికి ఏప్రిల్‌ నెల నుంచే కేంద్రం ఉద్యోగాల భర్తీపై కసరత్తు ప్రారంభించింది. తమ తమ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను అన్ని శాఖలూ ప్రధాని కార్యాలయానికి సమర్పించాయి. ఈ క్రమంలో అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని ఇటీవల భేటీ అయ్యి నాలుగు గంటలపాటు చర్చించారు. నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలూ పీఎంవోకు సమర్పించిన వివరాల ప్రకారం అత్యధిక ఖాళీలు రైల్వే శాఖలో ఉన్నట్టు సమాచారం. కాగా.. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందంటూ విపక్షాలు మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. మోదీ నిర్దేశించిన ఏడాదిన్నర కాలం 2023 డిసెంబరు నాటికి పూర్తవుతుంది. అంటే సరిగ్గా.. 2024 ఎన్నికలకు ముందు.


కేంద్రప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ 18 నెలల్లో భర్తీ చేయడం ద్వారా విపక్షాల విమర్శలను తిప్పికొట్టి 2024 ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా.. ఉద్యోగాల భర్తీ ద్వారా యువతను ఆకర్షించి, వారి ఓట్లను పెద్ద ఎత్తున పొందే వ్యూహం దీని వెనుక ఉన్నట్టు వారు విశ్లేషిస్తున్నారు. కాగా.. పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ప్రధాని మోదీ ఆదేశాలు యువతలో కొత్త నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని హోం మంత్రి అమిత్‌ షా కొనియాడారు. ఇక, ప్రధాని ఆదేశాల నేపథ్యంలో తమ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసే చర్యలు చేపట్టినట్టు కేంద్ర హోం శాఖ ట్విటర్‌ ద్వారా తెలిపింది. కేంద్ర విద్యాశాఖకు చెందిన ఉన్నత విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయ స్కూళ్లల్లో బోధన, బోధనేతర ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా తెలిపారు. ఇక.. యువతను సాయుధ దళాల్లో పెద్ద ఎత్తున చేర్చుకునేందుకు చేపట్టిన విప్లవాత్మక ‘అగ్నిపథ్‌’ పథకం కూడా ఈ 10 లక్షల ఉద్యోగాల భర్తీలో భాగమేనని మరో మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వ స్థిరనిశ్చయానికిది నిదర్శనమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు.


విపక్షాల విమర్శలు..

ఏడాదిన్నరలో పదిలక్షల ఉద్యోగాలు భర్తీచేయాలన్న ప్రధాని ఆదేశాలపై విపక్షాలు స్పందించాయి. ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటూ ఎనిమిదేళ్ల క్రితం యువతను మోసం చేశారు. ఇప్పుడీ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలూ అలాంటివే. ఇది కేవలం ‘బూటకపు వాగ్దానాల ప్రభుత్వం’ కాదు.. ‘మహా బూటకపు వాగ్దానాల ప్రభుత్వం’. ప్రధాని మోదీ ఉద్యోగాల కల్పనలో నిపుణుడు కాదు. ఆయన.. ఉద్యోగాలపై వార్తల కల్పనలో నిపుణుడు’’ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. మోదీని విమర్శించడం మాని రాహుల్‌  తొలుత తనపై ఉన్న అవినీతి ఆరోపణల మీద ఈడీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక.. ఈ బూటకపు వాగ్దానాల ప్రహసనం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ 2014 ఎన్నికల ముందు వాగ్దానం చేశారని.. దాని ప్రకారం ఈ ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే మోదీ 2024 నాటికి కేవలం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో 30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఈ ‘జుమ్లేబాజీ (తప్పుడు హామీల ప్రహసనం)’ ఎంతకాలమని ఆయన నిలదీశారు. ఏటా కోట్లాది ఉద్యోగాలు ఇస్తానన్న హామీ నెరవేర్చడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని సీపీఎం విమర్శించింది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఈ నిర్ణయాన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న మోసంగా అభివర్ణించారు. ‘‘కేంద్రం తప్పుడు విధానాలు, పనితీరు కారణంగా.. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రూపాయి పత నం రికార్డుస్థాయికి చేరాయి. దీనివల్ల ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో.. పదిలక్షల ఉద్యోగాలంటూ ప్రకటన చేశారు. ఇదేమైనా ఎన్నికల మోసమా?’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. విపక్ష నేతలే కాదు.. బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ కూడా ఈ అంశంపై స్పందించారు. కొత్త ఉద్యోగావకాశాలు కల్పించడానికి, మంజూరై భర్తీకి నోచుకోని ఉద్యోగాల నియామకానికి అర్థవంతమైన చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించారు. రెండుకోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చడానికి మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

10,00,000 ఉద్యోగాలను వచ్చే 18 నెలల్లో భర్తీ చేయండి

ఏడాదిలో 1.48 లక్షల ఉద్యోగాల భర్తీ: రైల్వే

ఉద్యోగార్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రానున్న ఏడాది కాలంలో 1,48,463 నియామకాలు చేపట్టనున్నట్టు ఆ శాఖ మంగళవారం ప్రకటించింది. గత ఏనిమిదేళ్లలో (2014-15 నుంచి 2021-22 దాకా) రైల్వే శాఖ 3,49,422 మందిని నియమించుకుంది. అంటే ఏడాదికి సగటున 43,678 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు.


ఇదీ లెక్క..

‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ ఆన్‌ పే అండ్‌ అలవెన్సెస్‌’ గణాంకాల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలతో కూడా కలిపి.. దేశంలో 2020 మార్చి 1 నాటికి 40.78 లక్షల మంజూరైన పోస్టులుండగా వాటిలో 31.91 లక్షలు భర్తీ అయ్యాయి. మి గతా 21.75ు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోస్టు ల్లో దాదాపు 92ు ఐదు కీలక శాఖలు/విభాగాలకు సంబంధించినవే. అవి.. రైల్వే, రక్షణ(సివిల్‌), హోం, తపాలా, రెవెన్యూ శాఖలు. 31.33 లక్షల మంది కేంద్ర ఉద్యోగుల్లో 40.55ు రైల్వేలోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా హోంశాఖ(30.5ు), రక్షణ(12.31ు), తపాలా(5.66ు), రెవెన్యూ(3.26ు) ఉద్యోగులుండగా.. మిగతా 7.72ు మిగతా శాఖలు/విభాగాలకు చెందినవా రు. కేంద్ర పోలీసు దళాల్లో మంజూరైన పోస్టులు 10.16 లక్షలుండగా.. 2020 మార్చి 1 నాటికి వాటిలో 9.05 లక్షలు భర్తీ చేశారు. కేంద్ర ఉద్యోగులకు 2018-19లో జీతభత్యాల కింద 2,08,960.17 కోట్లు చెల్లించగా.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,25,744.7 కోట్లు చెల్లించారు. కాగా.. దేశంలో మే నెలలో 10 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయని, ఉద్యోగుల సంఖ్య 40 కోట్లకు చేరిందని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ తాజా నివేదికలో తెలిపింది. ఏప్రిల్‌లో 7.83గా ఉన్న నిరుద్యోగ రేటు ఈ నియామకాల వల్ల మే నెలలో 7.12కు తగ్గిందని వెల్లడించింది.


రోజుకు 1800 ఉద్యోగాలిస్తేగానీ..

వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని మోదీ ఆదేశాలిచ్చారు! ఈ ఏడాదిన్నరకాలంలో సగటున రోజుకు 1800 దాకా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ఆ స్థాయిలో భర్తీ చేయాలంటే నియామక సంస్థలు విపరీతమైన వేగంతో పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎ్‌ససీ), స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎ్‌ససీ), రైల్వే శాఖ భర్తీ చేస్తున్నాయి. ఈ మూడు ఏజెన్సీలూ కలిపి 2014 నుంచి ఆరేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు 5.6 లక్షలు. అంటే అన్నీ కలిపి ఏడాదికి సగటున 70 వేల దాకా నియామకాలు చేసినట్టు. వీటిలో ఆరేళ్లలో యూపీఎస్సీ చేసినవి 29 వేలు కాగా.. ఎస్‌ఎ్‌ససీ 2.28 లక్షల మందిని నియమించింది. రైల్వే భర్తీ చేసిన ఉద్యోగాలు దాదాపు 3 లక్షలు. పార్లమెంటులో సర్కారు ఇచ్చిన వివరాల ప్రకారం 2017-22 మధ్య యూ పీఎస్సీ, ఎస్‌ఎ్‌ససీ కలిసి 2,13,498 ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చాయి. భర్తీ అయినవి 1,99,580 పోస్టులే. అలాగే నిరుడు రైల్వే సమర్పించిన వివరాల ప్రకారం 2018-2021 నడుమ ఆ శాఖ 1.39 లక్షల మందిని నియమించుకుంది. ఈ లెక్కన.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఏ స్థాయిలో పనిచేయాలో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.