రిపోర్టు 24 గంటల్లో ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-05-07T05:59:09+05:30 IST

కొవిడ్‌ నిర్ధారణ రిపోర్టులు 24 గంటల్లో ఇవ్వాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత డాక్టర్లు, నోడల్‌ అధికారులపై ఉందన్నారు.

రిపోర్టు 24 గంటల్లో ఇవ్వాలి
డోన్‌లో వ్యాక్సిన్‌ కోసం తరలివచ్చిన జనం

  1. అనుమతిలేని ఆసుపత్రుల్లో చికిత్స చేయకూడదు
  2. అక్కడ మరణాలు సంభవిస్తే డీఎంహెచ్‌వోదే బాధ్యత
  3. ప్రైవేటు ఆసుపత్రులను తరచూ తనిఖీలు చేయాలి
  4. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వీరపాండియన్‌ 


కర్నూలు(కలెక్టరేట్‌), మే 6: కొవిడ్‌ నిర్ధారణ రిపోర్టులు 24 గంటల్లో ఇవ్వాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత డాక్టర్లు, నోడల్‌ అధికారులపై ఉందన్నారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, సున్నిపెంట తదితర కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌లో 6 వేల రూమ్స్‌, బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కెపాసిటీ 8 వేలకు పెంచాలన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో బాధితులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే డాక్టర్ల సలహాలతో 8వ రోజు డిశ్చార్జి చేయాలన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌లో భోజనాలు, తాగునీరు, శానిటేషన్‌ తదితర సదుపాయాల్లో పొరపాట్లు జరగకూడదన్నారు. గురువారం 42 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగం జరిగిందన్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స అందిస్తూ బాధితులు మృతి చెందితే పూర్తి బాధ్యత డీఎంహెచ్‌వోదేనన్నారు. డీఎంహెచ్‌వో, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వం మందుల కొనుగోలుకు రూ.కోటి, కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ నిర్వహణ, ఆక్సిజన్‌ కొనుగోలుకు మరో రూ.కోటి ఇచ్చిందన్నారు. పోలీసు అధికారుల సహకారంతో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ 104కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత జేసీ శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీ (రెవెన్యూ) ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి, జేసీ (సంక్షేమం) శ్రీనివాసులు, కేఎంసీ కమిషనర్‌ డీకే బాలాజీ, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పన కుమారి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, డీఆర్వో పుల్లయ్య, డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య, ఆర్‌డీవోలు, జిల్లా నోడల్‌ కమిటీ అధికారులు, కొవిడ్‌ హాస్పిటల్స్‌ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. 



 

వ్యాక్సిన్‌ కోసం.. 

డోన్‌, మే 6: డోన్‌ మున్సిపల్‌ కార్యాలయానికి వ్యాక్సిన్‌ కోసం గురువారం జనం భారీగా తరలివచ్చారు. అయితే వ్యాక్సిన్‌ అందక నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. మున్సిపల్‌ కార్యాలయంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నారన్న సమాచారంతో 200 మంది వచ్చారు. ఇందులో రెండో డోసు వారు అధికంగా ఉన్నారు. జనం తోసుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సచివాలయాల్లో వ్యాక్సిన్‌ వేస్తారని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం అందరినీ వెనక్కి పంపించారు. రెండో డోసు కోసం వారం నుంచి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు వాపోయారు. 


రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పనివేళల కుదింపు

కర్నూలు(కలెక్టరేట్‌), మే 6: పగటి కర్ఫ్యూ కారణంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పనివేళలను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఉదయం 11:30 గంటలలోపు పనులు ముగించుకుని వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. 


1,920 పాజిటివ్‌ కేసులు 

కర్నూలు(హాస్పిటల్‌), మే 6: జిల్లాలో గత 24 గంటల్లో 8,300 మందికి ఆర్‌టీపీసీఆర్‌, ర్యాపిడ్‌, ట్రునాట్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 1,920 మందికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా బారిన పడి నలుగురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 577కు చేరింది. జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 88,367కు చేరగా.. 14,323 మంది కొవిడ్‌ ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు  73,467 మంది డిశ్చార్జి అయ్యారు.

Updated Date - 2021-05-07T05:59:09+05:30 IST