కమలా హారిస్‌కు నిరసన సెగ.. బాధ్యతల నుంచి తప్పుకోవాలట!

ABN , First Publish Date - 2021-06-21T02:06:28+05:30 IST

అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించిన కమలా హారిస్‌కు నిరసన సెగ తగిలింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన 56 మంది దిగువ సభ (ప్రతినిధుల సభ) సభ్యులు.. కమలా హారిస్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ అప్పగించిన బాధత్యల నుంచి వెంటనే తప్పుకోవాలని

కమలా హారిస్‌కు నిరసన సెగ.. బాధ్యతల నుంచి తప్పుకోవాలట!

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించిన కమలా హారిస్‌కు నిరసన సెగ తగిలింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన 56 మంది దిగువ సభ (ప్రతినిధుల సభ) సభ్యులు.. కమలా హారిస్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ అప్పగించిన బాధత్యల నుంచి వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విషయంలోకి వెళితే.. 


డొనాల్డ్ ట్రంప్‌పై ఘన విజయం సాధించి, అగ్రరాజ్య అధినేతగా జనవరి 20న జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే కొలువుదీరిన కొద్ది రోజులకే వలసదారుల సమస్య బైడెన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా సరిహద్దుల్లో వేలాది మంది  అక్రమవలసదారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో చిన్నారుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ఈ క్రమంలో.. వలస సమస్య, చిన్నారుల్ని సరిహద్దుల్లో అదుపులో ఉంచడం వంటివి బైడెన్ ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చాయనే వార్తలు వెలువడ్డాయి. దీంతో జో బైడెన్ చర్యలకు ఉపక్రమించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆరోగ్యశాఖ మంత్రి కేవియర్ బెకెర్రా, హోంమంత్రి అలెజాండ్రో మయోర్కాస్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం బైడెన్ కీలక ప్రకటన చేశారు. వలసల సమస్యను పరిష్కరించే బాధ్యతను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. 



ఇలా.. వలసల సమస్యను పరిష్కరించే బాధ్యతను కమలా హారిస్ స్వీకరించి 85 రోజులు గడిచిపోయాయి. ఈ క్రమంలో హారిస్ వైఖరిపట్ల రిపబ్లికన్లు నిరసన వ్యక్తం చేశారు. వలసల సమస్యను పరిష్కరించేందుకు 85 రోజుల కాలంలో కమలా హారిస్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అమెరికా సరిహద్దుల్లో కమలా హారిస్ ఇంతవరకు పర్యటించలేదని.. బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు, స్థానిక అధికారులతో ఆమె ఇంత వరకు సమావేశం కాలేదని దుయ్యబట్టారు. సమస్య పరిష్కారం కోసం ఏమాత్రం కృషి చేయనందువల్ల.. తక్షణం ఆ బాధ్యతల నుంచి ఆమె దిగిపోవాలని 56 మంది రిపబ్లికన్ నేతలు లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితమే కమలా హారిస్ యూఎస్ పొరుగు దేశాలైన మెక్సికో, గ్వాటెమాలలో పర్యటించారు. ఈ సందర్భంగా యూఎస్‌లోకి వలసలను ప్రోత్సహించేది లేదని అక్కడి ప్రభుత్వాలకు ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 


ఇది కూడా చదవండి

అమెరికాలో తలకిందులైన పరిస్థితులు.. బైడెన్‌కు సహకరించని అమెరికన్లు!

Updated Date - 2021-06-21T02:06:28+05:30 IST