ఉదారంగా సాయం చేయండి

Nov 30 2021 @ 03:43AM

  • మానవతా దృక్పథంతో స్పందించండి
  • వరద బాధితులను ఆదుకోండి
  • ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయి
  • తాత్కాలిక ప్రాతిపదికన నిధులిప్పించండి
  • కేంద్ర బృందానికి సీఎం జగన్‌ విజ్ఞప్తి
  • మా వంతు సహకారం అందిస్తాం: బృందం


అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అతిభారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, ఉదారంగా సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వర్షప్రభావ, వరద ముంపు ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటించిన కేంద్ర హోంశాఖ (ఎన్‌ఎండీఏ) సలహాదారు కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎంతో సమావేశమైంది. వరద ప్రాంతాల్లో సహాయ, పునరుద్ధరణ  పనులకు వెంటనే నిధులు ఇవ్వాలని జగన్‌ కోరారు. ‘‘నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో సంభవించిన విపత్తు చాలా బాధాకరం. నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను మీకు అందించాం. నష్టం అంచనా తయారీకి మాకు సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది. ప్రతి రైతు పంట ఈ-క్రా్‌పలో నమోదైంది. సోషల్‌ ఆడిట్‌ కూడా చేయించాం. ఈ క్రాప్‌ రశీదు కూడా రైతులకు ఇచ్చాం. నష్టపోయిన పంటలకు కచ్చితమైన, నిర్ధారించిన లెక్కలున్నాయి. కొవిడ్‌ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందున ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయి. పునరుద్ధరణ పనులు చేయాలంటే నిధులు అవసరం. వెంటనే అడ్‌హాక్‌ (తాత్కాలిక) ప్రాతిపదికన నిధులివ్వండి. పంటలు దెబ్బతిన్నందున తడిసిన ధాన్యం, ఇతర పంటల కొనుగోలులో తేమ శాతం, ఇతర నిబంధనల్లో సడలింపులు ఇవ్వండి’’ అని కోరారు. 


ఊహించని విపత్తు: కేంద్ర బృందం

వరద ప్రాంతాల్లో పరిశీలించిన అంశాలను కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ‘‘కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లింది. పశువులు చనిపోయాయి. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు వంటి సదుపాయాలు దెబ్బతిన్నాయి. విపత్తు సమయంలో మీ నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయం. అధికారులు అద్భుతంగా పని చేశారు. కరువు ప్రాంతంలో అతిభారీ వర్షాలు కురిశాయి. ఇంత వరదను నియంత్రించే రిజర్వాయర్లు, డ్యామ్‌లు అక్కడ లేవు. తీరం దాటిన తర్వాత కూడా అల్పపీడనం చాలా రోజులు కొనసాగింది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉంది. చిత్తూరు జిల్లాలో కొంత భాగం, నెల్లూరు జిల్లాలో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది. పంట చేతికందే సమయంలో నీట పాలైంది. శనగ పంట తీవ్రంగా దెబ్బతింది. మంచినీటి పథకాలు, ఇరిగేషన్‌ కాల్వలు, బ్రిడ్జిలు, రోడ్లు బాగా దెబ్బతిని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరద వల్ల 40ు రోడ్లు, భవనాలు, 32ు వ్యవసాయ అనుబంధ రంగాలు, 16ు మేర ఇరిగేషన్‌కు నష్టం వాటిల్లింది. వీలైనంత మేర ఆదుకునేందుకు మావంతు సహకారాన్ని అందిస్తాం’’ అని హామీ ఇచ్చింది. సమావేశంలో కేంద్ర బృందం ప్రతినిధులు సత్యార్థి, అభయ్‌కుమార్‌, మనోహరన్‌, శివానీశర్మ, శ్రవణ్‌కుమార్‌ సింగ్‌, శ్రీనివాస్‌ బైరీ, అనిల్‌కుమార్‌సింగ్‌, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.