మమ్మల్ని రక్షించండి...ఉక్రెయిన్‌లోని బంకర్లలో దాక్కున్న భారతీయ విద్యార్థుల వినతి

ABN , First Publish Date - 2022-02-26T18:30:06+05:30 IST

రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ దేశంలో బంకర్లలో దాక్కున్న తమను రక్షించాలని భారత విద్యార్థులు విన్నవించారు....

మమ్మల్ని రక్షించండి...ఉక్రెయిన్‌లోని బంకర్లలో దాక్కున్న భారతీయ విద్యార్థుల వినతి

కీవ్: రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ దేశంలో బంకర్లలో దాక్కున్న తమను రక్షించాలని భారత విద్యార్థులు విన్నవించారు. ‘‘మేం బంకర్‌లో చిక్కుకుపోయాం. ఆహారం, నీరు,సరైన వెంటిలేషన్ కూడా లేదు’’అని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న బెంగళూరు విద్యార్థి మేఘన చెప్పారు. తనతోపాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన భారతీయులు బంకర్‌లో చిక్కుకున్నారని విద్యార్థి మేఘన శనివారం ఉదయం ట్వీట్ చేశారు.ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల వీడియోను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. వారికి తక్షణ సహాయం చేయాలని రాహుల్ కోరారు. వీడియోలో బెంగళూరుకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు తమను వీలైనంత త్వరగా రక్షించాలని  భారత ప్రభుత్వానికి, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించారు.


‘‘బంకర్లలో భారతీయ విద్యార్థుల విజువల్స్ కలవరపెడుతున్నాయి. చాలా మంది విద్యార్థులు తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు, వారిని అత్యవసరంగా తరలించాలి అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.‘‘మా కోసం ప్రత్యేక విమానాలు ఏవీ ఏర్పాటు చేయలేదు. మేం ఈ బంకర్‌లో ఉంటున్నాము, చాలా కష్టంగా ఉంది. సహాయం చేయాల్సిందిగా మేం అభ్యర్థిస్తున్నాం’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన వీడియోలో మేఘన పేర్కొన్నారు.‘‘ఉక్రెయిన్ దేశంలో 15,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. దయచేసి మమ్మల్ని ఖాళీ చేయండి’’ అని బెంగళూరుకు చెందిన మరో విద్యార్థిని రక్ష చెప్పింది.తన సోదరి మేఘన ఉక్రెయిన్ దేశంలోని బంకరులో చిక్కుకుందని,ఆమెను రక్షించాలని ఆమె సోదరుడు కోరారు.ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు సహాయం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 24 గంటల పాటు పనిచేసేలా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.


Updated Date - 2022-02-26T18:30:06+05:30 IST