న్యాయవిద్యలో బాలికలకు రిజర్వేషన్‌

ABN , First Publish Date - 2022-03-11T06:51:51+05:30 IST

న్యాయవిద్యలో బాలికలకు రిజర్వేషన్‌ కల్పించాలని తాను బలంగా

న్యాయవిద్యలో బాలికలకు రిజర్వేషన్‌

  •  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ


న్యూఢిల్లీ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): న్యాయవిద్యలో బాలికలకు రిజర్వేషన్‌ కల్పించాలని తాను బలంగా ప్రతిపాదిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మహిళా న్యాయాధికారుల నియామకం మంచి ఫలితాలను ఇస్తున్నదని గణాంకాల ద్వారా తెలుస్తోందన్నారు. తొలి అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని గురువారం సుప్రీం కోర్టులో ఘనంగా నిర్వహించారు. సీజేఐ రమణతో పాట సుప్రీంకోర్టు మహిళా జడ్జిలు జస్టిస్‌ ఇందిరాబెనర్జీ, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఎం.త్రివేది పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉన్న 6 వేలమంది మహిళా న్యాయమూర్తులు వర్చువల్‌గా హాజరయ్యారు.


జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై పురుషాధిక్యతే కొనసాగుతోంది. మహిళలకు కనీసం 50 శాతం ప్రాతినిధ్యానికి ఇంకా దూరంగా ఉన్నాం. మొత్తం న్యాయాధికారుల్లో తెలంగాణలో 52 శాతం, ఏపీలో 45 శాతం మహిళలే ఉన్నారు. అసోంలో 46 శాతం, ఒడిసాలో 42 శాతం, రాజస్థాన్‌లో 40 శాతం మంది మహిళలున్నారు. ఆయా రాష్ట్రాలు కల్పించిన రిజర్వేషన్లే ఇందుకు కారణం.’’ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం చరిత్రలో ఇదే తొలిసారి అని, సమీప భవిష్యత్తుల్లో దేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి రానున్నారని జస్టిస్‌ రమణ తెలిపారు. మరోవైపు, సుప్రీం కోర్టు ఆవరణలో గురువారం అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డుల అసోసియేషన్‌ కార్యాలయాన్ని రమణ ప్రారంభించారు. 


Updated Date - 2022-03-11T06:51:51+05:30 IST