జనరల్‌ కోటాలో ఉద్యోగులకే పదోన్నతుల్లో రిజర్వేషన్‌!

ABN , First Publish Date - 2021-11-06T06:35:12+05:30 IST

టీటీడీలో రిజర్వేషన్‌పై ఉద్యోగం పొందిన వారు ఎస్సీ, ఎస్టీ కోటాలో తిరిగి పదోన్నతులు పొందే పద్ధతికి బ్రేక్‌ పడనుంది.

జనరల్‌ కోటాలో ఉద్యోగులకే పదోన్నతుల్లో రిజర్వేషన్‌!

ఎస్సీ, ఎస్టీ కోటాలో నియామకం.. పదోన్నతులు పొందిన వారిపై సమీక్షించాలని జేఈవో ఉత్తర్వులు 

ప్రశ్నార్థకంలో 18 మంది డిప్యూటీ ఈవోలు, ఇతర ఉద్యోగుల పరిస్థితి 


తిరుపతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): టీటీడీలో రిజర్వేషన్‌పై ఉద్యోగం పొందిన వారు ఎస్సీ, ఎస్టీ కోటాలో తిరిగి పదోన్నతులు పొందే పద్ధతికి బ్రేక్‌ పడనుంది. జనరల్‌ కోటాలో ఉద్యోగంలో చేరిన వారికే రిజర్వేషను వర్తించనుంది. టీటీడీ ఈవోపై, విశ్రాంత ఏఈవో జె.సుబ్రమణ్యం వేసిన కంటెమ్ట్‌ ఆఫ్‌ కోర్టు కేసు నేపథ్యంలో.. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో జేఈవో సదాభార్గవి గతనెల 27న ఆయా విభాగాధిపతులకు ఉత్తర్వులు జారీ చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్‌ కోటాలో ఉద్యోగంలో చేరి.. అదే కోటాలో పదోన్నతులు పొందిన వారిపై సమీక్ష జరపాలని అందులో పేర్కొన్నారు. 2003లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ కోటాలో ఉద్యోగంలో చేరితే, అలాంటి వారికి పదోన్నతుల్లో తిరిగి రిజర్వేషన్‌ పొందేందుకు వీలు ఉండదు. ఒకవేళ జనరల్‌ కోటాలో ఉద్యోగంలో చేరితే.. పదోన్నతుల్లో రిజర్వేషన్‌ను వినియోగించుకోవచ్చు. ఉద్యో గ నియామకం లేదా పదోన్నతిలో ఏదో ఒకసారే రిజర్వేషన్‌ వాడుకోవాలి. అలా కాకుండా పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు పొందుతుండటంపై 2017 లో టీటీడీ రిటైర్ట్‌ ఏఈవో సుబ్రమణ్యం కోర్టులో కేసు వేశారు. కేరళ నుంచి 2018లో, తెలంగాణ నుంచి కూడా కొందరు ఉద్యోగులు దీన్ని ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులనే ఖచ్చితంగా అమలు చేయాలనే ఆయా న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చాయి. అయినా టీటీడీలో అమలు కాకపోవడంపై మళ్లీ కంటెమ్ట్‌ ఆఫ్‌ కోర్టుకు ఆయన వెళ్లారు. దీంతో కోర్టు సీరియస్‌ కావడంతో టీటీడీలో రిజర్వేషన్‌లో ఉద్యోగంలో చేరిన వారు, అదే రిజర్వేషన్‌ కోటాలో పదోన్నతులు పొందిన వారెవరనే వివరాలను సేకరిస్తున్నారు. కాగా, టీటీడీలో ప్రస్తుతం 22 డిప్యూటీ ఈవో పోస్టులుంటే అందులో 18 మంది ఎస్సీ, ఎస్టీలే. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్‌ను అమలు చేయటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వీరందరూ సాధారణ ఉద్యోగులతో పాటు సీనియారిటీ ప్రకారమే పదోన్నతులు పొందాల్సి ఉంటుంది. అంటే వీరిలో చాలా మంది పదోన్నతులు రద్దయ్యే అవకాశం ఉంది. మిగిలిన విభాగాల్లోనూ చాలామంది ఉద్యోగుల పరిస్థితి ఇదే. ఆయా స్థానాల్లో జనరల్‌ కోటాలో అధికారులు, ఉద్యోగులు పదోన్నతులు పొందనున్నారు. ఈ పరిణామాలపై టీటీడీలోని ఎస్‌.సి, ఎస్‌.టి ఉద్యోగులు ఓ రహస్య ప్రదేశంలో సమావేశమైనట్టు తెలిసింది. ఈ ఉత్తర్వులను దేశమంతా అమలు చేస్తేనే టీటీడీలో అమలు చేయాలని కోరాలని కొందరు పేర్కొన్నట్టు తెలిసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈవో కూడా దీనిపై ఏమి చేయలేని పరిస్థితి ఉంటుందని మరికొందరు పేర్కొన్నట్టు తెలిసింది. మరోసారి శనివారం సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. మరోవైపు ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండు చేయడానికి టీటీడీలోని జనరల్‌ ఉద్యోగులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. 

Updated Date - 2021-11-06T06:35:12+05:30 IST