ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు మృగ్యం

ABN , First Publish Date - 2021-04-09T05:39:09+05:30 IST

‘కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి, వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెలవిచ్చారు....

ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు మృగ్యం

‘కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి, వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెలవిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు,పరిశ్రమ, సేవా రంగాలను దశలవారీగా ప్రైవేటీకరించడానికి పూనుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కేంద్రప్రభుత్వం చెప్పకనే చెపుతున్నది.దీనిలో భాగంగా రైల్వే, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్, రక్షణ, బొగ్గుసంస్థలను, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది.ప్రజలకు సేవలు అందిస్తున్న బ్యాంకింగ్, బి.ఎస్.ఎన్.ఎల్ దగ్గర నుంచి దేశరక్షణకు సంబంధించిన పరికరాలను తయారు చేసే రక్షణ రంగ సంస్థలను కూడా ప్రైవేటుపరం చేస్తే దేశ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి తలకిందులు కావలిసిందేనా? భవిష్యత్తులో ఈరంగంలో ఉద్యోగ అవకాశాలు ఆశించే రిజర్వేషన్ వర్గాల ఆశలు ఆవిరికావలసిందేనా? తరతరాలుగా పీడనకు గురవుతూ అవకాశాలకు దూరంగా ఉంచబడిన, అణగదొక్కబడిన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలవారికి అవకాశాల మాటేమిటి? ప్రభుత్వరంగంలో వారికి అమలు చేస్తున్న రిజర్వేషన్లను కొనసాగించే బాధ్యత ఎవరిది? దేశంలో ప్రభుత్వరంగంలో కొత్త ఉద్యోగాలను కల్పించడం లేదు. ఉన్న ఖాళీలను భర్తీచేయడం లేదు. దీనికితోడు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే దేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ ఆ రంగంలోకే పోయినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యమేమిటి? సామాజిక న్యాయం బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ వర్గాలు ఇంకా పైకి రాలేవన్నది నిజం.కాబట్టి కేంద్రప్రభుత్వం సామాజిక అసమానతలను తొలగించే బాధ్యత నుంచి తప్పుకోవడం సమర్థనీయం కాదు.


ఎస్సీ, ఎస్టీ వర్గాలను ప్రధాన జీవనస్రవంతిలోకి తెచ్చేందుకు రాజ్యాంగ నిర్మాతలు వారికి విద్య, ఉద్యోగాలతోపాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్‌ కల్పించారు. ఆ ప్రకారం జనాభా ప్రాతిపదికపై ఎస్‌సిలకు 15శాతం, ఎస్‌టిలకు 7.5శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. 1980వ దశకంలో సామాజికంగా వెనుకబడిన తరగతులకు (ఒబిసి) 27శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చింది. వికలాంగులకు కూడా రిజర్వేషన్‌ అమలవుతున్నది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన (ఇ.బి.సి.)వారు, ముస్లింలు, ఇతర భాషాపరమైన మైనారిటీలు రిజర్వేషన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. ఏ కేటగిరీ రిజర్వేషన్‌ అయినా ప్రభుత్వ, అర్థప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న సంస్థలకే వర్తిస్తుంది. ప్రైవేటురంగం ఈ సామాజిక బాధ్యత నుండి మినహాయింపు పొందింది.


1990 దశకం నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రైవేటురంగం ఊపందుకుంది.అనేక ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుపరమైనాయి. పాలనావ్యవస్థలో కూడా కంప్యూటరీకరణ వల్ల రిక్రూట్‌మెంట్‌ తగ్గుతూ వస్తున్నది. దీనివల్ల విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ద్వారా లభించాల్సిన అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిపోతున్నాయి. రిటైర్‌ అవుతున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదు. కొత్త ఉద్యో గాలు సృష్టించడం లేదు. పైగా శాశ్వత ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ పేరుతో రిజర్వేషన్లు లేకుండా చేశారు. ఇక ప్రైవేటురంగం విస్తరిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలు మరింతగా సన్నగిల్లిపోతున్నాయి. ప్రైవేట్‌ యాజమాన్యాలు సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలుకు అంగీకరించడం లేదు. ప్రైవేటు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం వద్ద అన్ని రకాల సహాయ, సహకారాలు తీసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ నియమాలను పాటించడం లేదు. ఉద్యోగరంగంలో ప్రస్తుతం 90 శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వరంగంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తే మరో 26 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాయమైపోతాయి. అప్పుడు అవి 7 శాతానికి తగ్గుతాయి. ప్రైవేటురంగం విస్తరిస్తూ పోతే సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సమ సమాజం, సామాజిక న్యాయం ప్రశ్నార్థకంగా మిగిలిపోతాయి.


ప్రైవేటురంగానికి రిజర్వేషన్లు విస్తరించటమన్నది అత్యంతావశ్యకమైనప్పటికీ అదొక బృహత్‌ సమస్య. లాభాల ఆర్జన తప్ప సామాజిక బాధ్యత లేని ప్రైవేట్‌రంగం ఆలోచనా ధోరణిలో మార్పు తేవటం ఏమంత సులభం కాదు. చట్టం ద్వారా ఆ పని చేసేందుకు ప్రభుత్వం సాహసించదు. ప్రస్తుత ప్రపంచీకరణ దశలో లాభాల మాటే తప్ప, మనిషి కేంద్రబిందువు కాదు. అందువల్ల ప్రస్తుత ఉద్యోగావసరాలకు తగిన ప్రతిభావంతులను ఎస్‌సి., ఎస్‌టి వర్గాల నుంచి తీర్చిదిద్దడానికి ప్రభుత్వాలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యవరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, శిక్షణా వసతులు కల్పించాలి. విద్యను పరిశ్రమతో సంధానించి అవసరమైన నిపుణులను తయారుచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకు పరిశ్రమ సహకారాన్ని తీసుకోవాలి. అయితే ప్రైవేట్ రంగంలోని అన్ని స్థాయిల్లోనూ ప్రతిభావంతులే ఉంటారనుకుంటే భ్రమ. అందువల్ల ప్రారంభదశలో కొన్ని స్థాయిల ఉద్యోగాల వరకైనా రిజర్వేషన్‌ కల్పించాలి. రిక్రూట్‌మెంట్‌ అనంతరం శిక్షణ ద్వారా వారిలో వృత్తినైపుణ్యాన్ని పెంచవచ్చు. ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీలు పొందుతున్న ప్రైవేట్‌రంగం ఇందుకు కూడా సిద్ధపడకపోతే చట్టబద్ధంగా రిజర్వేషన్‌ కల్పించాలి. ఇది న్యాయమైన డిమాండ్‌ అని సమాజాన్ని ఒప్పించాలి. అలాగే దీనికి రాజ్యాంగపరంగా న్యాయపరంగా కలిగే అవరోధాలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. పార్లమెంటులో పాలక, ప్రతిపక్షాలు ఈ అంశం మీద విస్తృతంగా చర్చించాలి. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. రాజ్యాంగంలోని 15 (4), 16(4) ప్రకారం ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్న భావన నిబిడీకృతమై ఉంది. 


ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల డిమాండ్‌ రెండు కోణాల్లో సమర్థనీయం. ఈ కంపెనీలకు ప్రభుత్వమే రాయితీల మీద భూమి, ముడిసరుకు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది. అలాగే ఇందులో చెమటోడ్చే కార్మికులలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారేఅయి ఉంటారు. 


అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వేగవంతమైన అభివృద్ధికి ప్రైవేటీకరణే కారణమని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. అందులో కొంత వాస్తవం ఉంది. ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పర్యవేక్షణ కట్టుదిట్టంగా అమలవుతుంది. పని సంస్కృతి మారుతుంది. జవాబుదారీతనం పెరుగుతుంది. వృథా తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. వాటిలో సందేహం లేదు. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి ప్రైవేటీకరణే ప్రధాన కారణం. మనదేశంలో ఇప్పటికే 95 శాతం పారిశ్రామికరంగం ప్రైవేట్‌రంగంలోనే ఉంది. ఇంకా ఈ విషయంలో ముందుకుపోవడం వాంఛనీయం కాదు. కొత్త పరిశ్రమలను ప్రైవేటు రంగంలో చేరిస్తే అభ్యంతరం లేదు. కానీ పాతవాటిని, కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించేవాటిని, ప్రజాసేవలో భాగమైన రైల్వేలను, ప్రభుత్వానికి అవసరమైన అప్పులు ఇచ్చే ఎల్‌ఐసీ, బ్యాంకుల వంటి సంస్థలను కూడా ప్రైవేటీకరించడాన్ని సమాజం అంగీకరించదు. 

నేలపూడి స్టాలిన్ బాబు

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కమిటీ మాజీ సభ్యులు

Updated Date - 2021-04-09T05:39:09+05:30 IST