రిజర్వాయర్‌ వెలవెల

ABN , First Publish Date - 2022-08-09T05:24:10+05:30 IST

రిజర్వాయర్‌ వెలవెల

రిజర్వాయర్‌ వెలవెల
నీరు లేక వెలవెలబోతున్న రిజర్వాయర్‌

నీరు లేక బోసిపోతున్న పర్వతగిరి రిజర్వాయర్‌

మరమ్మతుల పేరిట నీటి నిల్వ బంద్‌

నాలుగేళ్లుగా కొనసాగుతున్న మరమ్మతులు

ఎనిమిది పంటలను కోల్పోయిన ఆయకట్టు రైతులు

ఈసారైనా పంటలకు నీరందేనా..?


పర్వతగిరి, ఆగస్టు 8: ఓ వైపు భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులు నీటితో నిండి కళకళలాడుతుంటే పర్వతగిరి మండలకేంద్రంలోని రిజర్వాయర్‌ మాత్రం వెలవెలబోతోంది. రిజర్వాయర్‌ కట్టకు మరమ్మతుల పేరుతో నాలుగేళ్లుగా అందులో నీటిని నిల్వచేయడం లేదు. ఏటా వర్షాకాలంలో వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఏళ్ల తరబడి రిజర్వాయర్‌ మరమ్మతు పనులు కొనసాగుతుండడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు దొరక్క వరుసగా ఎనిమిది పంటలను కోల్పోయారు. కట్ట పునర్నిర్మాణ పనులు 90 శాతం పూర్తయినా తూముల రిపేర్లు, గేట్ల బిగింపు వంటి కేవలం చిన్నచిన్న పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్‌లో చేరిన కొద్దిపాటి వరద నీటిని చూసి ఆయకట్టు రైతులు సాగు పనులను మొదలుపెట్టారు. పెండింగ్‌లో ఉన్న మిగతా పనులను త్వరగా పూర్తి చేసి ప్రస్తుత సీజన్‌కైనా సాగునీరు అందిస్తారేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 


మరమ్మతుల పేరిట.. 

పర్వతగిరి మండలంలోని పెద్దచెరువును 2008లోనే రిజర్వాయర్‌గా మారుస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు కట్టను వెడల్పు చేసి నీటి నిల్వ ఉంచే సరికి నాసిరకం పనుల కారణంగా కట్ట కొన్నాళ్లకే కుంగిపోయింది. అనంతరం తాత్కాలిక మరమతులు చేపట్టినా ఫలితం దక్కలేదు. ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిజర్వాయర్‌కు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు రూ.25కోట్లు కేటాయించింది. చెరువు కట్టను పూర్తిగా తొలగించి కొత్త కట్ట నిర్మించారు. కట్టకు రివిట్‌మెంట్‌, తూముల నిర్మాణం తదితర పనులను 2018లో  ప్రారంభించారు. కానీ నాటి నుంచి ఇప్పటి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరమ్మతు పనులు చేస్తుండడంతో రిజర్వాయర్‌లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటి నిల్వ చేయలేదు. అడపాదడపా చేరిన వర్షపు నీటిని కూడా దిగువకు వదిలేసేవారు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీరు లేక 8 పంటలను కోల్పోవాల్సి వచ్చింది. 


సాగు పనులు చేపట్టిన రైతులు

రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో బోర్లు, బావులు ఉన్న ఆయకట్టు రైతులు తమకున్న భూమిలో కొంత మేరకు సాగుచేసేవారు. అధిక శాతం భూములు సాగుకు నోచుకోక బీడుగా మారుతున్నాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌ కట్ట నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీరు వచ్చి చేరింది. వరదనీటిని చూసిన రైతులు ఆశతో సాగు పనులను చేపట్టారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. 



Updated Date - 2022-08-09T05:24:10+05:30 IST