జలాశయాలు కళకళ

ABN , First Publish Date - 2022-10-08T06:36:14+05:30 IST

నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి.

జలాశయాలు కళకళ

గత నాలుగైదు రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు

రిజర్వాయర్లకు భారీగా వరదనీరు

గరిష్ఠ స్థాయికి చేరిన నీటి మట్టాలు

మేహాద్రిగెడ్డ నుంచి దిగువకు నీటిని వ దులుతున్న అధికారులు

నేడు రైవాడ, తాటిపూడి నుంచి విడుదల చేసే అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. నాలుగైదు రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్‌లలోకి భారీగా నీరు చేరుతోంది. నీటి మట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇన్‌ఫ్లో ఇంకా కొనసాగుతుండడంతో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాటిపూడి, రైవాడ రిజర్వాయర్ల గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

నగరానికి తాగునీటితోపాటు పరిశ్రమలకు అవసరమైన నీరు ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి, రైవాడ, ఏలేశ్వరం రిజర్వాయర్ల నుంచి సరఫరా అవుతుంది. ఏటా జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ నైరుతి రుతుపవనాల సీజన్‌లో కురిసే వర్షాలకు రిజర్వాయర్‌లలోకి నీరు చేరుతుంది. తర్వాత అడపాదడపా వర్షాలు కురిసినా రిజర్వాయర్ల నీటిమట్టాలలో పెద్దగా మార్పులు ఉండవు. దీనివల్ల వేసవి సీజన్‌ చివరకు వచ్చేసరికి రిజర్వాయర్లలో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి చేరుతుంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా అక్టోబరు నెల ప్రారంభం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మైదాన, ఏజెన్సీలతోపాటు ఒడిశాలో విస్తరించి వున్న రిజర్వాయర్ల పరీవాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లోకి వరదనీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే రిజర్వాయర్లన్నీ గరిష్ఠ స్థాయికి చేరుకుని నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు, మూడు రోజులు భారీవర్షాలు కురిసే అవకాశం వున్నందున అధికారులు ముందుగానే అప్రమత్తమై రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. అతి ప్రధానమైన ఏలేరు రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం 83.7 మీటర్లకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. మరో ప్రధాన రిజర్వాయర్‌గా గుర్తింపుపొందిన రైవాడ రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 113.55 మీటర్ల మేర నీరు చేరింది. శుక్రవారం రాత్రి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం వున్నందున నీటిని దిగువకు విడిచిపెట్టడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే మేహాద్రిగెడ్డ గరిష్ఠ నీటిమట్టం 61 అడుగులు కాగా, బుధవారం నాటికే ఆ స్థాయికి చేరడంతో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నీటిని దిగువకు వదలడం వల్ల లోతట్టు ప్రాంతాలైన కొత్తపాలెం, జగ్గయ్యపాలెం, షీలాగనర్‌ వంటి ప్రాంతాలు మునిగిపోయాయి. తాటిపూడి రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులు కాగా శుక్రవారం నాటికి 296.3 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నీటిని దిగువకు విడిచిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ముడసర్లోవ రిజర్వాయర్‌ గరిష్ఠ నీటి మట్టం 169 అడుగులు కాగా ప్రస్తుతం 168 అడుగులకు చేరింది. గంభీరం రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 126 అడుగులు కాగా శుక్రవారం నాటికి 120.7 అడుగులకు చేరింది. రిజర్వాయర్లన్నీ నిండిపోవడంతో రెండేళ్లపాటు నగరంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదని జీవీఎంసీ నీటిసరఫరా విభాగం అధికారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2022-10-08T06:36:14+05:30 IST