డబ్బిస్తేనే రేషన్‌

ABN , First Publish Date - 2020-12-04T05:05:38+05:30 IST

రేషన్‌ సరకుల ఉచిత పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడింది.

డబ్బిస్తేనే రేషన్‌

ఉచిత పంపిణీకి మంగళం

కందిపప్పు కిలో రూ.67

బియ్యం కేజీ ఒక రూపాయి

అరకేజీ పంచదార రూ.17

రేపటి నుంచి సరుకుల పంపిణీ


నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 3 : రేషన్‌ సరకుల ఉచిత పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడింది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి గత నెల వరకు ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది. అయితే ఈ డిసెంబరు కోటా నుంచి డబ్బు చెల్లించి సరకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు ధరలను విడుదల చేశారు.  కిలో కందిపప్పునకు రూ.67, కిలో బియ్యానికి రూ.1, అరకిలో పంచదారకు రూ. 17 చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పటిలాగే బియ్యాన్ని కిలో రూ. 1కే ఇస్తారు. అయితే బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.90లోపే మేలు రకం కందిపప్పు లభిస్తుండటంతో రేషన్‌షాపులో రూ.67 చెల్లించి కార్డుదారులు కొనరేమోనని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, జిల్లాలోని 9,33,193 మంది కార్డుదారులకు శనివారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు రేషన్‌ సరకులు పంపిణీ చేస్తారు. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని, చౌకదుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని డీఎస్వో బాలకృష్ణారావు కోరారు. 


సరుకులు ఇలా...


బీపీఎల్‌ కార్డుకు కిలో రూపాయి బియ్యాన్ని కార్డులోని ఒక్కొక్క సభ్యునికి ఐదు కిలోల చొప్పున ఇస్తారు. ఒక్కొక్క కార్డుకు ఒక కేజీ కందిపప్పు రూ.67,  అరకేజీ పంచదార రూ.17కు పంపిణీ చేస్తారు.  

ఏఏపీ కార్డుదారులకు ఒక్కొక్క కార్డుకు ఉచితంగా పది కేజీల బియ్యం, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తారు.

ఏఏవై కార్డుదారులకు ఒక్కొక్క కార్డుకు కిలో రూపాయి బియ్యం 35 కేజీలు, ఒక కేజీ కందిపప్పు రూ67కు, ఒక కేజీ పంచదార రూ.13.50కు అందచేస్తారు.

Updated Date - 2020-12-04T05:05:38+05:30 IST