ltrScrptTheme3

ఇంటింటికీ రేషన.. కమీషన మింగేసింది!

Oct 26 2021 @ 23:34PM
ఆత్మకూరు సివిల్‌ సప్లయ్‌ గోదాము వద్ద రేషన డీలర్ల నిరసన

అమ్మిన సరుకుకే సొమ్ము

పెరిగిన ఖర్చులతో డీలర్ల సతమతం

ఇండెంట్‌ ఆధారంగా కమీషన ఇవ్వాలని డిమాండ్‌

ఖాళీ గోతాలపైనా రగడ


ఆత్మకూరు/ఉదయగిరిరూరల్‌, అక్టోబరు 26 : ఇంటింటికీ రేషన పంపిణీ పథకం  డీలర్లకు కష్టాలు తెచ్చి పెడుతోంది. ఇందుకు ప్రధాన కారణం రేషన పంపిణీ సమయంలో ఇంటి వద్ద లబ్ధిదారు లేకపోవడంతో సరుకుల పంపిణీ జరగకపోవడమే. ముఖ్యంగా పట్టణాల్లోనే ఈ పరిస్థితులు  ఉన్నాయి. ఒకవేళ ఇంటి వద్ద లేని వారి కోసం ఆ సమీపంలోని సచివాలయాల వద్ద ఎండీయూ ఆపరేటర్లు రేషన ఇవ్వాలని చెబుతున్నా ఆ పద్ధతి చాలా ప్రాంతాల్లో సక్రమంగా అమలు కాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తమకు వచ్చే కమీషన తగ్గిపోతోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 1,896 రేషన షాపులు ఉండగా, ఒక్కో షాపు పరిధిలో సరాసరి 500 నుంచి 700 కార్డులు ఉంటే, రేషన కోటా 60 నుంచి 80 క్వింటాళ్లు ఉంటుంది. ఈ క్రమంలో ఆ డీలర్లకు క్వింటం బియ్యానికి రూ.100 కమీషన వస్తుంది. ఈ కోటాను పూర్తిగా పంపిణీ చేస్తే సదరు డీలరుకు కమీషన రూపంలో రూ.6 వేల నుంచి 8 వేల  వరకు  వస్తుంది. గోతాలకు సంబంధించి రూ.2 నుంచి 3 వేల వరకు వస్తుంది. వచ్చే కమీషన నుంచి షాపు అద్దె, సరుకు దిగుమతి చార్జీలు, విద్యుత బిల్లులు చెల్లించాలి. ఖర్చులు పోగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.2500, పట్టణ ప్రాంతాల్లో రూ.3500 మాత్రమే మిగులుతాయి.


అమ్మిన సరుకుకే సొమ్ము


అయితే అమ్మకాలు తగ్గి నిల్వలు ఉండిపోతే అమ్మిన సరుకులకు మాత్రమే కమీషన వస్తోంది. గతంలో చౌక డిపోలలో పంపిణీ చేసేటప్పుడు కార్డుదారులందరికీ రేషన అందించడానికి డీలర్లు కృషి చేసేవారు. ఒకవేళ ఎవరైనా సరుకులు తీసుకు వెళ్లకపోయినా వారికి సమాచారం అందించి మరీ సరుకులు అందజేసేవారు. కానీ ఇంటింటికీ రేషన పంపిణీ కారణంగా సరుకులు అందించే వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక పనులు మానుకోవాల్సి వస్తుందని కొందరు కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోర్టబులిటీ అమలులో ఉన్న సమయంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్కోసారి రేషన పొందలేకపోతున్నామని పలువురు వాపోతున్నారు. ఈ క్రమంలో కొంత మేరకు అమ్మకాలు తగ్గాయి. దీనికితోడు ఖాళీ సంచులను తిరిగి అధికారులకు అప్పగించాల్సి రావడంతో వాటిపై వచ్చే లాభం కూడా తగ్గిపోయింది.  ఇండెంట్‌ పెట్టిన సరుకుల ఆధారంగా కమీషన అందిస్తే తమ కష్టాలు తీరుతాయని రేషన డీలర్లు కోరుతున్నారు. 


గోనెసంచుల గోల...


గతంలో చౌక దుకాణాల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు గోనె సంచులను తిరిగి పంపేవారు. ఇందుకోసం ఒక్కో గోనె సంచికి రూ.20 ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే, ఉచితంగా గోనె సంచులు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో డీలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఉదయగిరిలోని ఒక చౌక దుకాణానికి ప్రతినెలా 120 బస్తాలు బియ్యం సరఫరా చేస్తారు. సంచి ధర రూ.25 చొప్పున బయట విక్రయిస్తే 120 సంచులకు రూ.3125 నగదు వస్తుంది. ఈ నగదుతో అద్దె రూ.1200, కరెంటు బిల్లు రూ.300, రవాణాకు రూ.1000, సహాయకుడికి రూ.1500 చెల్లిస్తే ఇంకా డీలర్‌ జేబుకే చిల్లుపడుతోంది. ఇలాంటి తరుణంలో సంచులను ఉచితంగా ఇవ్వడంటూ ప్రభుత్వం సూచిండం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పోరుబాట పట్టిన డీలర్లు 


జిల్లాలోని 15 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద మంగళవారం రేషన డీలర్లు నిరసన గళం వినిపించారు. గోనె సంచులు (ఖాళీ గోతాలు) పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇచ్చేయాలన్న ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కమీషన బకాయిలు ఇవ్వాలని, జీవో నెం.10 అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో డీలర్ల ధర్నా చేశారు.ఇంత అన్యాయమా!?


గోనె సంచులు లాక్కుంటారా!?

యునైటెడ్‌ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శనం రమేష్‌

నెల్లూరు, కావలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద  డీలర్ల ధర్నా


కావలి, అక్టోబరు 26 : రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల పట్ల అవలంభిస్తున్న తీరు మరే రాష్ట్రంలో లేదని, చివరకు గోనె సంచులు కూడా లక్కోవడం దారుణమని, ఇంత అన్యాయం తగదని యునైటెడ్‌ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శనం రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కావలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద  రేషన డీలర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోనె సంచులు డీలర్లకే ఇవ్వాలని, కరోనా సమయంలో పంపిణీ చేసిన శనగలు, కందిపప్పునకు కమిషన, డీలర్లు డీడీలు కట్టి తెచ్చుకున్న కందిపప్పునకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డీలర్లకు వచ్చే కమిషన చాలా తక్కువని, అందులోనే దుకాణం అద్దె, విద్యుత బిల్లు, సరుకులు దించేందుకు కూలీలు డీలర్లే భరించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో ఏళ్ల తరబడి బియ్యం గోనె సంచులు డీలర్లే తీసుకుని వాటి ద్వారా వచ్చే కొద్ది పాటి ఆదాయంతో కొంత సర్దుబాటు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారన్నారు. అయితే ఖాళీ గోతాలను ప్రభుత్వమే తీసుకుని మే నెల నుంచి గోతాముకు రూ.20 ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట తప్పి ఖాళీ గోనె సంచులు ఇవ్వకపోతే 6ఏ కేసులు పెడతామని  బెదిరిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఖాళీ గోనె సంచులను లాక్కోవడం దుర్మార్గపు చర్య అన్నారు. 2021, జనవరిలో డీలర్లు డీడీలు కట్టి తెచ్చుకున్న కందిపప్పును ఐసీడీఎ్‌సకు ఉచితంగా పంపిణీ చేయించారని, దానికి సంబంధించిన డబ్బులు వెంటనే ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన సమస్యలు తీరే వరకు తాము నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన నాయకులు పీఎల్‌వీ నారాయణ, శ్రీనివాసులు, రేషన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.


నెల్లూరు (హరనాథఫురం) : డిమాండ్ల సాధన కోసం జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద రేషన డీలర్లు మంగవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా  యునైటెడ్‌ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడుతూ  ఖాళీగోతాలు డీలర్లకే ఇవ్వడంతోపాటు కమీషన పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, పలువురు డీలర్లు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.