‘నిప్పుల కుంపటి’లో నివాసం!

Jul 23 2021 @ 04:15AM

కెనడా శీతల ప్రాంతాలలో ‘పగళ్లన్నీ పగిలిపోయి నిశీథాలు విసిర్ణిల్లే’ వేడి! సాధారణంగా సదా చల్లగా ఉండే అమెరికా పశ్చిమ మండలాలలో కూడా అదే వేడిమి. సగటు ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్! విస్మయకరమైన ఈ వాస్తవం చాటుతున్నదేమిటి? మన ధరిత్రిపై మన కళ్ళ ముందే వాతావరణ మార్పు సంభవిస్తోంది. అది అంతకంతకూ తీవ్రమవుతోందనే కాదూ? కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో 500 మందిని వడగాడ్పులు బలిగొన్నాయి. పశుపక్ష్యాదులకు ఎనలేని నష్టం వాటిల్లింది. ఈ భయానక నరకానికి తోడు దావానలాలు. 


ఇదే విధమైన వడగాడ్పులు ఐరోపాను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది ఐరోపా చవిచూస్తున్న ఉష్ణోగ్రతలు, వాతావరణాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో రికార్డు చేయడం ప్రారంభమైన తరువాత ఎన్నడూలేని రీతిలో గరిష్ఠంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవును, గత ఏడాది ఉష్ణోగ్రత రికార్డును బద్దలుగొట్టే మరో సంవత్సరాన్ని మనం చూడబోతున్నాం. వాస్తవమేమిటంటే ఈ వేడిగాడ్పులు యాదృచ్ఛికంగా వీస్తున్నవి కావు. కొట్టి పారేసేవి అంతకన్నా కావు. తాత్కాలిక వాతావరణ వైపరీత్యంగా పరిగణించే వీలులేని ప్రాకృతిక పరిణామ లేదా విపరిణామ ఫలితమవి. మానవ చర్యల ప్రభావిత వాతావరణ మార్పులు లేకుండా ఇటువంటి వడగాడ్పులు సంభవించడం పూర్తిగా అసాధ్యమని వాతావరణ శాస్త్ర వేత్తలు స్పష్టం చేస్తున్నారు. చారిత్రకంగా నమోదయిన వేడిగాడ్పుల తీవ్రత స్థాయి కంటే ఈ ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఫలితంగా ప్రతి వేయి సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి ఉష్ణప్రళయం సంభవిస్తుందని వారు తెలిపారు. పారిశ్రామిక యుగాల పూర్వపు ఉష్ణోగ్రతల కంటే వర్తమాన ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేరకు అధికమయినప్పుడు ఇటువంటి వేడి గాడ్పులు ఐదు నుంచి పది సంవత్సరాల పాటు ప్రచండస్థాయిలో ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 


ఈ విపరీత పరిణామాలు మనకు తేటతెల్లం చేస్తున్న వాస్తవాలు: ఒకటి- మనం భా విస్తున్న దానికంటే వాతావరణ మార్పు శీఘ్రగతిన సంభవిస్తోంది. దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధంగా లేము; రెండు- వాతావరణ మార్పుతో అతి వృష్టి పెరుగుతుంది. ఉష్ణ మండల తుఫానులు మరింత తరచుగా సంభవిస్తాయి. వడగాడ్పులు, శీతగాడ్పులు ప్రపంచ వ్యాప్తంగా పేదలను మరింతగా బాధల సుడిలోకి నెట్టివేస్తాయి. ప్రతి రుతువులోనూ వారి నిత్య జీవితానికి విఘాతం కలుగుతుంది.ఆరోగ్య పరిస్థితులు క్షీణిప్తాయి. జీవనాధారాలను కోల్పోయి కటిక పేదరికంలోకి జారిపోతారు. పేదలే కాదు ధనవంతులు సైతం ప్రకృతి ఆగ్రహాన్ని తప్పించుకోలేరు. కెనడాలో వడగాడ్పుల ఫలితంగా సంభవించిన వందలాది మరణాలు మనకొక హెచ్చరిక లాంటివి. సమీప భవిష్యత్తులోనే మనకు పెను విషాదాలు వాటిల్లనున్నాయనే కఠోర వాస్తవాన్ని అవి మనకు సదా గుర్తు చేస్తుంటాయి. 


నేను ఈ వ్యాసాన్ని రాస్తున్న సమయంలో కూడా భావి వైపరీత్యాలను తెలియజేస్తున్న సూచకాలను పట్టించుకోవడం లేదు. ఇక విరుచుకు పడనున్న ప్రాకృతిక ప్రమాదాలను నివారించే చర్యలను ఎలా చేపడతాం? వాతావరణ మార్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికతలు అన్నీ మనకు ఉన్నాయి. అయితే వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా? లేదు. ముందస్తు నిరోధక చర్యలు చేపట్టడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా సమస్య మరింత సంక్లిష్టమవుతుంది. పరిష్కారం అసాధ్యమైపోతుంది. ఉష్ణోగ్రతల పెరుగుదలనే తీసుకోండి. వాటికి అనుగుణంగా తమ జీవనశైలిని మార్చుకోవడానికి వీలుగా సమ శీతోష్ణ ప్రాంతాలలోని ధనికులు తమ గృహాలను చల్లగా ఉంచుకునేందుకై ఎయిర్ కండిషనర్లపై మరింత ఎక్కువగా డబ్బును వెచ్చిస్తున్నారు. ఇది విద్యుత్ అవసరాలను గణనీయంగా పెంచుతోంది. ముఖ్యంగా విద్యుదుత్పత్తికి శిలాజ ఇంధనాలపై ఆధారపడుతున్న దేశాలలో హరిత గృహవాయువుల ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఫలితంగా పర్యావరణ కాలుష్యం తీవ్రమవుతోంది. 


ఉష్ణీకరణ, శీతలీకరణ సాధనాల ముమ్మర వినియోగంతో మన నగరాలలో విద్యుత్ అవసరాలు పెరిగి పోతున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 27-28 డిగ్రీల సెల్సియస్ కు మించితే ఎయిర్ కూలర్ వినియోగం పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఒక్కో డిగ్రీ పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం 190 మెగా వాట్ల మేరకు అధికమవుతుంది. మరింత విద్యుదుత్పత్తి అనివార్యమవుతుంది. హరిత గృహ వాయువుల ఉద్గారాలు పెరుగుతాయి. వాటితో పాటు ఉష్ణోగ్రతలూ పెరుగుతాయి.ఇదొక విష వలయం. ఉష్ణోగ్రతలు, విద్యుత్ మధ్య ఉన్న సంబంధానికి మరో కోణం కూడా ఉంది. మనం నివసించే గృహాల రూపరచనను కూడా పరిగణనలోకి తీసుకోవలసివుంది. ఉష్ణోగ్రత అంత ఎక్కువగా లేనప్పుడుకూడా తేమ ఉండడం, గాలి లేకపోవడం కద్దు. దీంతో మనం వాతావరణం వేడిగా ఉన్నట్టు భావిస్తాం. విద్యుత్ పంకాలు, ఎయిర్ కండిషనర్లతో ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడతాం. సంప్రదాయ గృహ నిర్మాణ కళ ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది. ఇంటి లోపల వేడి తక్కువగా ఉండేట్టు, కాంతి, గాలి బాగా వచ్చేందుకు వీలుగా పాతకాలపు భవనాలుఉండేవి. నవీన వాస్తు విజ్ఞానం భవన నిర్మాణాన్ని ప్రకృతికి అనుగుణంగా నిర్దేశించడం లేదు. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అవన్నీ ఒక విష వలయంలో భాగమే. 


ఉష్ణోగ్రతల పెరుగుదలతో నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. సాగు, తాగునీటికి దావానలాలను ఆర్పేందుకు భారీ పరిమాణంలో నీటి వినియోగం తప్పనిసరి. భూగర్భం నుంచి నీటిని తోడుకునేందుకు, దానిని రవాణా చేసేందుకు విద్యుత్‌ను వినియోగించుకోవడం అనివార్యం. మరి విద్యుత్ అవసరాలు పెరిగి, ఉత్పత్తి అధికమయినప్పుడు కాలుష్యకారక వాయువుల ఉద్గారాలు పెరుగుతాయి. ఇదొక అదుపులేని విష వలయం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని మనం స్థానిక నీటి వనరులను గరిష్ఠంగా ఉపయోగించుకోవాలి. వాననీటిని సంరక్షించుకోవాలి. తద్వారా నీటి వినియోగంలో విద్యుత్ ప్రమేయాన్ని తగ్గించుకోవాలి. 


మన భూమి అంతకంతకూ వేడెక్కుతోంది. వేడి గాడ్పులు, శీత గాడ్పులు తీవ్రమవుతున్నాయి. ఇంధన వినియోగం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా మన జీవనశైలులు మారాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకొని తీరాలి. తక్కువ శక్తితో ఎక్కువ పని చేయగలగాలి. ఇవి, వాతావరణ మార్పుల నుంచి ఎదురవుతున్న సవాళ్లు. భగ భగ మండుతున్న భూమే ఆ సవాళ్ళనెలా ఎదుర్కొవాలో మనకు నేర్పుతుంది.

సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.