మునుగోడులో బస్తీమే సవాల్‌!

ABN , First Publish Date - 2022-07-23T09:41:49+05:30 IST

రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు తెర లేవనుందా? ఇప్పటిదాకా టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలపైన దృష్టి పెట్టిన బీజేపీ.

మునుగోడులో బస్తీమే సవాల్‌!

  • రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. అసెంబ్లీ ఎన్నికల ముందు సెమీఫైనల్‌
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి
  • బీజేపీలో చేరనున్న రాజగోపాల్‌రెడ్డి!
  • నల్లగొండ జిల్లాలో సత్తా చూపాలని ప్లాన్‌
  • టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ను దెబ్బకొడితేనే
  • ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తారని అంచనా 
  • సెమీఫైనల్‌కు ఎప్పుడో సిద్ధమైన టీఆర్‌ఎస్‌
  • కేసీఆర్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి మంతనాలు
  • నేడు మునుగోడుకు భారీ తాయిలాలు
  • కాంగ్రెస్‌కు ఇది చావో.. రేవో ఎన్నిక!


హైదరాబాద్‌/నల్లగొండ, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు తెర లేవనుందా? ఇప్పటిదాకా టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలపైన దృష్టి పెట్టిన బీజేపీ.. ఈసారి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీటుపైన కన్నేసిందా? అతి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీకి, మునుగోడు శాసన సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరనున్నారా? ఈ ప్రశ్నలకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ వర్గాలు అవుననే చెబుతున్నాయి. తరచూ బీజేపీ ముఖ్యులను రాజగోపాల్‌రెడ్డి కలవడం.. రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించే ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు అంటూ కాంగ్రెస్‌ నేతలు హడావుడి చేయడం... ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీనే సర్దుకుపోవడం జరుగుతూ వస్తోంది. తాజాగా గురువారం బీజేపీ ముఖ్యనేత, కేంద్ర మంత్రి అమిత్‌షాను రాజగోపాల్‌రెడ్డి కలిసిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. వాస్తవానికి బీజేపీలో రాజగోపాల్‌రెడ్డి చేరిక అన్నది ఎప్పుడో ఖరారైందని, అదను చూసుకుని చేర్చుకునేందుకే అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టిందని చెబుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలను సాధించింది. దీంతో రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్‌ పెరిగిందని, ప్రత్యామ్నాయ రేసులో తామే ఉన్నామని అధిష్ఠానం భావిస్తోంది. ప్రజల్లోనూ ఆ భావన బలపడేట్లు చేసేందుకు మరో ఉప ఎన్నికను తెరపైకి తెచ్చి ఈ సారి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీటును కైవసం చేసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం ప్రణాళికను సిద్ధం చేసింది. 


కాంగ్రెస్‌ కంచుకోట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రె్‌సను ఓడించడం ద్వారా ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి.. శాసనసభ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యనే పోటీ అన్న వాతావరణం తీసుకురావాలన్న యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్‌రెడ్డితో అమిత్‌షా భేటీ అయ్యారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని సూచించారని, రాజగోపాల్‌రెడ్డీ సూత్రప్రాయంగా అంగీకరించారనీ చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిట్టింగ్‌ సీటును కైవసం చేసుకోవడం ద్వారా ఆ జిల్లాలో పాగా వేయడం, జిల్లాలో కాంగ్రెస్‌ ప్రాబల్యానికి గండి కొట్టడం బీజేపీ అధిష్ఠానం టార్గెట్‌గానూ చెబుతున్నారు. బీజేపీ అధిష్ఠానం.. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు నెలలో రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయవచ్చని.. డిసెంబర్‌ లోపల గుజరాత్‌ ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నికలు జరగవచ్చుననీ చెబుతున్నారు. బుధవారం ఢిల్లీలో అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. జార్ఖండ్‌ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే మధ్యవర్తిత్వం వహించారు. 45 నిమిషాలపాటు ఈ భేటీ జరగ్గా ఆగస్టు 30వ తేదీలోగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అమిత్‌షా కోరినట్టు సమాచారం. మూడు నెలల్లో ఉప ఎన్నిక వచ్చేలా చేస్తామని, గెలుపు బాధ్యత తన భుజాలపై వేసుకుంటానని, బీజేపీ శ్రేణులు మొత్తం మోహరిస్తాయని, గతంలో వచ్చిన 22 వేలకు మించిన మెజారిటీ సాధిస్తారని అమిత్‌షా భరోసా ఇచ్చినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలకు సమాచారం అందింది. మునుగోడు ఉప ఎన్నికలే జరిగితే ఆ ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు రాజగోపాల్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారతాయని, నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రె్‌సకు క్షేత్రస్థాయి నుంచీ క్యాడర్‌ ఉండడంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉందనీ చెబుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు వచ్చే ఈ ఎన్నికలను సెమీఫైనల్‌గానూ భావించ వచ్చనీ చెబుతున్నారు.


6 నెలలుగా సన్నద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌ 

మునుగోడు ఉప ఎన్నికలను ముందే ఊహించిందా అన్నట్లుగా గత ఆరు నెలలుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గం పైనే దృష్టి పెట్టింది. మంత్రి జగదీ్‌షరెడ్డి గత ఆరు నెలలుగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మునుగోడు బాధ్యతను అమిత్‌షా నెత్తికి ఎత్తుకున్నారని తెలియగానే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అప్రమత్తమైంది. గురువారం ఉదయం సీఎం కేసీఆర్‌ మంత్రి జగదీ్‌షరెడ్డిని ప్రగతిభవన్‌కు పిలిపించుకుని రాత్రి పొద్దు పోయేవరకు చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైన గట్టుప్పల్‌ మండలం ప్రకటన హామీని వెనువెంటనే క్లియర్‌ చేసేందుకు ఏర్పాటు చేశారు. మండల సాధన సమితి నేతలతో మంత్రి జగదీ్‌షరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఎనిమిది గ్రామాలతో కొత్తగా గట్టుప్పల్‌ మండలాన్ని శనివారం ప్రకటించనున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల జాబితా, ఏఏ కులం ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది, ఏఏ మండలాల్లో ఏఏ నేతలు కీలకం అన్న సమాచారాన్ని నియోజకవర్గ నేతలు, అధికారుల నుంచి ప్రగతిభవన్‌ పెద్దలు సమాచారం సేకరించారు. మునుగోడు నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పనులకు రోజుల వ్యవధిలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, భారీగా వలసలు ప్రోత్సహించేందుకు సంబంధించిన ప్రణాళికలను ఆచరణలో పెట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ మునుగోడు ఉప ఎన్నిక జరిగేతే అదే స్థాయి విజయాన్ని నమోదు చేసుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.


ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాలే!

మునుగోడు ఉప ఎన్నికల జరిగితే ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభ ఎన్నికల ముందు వచ్చే ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చావో.. రేవో లాంటివనీ ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కీలక పదవిని క్లెయిమ్‌ చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపైనే ఈ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత పెట్టాలన్న ప్రతిపాదన అధిష్ఠానం ముందు పెడతామని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సొంత సోదరుడు కావడంతో సహజంగానే కోమటిరెడ్డిపైన రాజకీయంగా ఈ మేరకు ఒత్తిడీ పెరుగుతుందని చెబుతున్నారు. కాగా.. ఉత్తరాఖండ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంస్థ.. కాంట్రాక్టులు చేస్తుందనీ, వాటి పనుల నిమిత్తమే రాజగోపాల్‌రెడ్డి తరచూ బీజేపీ పెద్దలను కలుస్తుంటారనీ కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే బీజేపీకి దగ్గరయ్యారనీ చెబుతుంటారు.


వేచి చూసే ధోరణిలో రాజగోపాల్‌

రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సను ఓడించే శక్తి బీజేపీకే ఉందని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని మూడేళ్ల క్రితమే తిరుపతిలో రాజగోపాల్‌రెడ్డి సంచలన కామెంట్‌ చేశారు. నాటి నుంచి ఆయన ఢిల్లీ బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. ఉప ఎన్నికకు వెళ్లాలని బీజేపీ నేతలు రాజగోపాల్‌పై ఒత్తిడి తెస్తున్నా ఆయన దాట వేస్తున్నారు. సాధారణ ఎన్నికలు సమీపించే నాటికి కాంగ్రెస్‌ పుంజుకుంటే ఓకే అని, లేదంటే బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిస్తే తనకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆర్థిక, మానసిక ఇబ్బందులు, తీరా గెలిచినా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే కనీసం కల్యాణలక్ష్మి చెక్కుకూడా పంచలేడు. అంతదానికి రాజీనామా, ఉపఎన్నిక ఎందుకన్న ఆలోచనలో రాజగోపాల్‌రెడ్డి ఇంతకాలం ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు తప్ప ఇతర ఏ సందర్భంలోనూ కాంగ్రెస్‌ నేతలతో రాజగోపాల్‌ కలిసి రాలేదు. అయితే తాజాగా అమిత్‌షా ఒత్తిడి నేపఽథ్యంలో ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి ఆగస్టులో తమ నాయకుడు ఒక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై రాజగోపాల్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా, మాజీ ఎంపీగా ఇటీవల పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లోకి వెళ్లి పలువురు ఎంపీలను కలిశానన్నారు. అమిత్‌షాను తరచూ కలుస్తూనే ఉన్నానని, అయితే, తమ మధ్య రాజీనామా అంశం చర్చకు రాలేదని చెప్పారు. 


టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ రాజగోపాల్‌ సోషల్‌ మీడియా వార్‌

రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అనే అంశాన్ని తేల్చుకునేందుకు తెరాస సోషల్‌ మీడియా వార్‌ను ప్రారంభించింది. ‘‘ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నరేళ్లు అయ్యింది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు, ఉప ఎన్నిక వస్తేనే టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ అభివృద్ధి చేస్తుందని మీరే చెబుతున్నారు, టీఆర్‌ఎ్‌సను ఓడగొట్టే దమ్ము నాకే ఉందన్నారు... మళ్లీ సరైన సమయం అంటూ కాలయాపన ఎందుకు? నాయకుడిగా దాటవేత సరైంది కాదు. నిజంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ముంటే మునుగోడు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే రాజీనామా చేయండి . కేవలం ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు, సమాజంలో స్టేటస్‌, మీ కారుపైన ఎమ్మెల్యే స్టిక్కర్‌, మీ కాంట్రాక్టు పనుల కోసమేనా కాలయాపన చేసేది... ఇప్పుడు రాజీనామా చేస్తే చరిత్రలో మునుగోడు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు, రాజీనామా చేయండి. ఇట్లు మునుగోడు ప్రజలు’’ పేరుతో టీఆర్‌ఎస్‌ నేతలు పోస్టింగ్‌లు మొదలుపెట్టారు. ‘‘రాజీనామా చేస్తాం అనగానే మండలం ప్రకటిస్తున్నారు, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ప్రభుత్వం అంటే నియోజకవర్గానికి ఒక రూల్‌ ఉంటుందా? ఒక నియోజకవర్గంలో 57 ఏళ్లకే పెన్షన్‌ మరో నియోజకవర్గంలో 62 ఏళ్లయినా రాదా? మా నియోజకవర్గంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వరా? ఇక మా సర్‌ జీతం అంటారా? అది ఫిక్స్‌డ్‌గా ప్రతి నెలా పేదలకే వెళుతుంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో రూ.17 కోట్లు మా ఎమ్మెల్యే సొంత నిధులు ఖర్చు చేశారు’’ రాజగోపాల్‌రెడ్డి అనుచరులు సోషల్‌ మీడియాలో ఘాటుగా బదులిచ్చారు. 

Updated Date - 2022-07-23T09:41:49+05:30 IST