టీ పోయి.. బీ వచ్చె..!

ABN , First Publish Date - 2022-10-07T08:55:50+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) శకం ముగిసింది.

టీ పోయి.. బీ వచ్చె..!

  • టీఆర్‌ఎస్‌.. ఇక బీఆర్‌ఎస్‌
  • పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం
  • ఏకగ్రీవంగా ఆమోదించిన ముఖ్య నేతలు
  • ఉప ఎన్నిక తర్వాత కార్యాచరణ ప్రణాళిక
  • ఏపీలో పార్టీ శాఖ.. ఇన్‌చార్జిగా సీనియర్‌ నేత
  • మూడు బహిరంగ సభలు.. ఆ రాష్ట్రంలో పోటీ
  • కర్ణాటక, మహారాష్ట్రలోనూ స్థానిక పార్టీలతో పొత్తు
  • తెలుగు ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో బరిలోకి..
  • జాతీయ రైతు సంఘటన్‌ ఏర్పాటుకు కసరత్తు
  • పొత్తుకు పలు పార్టీలు ముందుకొస్తాయని అంచనా
  • డిసెంబరు 9న ఢిల్లీలో సభ.. అందర్నీ రప్పించే యత్నం
  • సమావేశానికి ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు
  • 75 ఏళ్లుగా దేశాన్ని ఏలిన పార్టీలు చేసిందేమీ లేదు
  • తెలంగాణ సీఎంగా ఉంటూనే దేశవ్యాప్త పర్యటనలు
  • త్వరలో జాతీయ స్థాయి దళిత  కాంక్లేవ్‌: కేసీఆర్‌
  • ‘బీఆర్‌ఎస్‌’ను ఆమోదించండి ఈసీకి తీర్మానాన్ని అందించిన వినోద్‌, శ్రీనివాస్‌ రెడ్డి 
  • తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఎవరూ పార్టీని నమోదు చేసుకోరాదు : వినోద్‌
  • పేరు మార్చినా ప్రాంతీయ పార్టీయే: వీఎస్‌ సంపత్‌


హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) శకం ముగిసింది. తొలి నాళ్లలో ఉద్యమ బావుటా ఎగురవేసి.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎనిమిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీ.. కొత్త రూపు సంతరించుకుంది. తెలంగాణ మోడల్‌లో దేశాభివృద్ధి అన్న నినాదంతో జాతీయ పార్టీగా రూపాంతరం చెందడానికి టీఆర్‌ఎస్‌ పేరును భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎ్‌స)గా మార్చుకుంది. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మారుస్తూ చేసిన తీర్మానంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి సంతకం చేశారు. తీర్మానం ప్రతిని చదివి వినిపించగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.


 మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సుదీర్ఘ ప్రణాళికతో బీఆర్‌ఎ్‌సను విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్‌ పర్యటించనున్నారు. రానున్న రోజుల్లో ఏపీలోని మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు పెట్టాలని, అక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శాఖ ఏర్పాటు చే సి, అధ్యక్షుడిని నియమించడంతో పాటు...పార్టీకి చెందిన ఒక సీనియర్‌ నేతను ఇన్‌చార్జిగా నియమించనున్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలో స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలన్న ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నారు. కర్ణాటకకు చెందిన జనతాదళ్‌(ఎస్‌) నేత కుమారస్వామి కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో మాత్రం జేడీఎస్‌ ప్రాబల్యం ఉంది. ఉదాహరణకు బెంగళూరు నుంచి దేవెగౌడ సొంత జిల్లా హసన్‌ వరకు ఆ పార్టీకి పట్టుంది. బెంగళూరుకు మరో వైపున్న జిల్లాల్లో ఆ పార్టీకి ఏమాత్రం బలం లేదు. బీదర్‌, గుల్బర్గా, యాద్గిర్‌, రాయచూరు, బళ్లారి వంటి జిల్లాలు ఈ కోవలోకి వస్తాయి. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నందున..


 ఈ జిల్లాల్లో బీఆర్‌ఎ్‌సతో జేడీఎస్‌ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి. జేడీఎస్‌ గతంలో ఈ జిల్లాల్లో పోటీ చేసినా అది నామమాత్రమే. ఇప్పుడు బీఆర్‌ఎ్‌సతో పొత్తు పేరుతో కొంతమేరకు తెలుగు ప్రజల ఓట్ల కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ కొన్ని జిల్లాల్లో పోటీకి దిగే వ్యూహంతో కేసీఆర్‌ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు సరిఽహద్దుగా  ఉన్న మహారాష్ట్ర జిల్లాల్లో పోటీకి దిగనున్నారు. ఇందుకోసం మహారాష్ట్రలోని పార్టీలతో పొత్తులు పెట్టుకునే ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఈ రెండు రాష్ట్రాల్లోనూ మజ్లిస్‌ పార్టీతో కలిసి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే, జాతీయ స్థాయిలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. డిసెంబరు 9న నిర్వహించే సమావేశానికి... దసరా రోజు హైదరాబాద్‌ వచ్చిన నేతలతో పాటు తేజస్విని యాదవ్‌, అఖిలే్‌షయాదవ్‌ను కూడా ఆహ్వానించనున్నారు. అదే సమయంలో జాతీయస్థాయిలో రైతు సమస్యలపై పోరాడేందుకు రైతాంగ సంస్థలు, నేతలతో కలిసి రైతు సంఘటన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దళితులు, గిరిజనుల సమస్యలపైనా జాతీయ స్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. 


దేశాభివృద్ధే ధ్యేయంగా అడుగులు

స్వాతంత్య్రం వచ్చాక ఈ 75 ఏళ్లలో పలు పార్టీలు గద్దెనెక్కడం, గద్దె దిగడం తప్ప దేశానికి చేసిందేమీ లేదని కేసీఆర్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో దేశం కోసం కష్టపడి పని చేయాలన్న సంకల్పంతోనే జాతీయ పార్టీ పెట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని జాతీయ పార్టీ జెండాను పట్టుకుంటున్నామని వివరించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని, ఉద్యమం ద్వారా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడంతోపాటు అనతి కాలంలోనే అభివృద్ధిలో ముందడుగు వేశామని చెప్పారు. ఆ కోవలోనే దేశాన్ని అభివృద్ధి చేయడమే బీఆర్‌ఎస్‌ లక్ష్యమని వెల్లడించారు. దేశంలో సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయని, సాగు నీరు పుష్కలంగా ఉందని, వాటిని వినియోగించి దేశానికే కాకుండా ప్రపంచానికి అన్నం పెట్టేలా ఎదగాలన్నారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళలు, 20 శాతం ఉన్న దళిత శక్తి నిర్వీర్యం అవుతుండడం వల్లే అభివృద్ధి జరగడం లేదన్నారు. కార్యక్రమానికి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ వస్తామని చెప్పారని, కానీ వారి పరిస్థితి దృష్ట్యా తానే వద్దన్నట్లు కేసీఆర్‌ తెలిపారు.


బీఆర్‌ఎ్‌సతో కలిసి ముందుకు సాగేందుకు దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తానని, ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం.. ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతామని, దేశంలోని అనేక సామాజిక, రాజకీయ రుగ్మతలను తొలగిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. భారత్‌ రాష్ట్ర సమితికి అనుబంధంగా రైతు సంఘటన్‌ను తొలుత మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తామని, తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే.. చరిత్రలో అది సుస్థిరంగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి వైపు నడుస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. అదే పద్ధతిలో దేశ ప్రజలను కూడా లక్ష్యసాధనలో తామే గెలిపిస్తామని వెల్లడించారు.


త్వరలో దళిత కాంక్లేవ్‌

దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ వేదికగా దళిత్‌ కాంక్లేవ్‌ నిర్వహిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. పలు రాష్ట్రాల నాయకులు గురువారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి అభినందించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో తమిళనాడు ఎంపీ తిరుమావళవన్‌, రైతు నాయకులు రాకేశ్‌ రఫీక్‌, అక్షయ్‌ (ఒడిశా), సీనియర్‌ జర్నలిస్టు వినీత్‌ నారాయణ (ఢిల్లీ), సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు గుర్నామ్‌ సింగ్‌ (హరియాణా), మహారాష్ట్ర రైతునేత దశరథ్‌ సా వంత్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల అభివృద్ధికి పలుపథకాలు అమలు చేస్తున్నామని, అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


బీఆర్‌ఎ్‌సకు అద్భుత భవిష్యత్తు

ఇది కేవలం టీఆర్‌ఎస్‌ పేరు మార్పు కాదని.. దేశంలో బీఆర్‌ఎ్‌సకు అద్భుత భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ దళితనేత, వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్‌ పేర్కొన్నారు. జాతీయ పార్టీగా మార్పు చేయడంలో సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకురన్నారని.. సీఎం కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నాయకుడని, ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణను సాధించిన ఆయన ఇప్పుడు దేశ ప్రజల ప్రగతి కోసం ముందడుగు వేస్తున్నారన్నారు. దళిత బంధు, రైతు బంధు విప్లవాత్మక పథకాలని, తెలంగాణ మాదిరిగానే దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న కాలంలో అందరం కలిసి పని చేద్దామన్నారు.


దేశవ్యాప్తంగా విజయం సాధించాలి

పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా విజయం సాధించాలని జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆకాంక్షించారు. ఎటువంటి స్వార్థం లేకుండా దేశ నిర్మాణం కోసం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌.. అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏడేళ్లుగా కేంద్రంలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, దానికి గట్టి సమాధానం చెప్పాలని కేసీఆర్‌ నిర్ణయించుకోవడం హర్షణీయమన్నారు. ఆయన ప్రయత్నానికి తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు


రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు

టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎ్‌సగా మార్పు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంపై హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో పలు చోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నాయి. తమ అధినేత జాతీయ రాజకీయాలకు వెళ్లడం గర్వకారణమని, తెలంగాణను అభివృద్ధి చేసినట్లుగానే దేశాన్ని కూడా ప్రగతి వైపు నడిపిస్తారని మంత్రులు, ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు అభిప్రాయపడ్డారు. ద్రావిడ దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావుతోపాటు హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన రైతు ఐక్య సంఘటన్‌ నాయకులు కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్‌ఎ్‌సకు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. 


హాజరు కాని ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు హాజరయ్యారు. అయితే, ఇంత ముఖ్యమైన సమావేశానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కాలేదు. దసరా సందర్భంగా ఆమె నివాసంలో ఆయుధ పూజ ఉండటం వల్లే ఈ సమావేశంలో పాల్గొనలేదని తెలుస్తోంది. 

Updated Date - 2022-10-07T08:55:50+05:30 IST