‘స్పందన’ సేవలు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-07-27T05:34:17+05:30 IST

కొవిడ్‌ కారణంగా కలెక్టరేట్‌లో నిలిచిపోయిన స్పందన కార్యక్రమం సోమవారం పునఃప్రారంభమైంది. కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ప్రారంభించారు.

‘స్పందన’ సేవలు పునఃప్రారంభం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు

229 అర్జీలు స్వీకరించిన అధికారులు

విశాఖపట్నం, జూలై 26: కొవిడ్‌ కారణంగా కలెక్టరేట్‌లో నిలిచిపోయిన స్పందన కార్యక్రమం సోమవారం పునఃప్రారంభమైంది. కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ప్రారంభించారు. తొలిరోజు అధికారులు 229 అర్జీలను స్వీకరించారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరిగే విషయం తెలిసిందే. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులు, విజ్ఞాపణలు ఈ సందర్భంగా అధికారులకు తెలియజేసేవారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అర్థించేవారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యకమాన్ని కొన్నాళ్ల క్రితం అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో సోమవారం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.


ఈ సందర్భంగా జేసీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ గత స్పందన కార్యక్రమాల్లో వచ్చిన చాలా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి వీలైనంత వేగంగా పరిష్కరించాలని అయా విభాగాల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కాలపరిమితిలోగా ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదులపై సీఎం కార్యాలయం పర్యవేక్షణ ఉన్నందున ప్రతి సమస్యకు ఉత్తమ పరిష్కారం (క్వాలిటీ డిస్పోజల్‌) చూపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు అరుణబాబు, కల్పనాకుమారి, డీసీపీ గౌతమిశాలి, పలు విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-27T05:34:17+05:30 IST