అవిశ్రాంత విప్లవ మేధోశ్రామికుడు

ABN , First Publish Date - 2020-10-20T08:55:21+05:30 IST

డాక్టర్‌ జశ్వంత్‌రావు కమ్యూనిస్టు తాత్విక, రాజకీయ, నిర్మాణ దృక్పథం తిరుగులేనిది. అచంచలమైన జశ్వంత్‌ విశ్వాసాలు ...

అవిశ్రాంత విప్లవ మేధోశ్రామికుడు

డాక్టర్‌ జశ్వంత్‌రావు కమ్యూనిస్టు తాత్విక, రాజకీయ, నిర్మాణ దృక్పథం తిరుగులేనిది. అచంచలమైన జశ్వంత్‌ విశ్వాసాలు కమ్యూనిస్టు విప్లవోద్యమంలో నిర్మాణాత్మక కృషికి దోహదపడ్డాయి. ప్రశాంత్‌ పేరుతో ఆయన చేసిన రచనలు తన అంతరంగాలలో దోపిడీ వ్యవస్థపై ఉన్న ఆగ్రహాన్ని, దానిపై ఉన్న ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాయి. పార్టీ పూర్తికాలపు కార్యకర్తగా 1976లో ప్రకటించుకొన్న జశ్వంత్‌ పెద్ద బరువు నెత్తుకున్నాడు. విప్లవోద్యమంలో సంభవించిన వివిధ పరిణామాల్లో సామ్రాజ్యవాద, భూస్వామ్య, దళారీ బూర్జువావర్గ రాజకీయాలను ఎండగట్టే పనిలో నిమగ్నమయ్యాడు. పార్టీ నిర్దేశించిన, పార్టీకి అవసరమైన ఈ పనిపైనే తన దృష్టి కేంద్రీకరించాడు. 1978నుంచి వివిధ ప్రాంతాలలో పార్టీ నిర్వహించిన క్లాసులలో బోధకుడి పాత్ర నిర్వహించాడు. ఎన్నో వ్యాసాలను అనువాదం చేశాడు. తరిమెల నాగిరెడ్డి ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకం రెండవ ముద్రణకు ముందుమాట ఆయన విశ్లేషణాశక్తిని చాటుతుంది. 1981నుంచి జనశక్తి పత్రిక జశ్వంత్‌, మధు, రంగనాథ్‌ గార్ల నిర్వహణలో ఒక స్థాయిని అందుకుంది. జశ్వంత్‌ పార్టీ ఇంగ్లీషు పత్రికల నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు. ఏడు సంస్థల ఐక్యతతో ‘జనశక్తి’ కేంద్ర ఇంగ్లీషు పత్రికగానే రావాలన్న నిర్ణయం, జశ్వంత్‌ ఎడిటర్‌ బాధ్యతలు నిర్వహించాలన్న కేంద్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఆయన బొంబాయి కేంద్రంగా పత్రికను నిర్వహించాడు. కామ్రేడ్‌ కానూ సన్యాల్‌ వ్యవస్థాపక ఎడిటర్‌గా వ్యవహరించిన ‘క్లాస్‌స్ట్రగుల్‌’ కేంద్రపత్రిక ఎడిటర్‌గా నిన్నటివరకూ వ్యవహరించాడు. సోదర గ్రూపుల ఐక్యతా చర్చలన్నింటిలోను జశ్వంత్‌ ఒక పాత్ర నిర్వహించాడు. కామ్రేడ్స్‌ అందరికీ జశ్వంత్‌ పైకి కనబడని ఆప్తుడు. ఉద్యమ కార్యకర్తలకు మరీ ఆప్తుడు. జశ్వంత్‌ ఆదర్శప్రాయుడు. డాక్టర్‌ జశ్వంత్‌ నీకు ఆరుణాంజలి!

విశ్వం

ప్రధాన కార్యదర్శి, సీపీఐ (ఎం–ఎల్‌)

(నేడు విజయవాడ ఎం.బి.భవన్‌లో జశ్వంతరావు సంస్మరణ సభ)

Updated Date - 2020-10-20T08:55:21+05:30 IST