తరుగు పేరిట రైస్‌మిల్లర్ల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-13T05:43:47+05:30 IST

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయే లేదో ఆంక్షలు మొదలయ్యాయి. జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోలు మొదలుకాగా తరుగు పేరిట రైస్‌మిల్లర్‌ల ఆంక్షలు మొదలయ్యాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు జరిపి రైస్‌మిల్లర్‌లకు చేరవేసి రైతులుకు న్యాయం చేయాల్సిన

తరుగు పేరిట రైస్‌మిల్లర్ల ఆంక్షలు

ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు

లారీలు ఖాళీ చేసేందుకు ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లు

క్వింటాకు రెండు కిలోల పైనే తరుగు 

చోద్యం చూస్తున్న సహకార సొసైటీలు

బోధన్‌, ఏప్రిల్‌ 12: కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయే లేదో ఆంక్షలు మొదలయ్యాయి. జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోలు మొదలుకాగా తరుగు పేరిట రైస్‌మిల్లర్‌ల ఆంక్షలు మొదలయ్యాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు జరిపి రైస్‌మిల్లర్‌లకు చేరవేసి రైతులుకు న్యాయం చేయాల్సిన సహకార సొసైటీలు ఈ వ్యవహారంలో చోద్యం చూస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు తరుగు వ్యవహారంతో నీరసపడ్డాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు మొదలై రెండు మూడు రోజులు కాగా కాటా వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్‌లకు పంపితే మిల్లర్‌లు లారీలు ఖాళీ చేయకుండా సతాయిస్తున్నారు. రోజుల తరబడి లారీలను మిల్లర్‌ల వద్దే నిలిపివేస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే ధాన్యం నాణ్యత లేదని తరుగు ఎవరు ఇస్తారని మిల్లర్‌లు ప్రశ్నిస్తున్నారు. సహ కార సొసైటీలు వీటికి జవాబు చెప్పలేక రైతులను ముందుకు నెడుతున్నాయి. మరోవైపు రైతులు తామేంచేస్తామని పండించిన ధాన్యాన్ని కాటా చేసి పంపితే తరుగు పేరిట ఆంక్షలు పెడుతున్నారని లబోదిబోమంటున్నారు. మరోవైపు రైస్‌ మిల్లర్‌లు నాణ్యత లేని ధాన్యాన్ని తాలుపొట్టు తీయని ధాన్యాన్ని తమవద్దకు పంపితే తమకు నష్టం వాటిల్లుతుందని తాము ధాన్యం లారీలను ఖాళీ చేయలే మని తేగేసి చెబుతున్నారు. ఇప్పటికే క్వింటాలుకు రెండు కిలోల తరుగును తీస్తుండగా అది సరిపోదు అన్నట్లుగా మిల్లర్‌లు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేప థ్యంలో రైతులు వరిధాన్యం పండించి దైన్యమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

క్వింటాలుకు రెండు కిలోల తరుగు

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలవ్వగానే సహకార సొసైటీలు ఆంక్షలు పెట్టాయి. రైస్‌మిల్లర్‌లు ధాన్యం లారీలను ఖాళీ చేయాలంటే తప్పనిసరి తరుగును ఇవ్వాల్సిందేనని సొసైటీ కార్యదర్శులు, చైర్మన్‌లు రైతుల పై ఒత్తిడి పెంచి తరుగుకు ఒప్పిస్తున్నారు. లేనట్లయితే ధాన్యాన్ని ఎగబోసి, పూర్తిగా ఆర బెట్టి తాలు, పొట్టు లేకుండా తీసుకొని రావాలని తేమశాతం సరిగ్గా చూసుకోని రావాలని అప్పుడే ధాన్యంకాటా పెడతామని ఆంక్షలు పెడుతున్నారు. ఈ ఆంక్షల కన్న రెండు కిలోల తరుగే మేలనట్లుగా రైతులు సడిచప్పుడు లేకుండా ధాన్యం కాటాకు ఒప్పుకుంటున్నారు. రెండు కిలోల తరుగుతో ధాన్యం కాటా చేసి పంపిన రైస్‌మిల్‌ల వద్ద ధాన్యం లారీలు ఖాళీ కావడం లేదు. మరోవైపు క్వింటాలుకు రెండు కిలోల తరుగుకే రైతులు లబోదిబోమంటుండగా రైస్‌మిల్లర్‌లు మాత్రం తమకు నష్టం వాటిల్లుతుందని తరుగు పెంచా ల్సిందేనని, లేకుంటే ధాన్యం ఆరబోసి తాలు, పొట్టు లేకుండా పూర్తి స్థాయి నాణ్యతతో తేవాలని ఆంక్షలు విధిస్తున్నారు. చివరకు నాలుగు కిలోల తరుగు తొలగిస్తామని లోలోపల ఆంక్షలు పెడుతున్నారు.  ఆం క్షల పట్ల రైతులు గగ్గొలు పెడుతున్నారు. క్వింటాలుకు రెండు కిలోల తరుగుకే పెదవి విరుస్తున్న రైతులు నాలుగు కిలోల తరుగు నిబంధన ల తో మండిపోతున్నారు. మరోవైపు కాటా చేసి పంపిన ధాన్యం లారీలు రైస్‌ మిల్‌ల వద్ద నిలిచిపోతుండడం రైతులను ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. 

మొదట రా రైస్‌మిల్‌లకే ధాన్యం కేటాయింపులు

ప్రతియేటా వేసవికాలం ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌మిల్‌లకు మాత్రమే కేటాయిం చేవారు. వర్షకాలం ధాన్యం బాయిల్డ్‌, రా రైస్‌మిల్‌లకు కేటాయిస్తు వస్తుండగా వేసవికాలం ధాన్యం మాత్రం బాయిల్డ్‌ రైస్‌మిల్‌లకు కేటాయించేవారు. రా రైస్‌ మిల్‌లకు వేసవికాలం ధాన్యాన్ని ఎప్పుడు ఇచ్చేవారు కాదు. అయితే ఈ ఏడాది నిబంధనలు మారడం ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణకు ఆంక్షలు విధించడంతో ఈ ఆంక్షల మేరకు బాయిల్డ్‌ బియ్యం తీసుకునే పరిస్థితులు లేక పోవడం రా రైస్‌మిల్‌లకే వేసవికాలం ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. తొలి విడతలో జిల్లాలోని అన్ని రా రైస్‌మిల్‌లకు ధాన్యం కేటాయింపులు చేశారు. కొనుగోలు కేంద్రాల ధాన్యాన్ని రా రైస్‌మిల్‌లకు కేటాయించడంతో రా రైస్‌మిల్‌ల యజ మానులు ధాన్యం లారీలు ఖాళీ చేసేందుకు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. మరికొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే రైస్‌మిల్‌ల యజమానులు కావడంతో హామాలీ లు లేరని, మిల్లులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని సాకులు చూపుతూ ధాన్యాన్ని తీసుకోవడం లేదు. జిల్లా అధికారులు రా రైస్‌మిల్‌లకు ధాన్యం కేటాయింపులు చేసి కొనుగోలు కేంద్రాల వారీగా రైస్‌మిల్‌లను కేటాయించిన ధాన్యం లారీలను ఖాళీ చేయడం లేదు. వేస వికాలం ధాన్యం నష్టం వస్తుందని ముందే పసిగడుతున్న రా రైస్‌మిల్‌ యజమాను లు తరుగు నిబంధనలు కొలిక్కి వచ్చేంత వరకు ధాన్యం లారీలు ఖాళీ చేసేందుకు వెనుకాముందాడుతూ కుంటి సాకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు రైతులకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. అంతేకాకుండా బాయిల్డ్‌ రైస్‌మిల్‌ యజమానులు ఆంక్షలు లేకుండా ధాన్యం లారీలు ఖాళీ చేసే పరిస్థితులు ఉండగా రా రైస్‌మిల్‌ల యజమానులు మాత్రం రైతులను ఇబ్బందులకు గురిచేసేలా ఆంక్షలు పెడుతూ ధాన్యం లారీలను ఖాళీ చేయకపోవడం రైతులకు కష్టాలను తెచ్చిపెడుతోంది. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న ఇబ్బందులపై సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-04-13T05:43:47+05:30 IST