వంట నూనెల ధరల్లో భారీ తగ్గుదల : కేంద్రం

ABN , First Publish Date - 2021-12-30T23:36:50+05:30 IST

దిగుమతి సుంకాలను తగ్గించడంతో వంట నూనెల ధరలు

వంట నూనెల ధరల్లో భారీ తగ్గుదల : కేంద్రం

న్యూఢిల్లీ : దిగుమతి సుంకాలను తగ్గించడంతో వంట నూనెల ధరలు నిలకడగా తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే చెప్పారు. రబీ సీజన్‌లో ఆవాల పంట మెరుగ్గా ఉంటుందని, ఫలితంగా వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.  


పాండే గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దిగుమతి సుంకాలను తగ్గించడంతో వంట నూనెల ధరలు నిలకడగా తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. రబీ సీజన్‌లో ఆవాల పంట మెరుగ్గా ఉంటుందని, ఫలితంగా వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. బియ్యం, గోధుమల ధరలు అత్యంత స్థిరంగా ఉన్నాయని, పప్పు దినుసుల ధరలు నిలకడగా ఉన్నాయని చెప్పారు. కూరగాయలు, ముఖ్యంగా ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, టమాటా రిటెయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి అవసరమైన కూరగాయల ధరల్లో పెరుగుదల చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండబోదని సంకేతాలు వస్తున్నాయని చెప్పారు. 


మన దేశ వినియోగదారులకు అవసరమైన వంట నూనెలో 60 శాతం వంట నూనె కోసం దిగుమతులపై ఆధారపడవలసి వచ్చినపుడు సహజంగానే అంతర్జాతీయ ధరల ప్రభావం పడుతుందని చెప్పారు. వంట నూనెల దిగుమతిపై సుంకాన్ని శూన్య (సున్నా) స్థితికి తగ్గించినట్లు తెలిపారు. దీనివల్ల వంట నూనెల రిటెయిల్ ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్లు తెలిపారు. ఈ రంగంతో సంబంధంగల అందరితో అనేక సమావేశాలు నిర్వహించామని, సుంకాల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయాలని కోరామని తెలిపారు. ఉదాహరణకు, డిసెంబరు 24 తర్వాత రుచి సోయా ఇండస్ట్రీస్ లీటరు సోయాబీన్ నూనెకు రూ.30 చొప్పున తగ్గించి, రూ.152కు అమ్ముతోందన్నారు. అదేవిధంగా అదానీ విల్మర్ లీటరు ఫార్చ్యూన్ సోయా ఆయిల్‌ను రూ.155 చొప్పున అమ్ముతోందన్నారు. వంట నూనెల రిటెయిల్ ధరలను అన్ని ప్రధాన కంపెనీలు తగ్గించాయని వివరించారు. 


మలేసియాలో ఉత్పత్తి తగ్గడంతో అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు పెరిగాయన్నారు.ఇండోనేషియాలో బయోడీజిల్‌కు మళ్ళటం, అర్జంటైనాలో పొద్దు తిరుగుడు పంట విఫలమవడం  కూడా ప్రభావం చూపుతున్నట్లు చెప్పారు. సాగుబడి, వాతావరణం, వినియోగం వంటి అంశాల ప్రభావం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల లభ్యత తగ్గుతోందని, ధరలు పెరుగుతున్నాయని వివరించారు. 


అయితే ఈ ఏడాది మన దేశంలో వంట నూనెల గింజల ఉత్పత్తి పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఉదాహరణకు ఆవాల సాగు రబీ సీజన్‌లో ఓ సంవత్సరం క్రితంతో పోల్చితే 32 శాతం ఎక్కువగా ఉందన్నారు. ధరలు తగ్గడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో వారానికోసారి సమావేశాలు నిర్వహిస్తోందని, నిత్యావసరాల ధరలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని తెలిపారు. 


Updated Date - 2021-12-30T23:36:50+05:30 IST