విరిగిపడిన రిటైనింగ్‌ వాల్‌

ABN , First Publish Date - 2020-07-06T09:40:46+05:30 IST

45వ డివిజన్‌ సొరంగం కొండ ప్రాంతంలో రిటైనింగ్‌ వాల్‌ శిథిలాలు కూలడంతో పెనుప్రమాదం త్రుటిలో తప్పింది.

విరిగిపడిన రిటైనింగ్‌ వాల్‌

భవానీపురం, జూలై 5 : 45వ డివిజన్‌ సొరంగం కొండ ప్రాంతంలో రిటైనింగ్‌ వాల్‌ శిథిలాలు కూలడంతో పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగిళ్లు దెబ్బతినగా, రెండిళ్లకు రేకుల షెడ్లు ఽధ్వంసం అయ్యాయి. వరండాలో నిద్రపోతున్న ఈటే కనకరావు అనే వృద్ధుడిపై శిథిలాలు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.  శనివారం రాత్రి కురిసిన వర్షంతో మట్టిపెళ్లలు జారి పడుతుండటంతో ఇళ్లలోని నివాసితులు అప్రమత్తమయ్యారు. దీంతో బొల్లి పద్మావతి, జి.గంగాధర్‌, సరగడ పొలమ్మ, ఈటీ లక్ష్మి, గంజి దుర్గ నిరాశ్రయులయ్యారు. రేకుల షెడ్డుపై శిథిలాలు పడటంతో ఇంట్లోని వస్తువులను తీసుకోకుండానే బయటకు వచ్చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిని బట్టిపాటి సంధ్యారాణి, శివ, ఇతర నాయకులు పోలీసులకు సమాచారం అందించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు తెలియజేశారు. 


బాధితులకు ఆదుకోవాలి : కేశినేని శ్వేత డిమాండ్‌

రిటైనింగ్‌ వాల్‌ కూలడంతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత డిమాండ్‌ చేశారు. ప్రమాదం జరిగిన తీరును టీడీపీ 45వ  డివిజన్‌ అధ్యక్షుడు మైలవరపు కృష్ణ ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆదివారం ఉదయం ఆమె సంఘటనా స్థలాన్ని పరిశీలించి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నారాయణమూర్తితో మాట్లాడారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.


పశ్చిమ తహసీల్దార్‌ మాధురితో ఫోన్‌లో మాట్లాడి నష్టపోయిన వారికి ఇళ్లు కేటాయించాలని కోరారు. కాగా, టీడీపీ 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిని మాధురి లావణ్య తండ్రి, డివిజన్‌ అధ్యక్షుడు మైలవరపు కృష్ణ మూడు ఇళ్లల్లోని బాధితులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ.15వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. సీపీఎం నగర కమిటీ సభ్యులు ఎల్‌.మోహన్‌రావు, సీఐటీయూ పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయి సత్యబాబు బాధితులను పరామర్శించారు. జనసేన 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి బొమ్మ గోవింద్‌ లక్ష్మి బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-07-06T09:40:46+05:30 IST