Nupur Sharmaపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు... తీవ్ర అభ్యంతరం తెలిపిన విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు...

ABN , First Publish Date - 2022-07-05T21:22:14+05:30 IST

భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి సస్పెండయిన నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు

Nupur Sharmaపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు... తీవ్ర అభ్యంతరం తెలిపిన విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు...

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి సస్పెండయిన నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. అత్యున్నత న్యాయస్థానం ‘లక్ష్మణ రేఖ’ను దాటిందని, తక్షణమే అత్యవసర దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా తమ కర్తవ్యాలను నిర్వహించినపుడు మాత్రమే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని తెలిపారు. 


నూపుర్ శర్మ మే నెలాఖరులో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ముస్లింలు వివిధ రాష్ట్రాల్లో కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులన్నిటినీ ఢిల్లీలోనే విచారించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి. ఆమె వాచాలత్వంతో మాట్లాడారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో జరుగుతున్నదానికి పూర్తి బాధ్యత ఆమెదేనని పేర్కొంది. యావత్తు దేశానికి ఆమె క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా వెకేషన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. 


ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ విశ్రాంత న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లు, రక్షణ దళాల మాజీ అధికారులు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘‘అన్ని వ్యవస్థలు తమ కర్తవ్యాలను రాజ్యాంగానికి అనుగుణంగా  నిర్వహించినంత వరకు మాత్రమే ఏ దేశంలోని ప్రజాస్వామ్యమైనా మనుగడ సాగిస్తుందని ఆసక్తిగల, ప్రభావిత పౌరులుగా మేము విశ్వసిస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ఇటీవల చేసిన వ్యాఖ్యలు ‘లక్ష్మణ రేఖ’ను దాటాయి, బహిరంగ లేఖను విడుదల చేసే విధంగా మమ్మల్ని ఒత్తిడి చేశాయి’’ అని పేర్కొన్నారు. 


దిద్దుబాటు అత్యవసరం

నూపుర్ శర్మ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చేసిన ఈ దురదృష్టకర వ్యాఖ్యలు అతి పెద్ద ప్రజాస్వామిక దేశపు న్యాయ వ్యవస్థపై చెరగని మచ్చ అని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ చరిత్రలో ఈ దురదృష్టకర వ్యాఖ్యలకు ఉదాహరణలు లేవన్నారు. ప్రజాస్వామిక విలువలు, దేశ భద్రతపై తీవ్రమైన పర్యవసానాలకు దారి తీసే అవకాశం ఉన్నందువల్ల అత్యవసరంగా దిద్దుబాటు చర్యలను చేపట్టాలని పిలుపునిచ్చారు. 


నూపుర్ శర్మకు తిరస్కరణ

జ్యుడిషియల్ ఆర్డర్‌లో లేనటువంటి ఈ వ్యాఖ్యలు ఏ విధంగానూ నిష్పాక్షికత, గౌరవ, మర్యాదలతో కూడిన న్యాయ వ్యవస్థ వేదికపై సమర్థనీయం కాదన్నారు. న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి అవకాశం లేకుండా నూపుర్ శర్మ వాస్తవంలో తిరస్కరణకు గురయ్యారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ సారం, స్ఫూర్తి, ప్రవేశికలకు గౌరవ భంగం జరిగిందని,  న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇటువంటి మర్యాద భంగకరమైన అతిక్రమణలు లేవని తెలిపారు. 


ఈ లేఖపై 15 మంది విశ్రాంత న్యాయమూర్తులు, 77 మంది మాజీ ఆలిండియా సర్వీసెస్ అధికారులు, 25 మంది రక్షణ దళాల మాజీ అధికారులు సంతకాలు చేశారు. బోంబే హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్ వ్యాస్, గుజరాత్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్ఎం సోనీ, రాజస్థాన్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఆర్ఎస్ రాథోడ్, ప్రశాంత్ అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్ఎన్ ధింగ్రా, మాజీ ఐఏఎస్ అధికారులు ఆర్ఎస్ గోపాలన్, ఎస్ కృష్ణ కుమార్, రాయబారి (రిటైర్డ్) నిరంజన్ దేశాయ్, మాజీ డీజీపీలు ఎస్‌పీ వైద్, బీఎల్ వోరా, లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది (రిటైర్డ్), ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) ఎస్‌పీ సింగ్ తదితరులు సంతకాలు చేశారు. 


Updated Date - 2022-07-05T21:22:14+05:30 IST