నిర్వాసితులకు నిలువెత్తు మోసం

Jul 22 2021 @ 03:13AM

జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే ప్రతీ నిర్వాసిత కుటుంబానికి రూ.10 లక్షల 50 వేలు, గతంలో రూ.లక్షా 15 వేలు ఇచ్చిన భూముల రైతులకు రూ.5లక్షలు పరిహారంగా ఇస్తానని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ఈ హామీ పూర్తి కాలేదు, సరికదా ప్రారంభానికీ నోచుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణంపైన, నిర్వాసితులపైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అనుక్షణం బైటపడుతూనే ఉంది. పోలవరాన్ని అడ్డుపెట్టుకొని దోచుకోవాలన్న ధ్యాస తప్ప నిర్వాసితులకు న్యాయం, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న ధ్యాస ప్రభుత్వంలో ఏ కోశానా కనపడటం లేదు. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ డిసెంబర్ 22, 2020న పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం పనులు సంతృప్తికరంగా లేవన్నారు. రాష్ట్ర సహాయ పునరావాస కమీషనర్‍ను ఎన్ని సార్లు అడిగినా వివరాలు ఇవ్వడం లేదని డిసెంబర్ 31, 2020న జలవనరుల శాఖపై పీపీఏ సీఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశ 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితమైనా.. దాదాపు 18వేల కుటుంబాలు మునుగుతాయి, ఇందులో 28 ఆవాసాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 90 ఆవాసాలను తరలించాలి. పునరావాసం కోసం 73 కాలనీలను నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటిదాకా 26 మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 47 పూర్తి కావాలి. ఒకపక్క వరదలు ముంచుకొస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఆదివాసీలను అడ్డుపెట్టుకొని వారికి దక్కాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ డబ్బులను వాళ్లకే తెలియకుండా వాళ్ల ఖాతాల్లోంచి వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు. మచ్చామహాలక్ష్మీ, మదకం సావిత్రి వంటివారు ఎందరున్నారో.. వారి పేరిట రూ.2కోట్లకుపైగా సొమ్మును కాజేసిన అధికారపక్షం నేతలపై ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? రెండేళ్ల పాలనలో పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశారు. బహుళార్థ సాధక ప్రాజెక్టును పోలవరం ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్ల కోసం కాంట్రాక్టరును మార్చారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.750 కోట్లు ఆదా చేశామని గొప్పగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు మొత్తం వ్యయ అంచనాను రూ.5,535 నుంచి రూ.7,192 కోట్లకు అంటే రూ.1,657 కోట్లకు అదనంగా పెంచుకున్నారు. టీడీపీ హయాంలో రూ.55,548 కోట్లకు సాంకేతిక సలహా మండలి ఆమోదం తెస్తే 28 మంది ఎంపీలుండీ కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.


తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలోనే రూ.11,671కోట్లు వ్యయం చేసి అందులో రూ.6,727కోట్లను కేంద్రం నుంచి రాబట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఖర్చు చేసిన రూ.4వేల కోట్లు కేంద్రం రీయింబర్స్ చేస్తే ఆ నిధులను ప్రభుత్వం ఎక్కడ, ఎంత వ్యయం చేసిందో చెప్పాలి. 41.15 మీటర్ల కాంటూరుకు ఇంకా 1012 ఎకరాల భూమి సేకరణ, నిర్వాసితులకు నగదు చెల్లింపులు, సహాయ పునరావాస కాలనీలు, మౌలిక సదుపాయాలు వీటన్నిటి కోసం రూ.3,200 కోట్లు కావాలి. ఈ నిధులను ఈ ఏడాది మార్చి నాటికి విడుదల చేస్తామని ప్రభుత్వం స్వయంగా చెప్పి ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేస్తేనే ఇవ్వగలమని మాట మార్చారు. ప్రతిపక్షాలు, మీడియా ప్రశ్నించే సరికి జూన్ 30, 2021న జీవో నెం.224 ద్వారా కేవలం రూ.550 కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇవి దేనికీ సరిపోవు. గత ఏడాది జూలై 8వ తేదీన ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాడు 50వేల మంది నిర్వాసితులకు ఇళ్లను నిర్మించి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పటి వరకూ పునరావాస కార్యక్రమాల్లో ఏ మాత్రం పురోగతి లేదు. పోడు భూములకు పట్టాల్లేవనే సాకుతో గిరిజనులకు ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదు.


గిరిజనులకు వారి భూములకు బదులుగా ఇచ్చిన భూములు చాలా వరకు వివాదాల్లోనే ఉన్నాయి. పునరావాస ప్రాంతంలో ఉపాధి ప్రశ్నార్థకమైంది. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రోడ్డు, మంచి నీళ్ళు, విద్యుత్‌, గుడి, బడి, శ్మశానం, పశువుల దొడ్లు వంటి 39 సౌకర్యాలను కల్పించాలి. ఇంత వరకు వాటి జాడ లేదు. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 


అసమర్థ పాలనకు ప్రజల నుంచి తిరుగుబాటు మొదలయ్యింది. ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను మంత్రుల చొక్కాలు పట్టుకొని అడిగే రోజులు దగ్గరపడుతున్నాయి. అందుకే పోలవరం నిర్వాసితులు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి జూన్ 02, 2021న జలవనరుల శాఖా మంత్రిని నిలదీశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. వాటితో పాటు నాడు జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ప్రగల్బాలు, ఆర్బాటాలు, ప్రతిపక్షాలపై నిందారోపణలు మాని నిర్వాసితులకు న్యాయం చేసి, ఆదివాసీలను ఆదుకోవాలి.

ఆలపాటి రాజేంద్రప్రసాద్,

మాజీ మంత్రి వర్యులు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.