ఒక్క ఫోన్‌.. మారిన సీన్‌!

ABN , First Publish Date - 2021-11-23T08:35:54+05:30 IST

‘‘మూడు రాజధానులపై పునరాలోచించుకోండి. సమీక్షించుకోండి! ఆ చట్టాలను వెనక్కి తీసుకోండి’’.. బుధవారం ఢిల్లీలో కీలక స్థానంలో ఉన్న ఒక పెద్దాయన సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి జారీచేసిన ఆదేశమిది! ఇంకెవరైనా అయితే ‘కాదూ కూడదు’ అనేవారేమో!

ఒక్క ఫోన్‌.. మారిన సీన్‌!

  • రంగంలోకి ఢిల్లీ పెద్దాయన..
  • ‘మూడు’ మార్చుకోవాలని ఆదేశం
  • పాదయాత్రపై పోలీసు జులుంతో మలుపు.. ఢిల్లీకి ఐబీ నివేదిక
  • న్యాయకోవిదులతో పెద్దాయన సమీక్ష..
  • ఆ చట్టాలు నిలవవనే నిశ్చితాభిప్రాయం
  • చట్టాలు వెనక్కి తీసుకోవాలని సీఎంకు ఫోన్‌..
  • బుధ, శుక్రవారాల్లో ఆదేశాలు


‘ఏ క్షణమైనా విశాఖకు రాజధాని తరలిస్తాం! మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదేలేదు!’... అని పదేపదే ప్రకటించిన  ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుండి వెనక్కి ఎందుకు తగ్గారు? వాళ్లు చెబుతున్నట్లుగా ‘తాత్కాలికం’గానైనా సరే... మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు చెబుతున్న లోటుపాట్లు, సాంకేతిక అంశాలు... రెండున్నరేళ్లలో ఎప్పుడూ కనిపించలేదా? అసలీ ఆకస్మిక నిర్ణయానికి కారణమేంటి? విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘మూడు రాజధానులపై పునరాలోచించుకోండి. సమీక్షించుకోండి!  ఆ చట్టాలను వెనక్కి తీసుకోండి’’.. బుధవారం ఢిల్లీలో కీలక స్థానంలో ఉన్న ఒక పెద్దాయన సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి జారీచేసిన ఆదేశమిది! ఇంకెవరైనా అయితే ‘కాదూ కూడదు’ అనేవారేమో! కానీ... ఆ పెద్దాయన చెబితే కాదనలేని పరిస్థితి. అందుకే... ‘తాత్కాలికం’ అంటూనే జగన్‌ సర్కారు మూడు రాజధానుల చట్టాలను వెనక్కి తీసేసుకుంది. 


అసలేం జరిగింది...

ఈనెల 11న అమరావతి రైతుల పాదయాత్రపై ప్రకాశం జిల్లా పోలీసులు విరుచుకుపడ్డారు. ఆంక్షల పేరిట నిర్బంధానికి దిగారు. యాత్రకు సంఘీభావంగా వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అడ్డుదాటి ముందుకు కదిలిన వారిపై లాఠీలు ఝళిపించారు. ఈ సంఘటన జరిగే నాటికే కేంద్ర నిఘా విభాగం (ఐబీ) ప్రత్యేక బృందాలు ఇక్కడే ఉన్నాయి. 14న జరిగిన దక్షిణ ప్రాంతీయ సదస్సుకోసం 13నే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిరుపతికి వచ్చారు. ఈ సదస్సు నిర్వహణ, సెక్యూరిటీ, ఇతర అంశాల పరిశీలనకు ఐబీ టీమ్స్‌ ఈనెల 10 నుంచే తిరుపతితోపాటు పలు ప్రాంతాల్లో మకాం వేశాయి. ఈ నేపథ్యంలో 11న రైతుల యాత్రపై జరిగిన లాఠీచార్జి, అనంతర పరిణామాలను కేంద్ర హోంశాఖకు ఐబీ నివేదిక అందించింది.  ఏం జరిగిందో కానీ... సదస్సు ముగిసిన తర్వాత, 15వ తేదీన హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించారు. 


ఢిల్లీకి మారిన సీన్‌...

అమరావతి చుట్టూ జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ పెద్దాయన ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుపై  కేంద్ర ప్రభుత్వంలోని ఓ ప్రముఖ న్యాయాధికారితో మాట్లాడారు. ‘‘విచారణ పూర్తిగా సాంకేతిక అంశాలపై నడుస్తోంది. చట్టంలో అనేక సాంకేతిక లోపాలున్నాయి. హైకోర్టులో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావొచ్చు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం. అయినా సరే... కేసు గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు’’ అని ఆ న్యాయాధికారి నివేదించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆ పెద్దాయన జగన్‌కు ఫోన్‌ చేసి ఈ విషయంపై చర్చించారు. ‘‘మూడు రాజధానుల చట్టంపై పునఃసమీక్షించుకోండి’’ అని స్పష్టంగా చెప్పారు. ఆ మరుసటి రోజే... అంటే గురువారం నుంచి అసెంబ్లీ సమాశాలు మొదలయ్యాయి.  శుక్రవారం (19వ తేదీ) మరోసారి ఆ పెద్దాయన ఫోన్‌చేసి... మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.  సరిగ్గా అదే రోజున మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రకటించారు. అయితే, ఆ రోజు ఏపీ శాసనసభలో  ప్రతిపక్షనేత చంద్రబాబుపై దూషణల పర్వం కొనసాగడంతో మూడు రాజధానుల విషయం తెరమీదికి రాలేదు. సోమవారం ఆ తతంగం పూర్తిచేశారు. నిజానికి.. ఈ చట్టాలు న్యాయసమీక్షకు నిలవవని న్యాయనిపుణులు తొలి నుంచీ  చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇక్కడి న్యాయాధికారులు  ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ‘మేం చేసిందే రైట్‌’ అనే అహంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు... చివరికి, కేంద్రం నుంచి పెద్దాయన జారీ చేసిన ఆదేశాలతో దిగి వచ్చారు.



Updated Date - 2021-11-23T08:35:54+05:30 IST