జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్‌కాల్‌తో మటాష్.. రూ.1.62 కోట్లు కోల్పోయిన రిటైర్డ్ ఉద్యోగి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-14T18:42:21+05:30 IST

అతను ఒక రిటైర్డ్ ఉద్యోగి.. ఇటీవలె పదవీ విరమణ చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్నాడు

జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్‌కాల్‌తో మటాష్.. రూ.1.62 కోట్లు కోల్పోయిన రిటైర్డ్ ఉద్యోగి.. అసలేం జరిగిందంటే..

అతను ఒక రిటైర్డ్ ఉద్యోగి.. ఇటీవలె పదవీ విరమణ చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్నాడు. అలాంటి సమయంలో వచ్చిన ఓ ఫోన్ కాల్ అతడి ప్రశాంతతను దూరం చేసింది. ఎంతో ఆశ పెట్టి చివరికి నట్టేట ముంచింది. దీంతో ఆ వృద్ధుడు తను సంపాదించిన సొమ్మే కాకుండా బంధువుల డబ్బును కూడా పోగొట్టాడు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఈ ఘటన జరిగింది. 


నాగౌర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి హరిఓమ్‌ చౌధురికి ఎనిమిది నెలల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, ఐఆర్‌డీఏ కంపెనీ మీ పేర రూ.4 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించిందని, అది మెచ్యూర్ అయిందని, ఆ డబ్బు తీసుకోవాలని అవతలి వ్యక్తి చెప్పాడు. హరిఓమ్‌కు వాట్సాప్‌లో డిజిటల్ చెక్ కూడా పంపించాడు. అయితే ఆ డబ్బు రావాలంటే ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలని షరతు విధించాడు. 


రూ.4 కోట్లు వస్తుందనే ఆశతో హరిఓమ్ గత ఎనిమిది నెలల్లో వారు చెప్పిన వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ.1.61 కోట్లు జమ చేశాడు. జీవితాంతం తను సంపాదించిన డబ్బులే కాకుండా బంధువులు, స్నేహితుల నుంచి అప్పు చేసి మరీ కట్టాడు. రూ.4 కోట్లు వస్తే ఎవరి డబ్బు వారికి ఇచ్చేద్దామని అనుకున్నాడు. గత నెల నుంచి అవతలి వారు ఫోన్లు చేయడం మానేశారు. హరిఓమ్ చేస్తే ఏ నెంబరూ పనిచేయడం లేదు. తాను మోసపోయానని తెలుసుకున్న హరిఓమ్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-12-14T18:42:21+05:30 IST