
అధిష్ఠానం వద్ద పెరిగిన టీపీసీసీ చీఫ్ బలం!
ఢిల్లీలో ఫలించని కాంగ్రెస్ అసమ్మతి నేతల యత్నాలు
అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా, రాహుల్‌గాంధీ
ఫోన్లు ఎత్తని కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్
నిరాశగా వెనుదిరిగిన అసమ్మతి నేతలు
కాంగ్రెస్‌లో చేరతా.. బలోపేతం చేస్తా
సోనియా, రాహుల్, ప్రియాంకకు పీకే ప్రతిపాదన!
పార్టీలో పెనుమార్పులు చేయాలన్న ప్రశాంత్ కిశోర్
బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని రూపొందించే ప్రయత్నం
జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించే యోచన
న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానం వద్ద మరింత బలం సంపాదించినట్లు కనిపిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద అసమ్మతి స్వరం వినిపించాలని భావించిన కొందరు సీనియర్ల యత్నాలు విఫలం కావడమే ఇందుకు నిదర్శనం. రేవంత్‌పై ఫిర్యాదులు చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఢిల్లీకి వచ్చిన సీనియర్ నేతలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ మాత్రమే కాకుండా.. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు.
దీంతో అసమ్మతి నేతలు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. పార్టీ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు మద్దతిస్తారని ఈ నేతలు భావించగా.. వారు సహకరించలేదని తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టినట్లు సమాచారం. సరిగ్గా వారు ఢిల్లీకి వచ్చిన సమయంలోనే రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడడంతో అసమ్మతి నేతలు ఖంగుతిన్నట్లు తెలిసింది. మరోవైపు ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. త్వరలో జరగనున్న కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో తలదూర్చడం సరైంది కాదని భావించి సైలెంట్ అయ్యారు. దీంతో ఆ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
‘‘వారందరూ ఒకటేరా బై.. వారి ప్రయోజనాలు వారు కాపాడుకుంటారు’’ అని ఒక అసమ్మతి నేత వ్యాఖ్యానించడం వారి నిస్సహాయతకు నిదర్శనంగా కనిపిస్తోంది. ‘‘సోనియాగాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వేణుగోపాల్, మాణిక్కం కనీసం ఫోన్లు కూడా ఎత్తడంలేదు. ఇక ఇంటికెళ్లక ఏం చేస్తాం? అసమ్మతి శిబిరంలో చేరడం కంటే నాకు ఏ రాష్ట్ర బాధ్యతలనైనా అప్పగించమని మేడమ్ ను అడుగుతా’’ అని మరో నేత అన్నారు. వాస్తవానికి సోనియా, రాహుల్.. తమను కలుస్తున్న నేతలు, పార్టీ ఎంపీలతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, తమ వద్ద అసమ్మతి స్వరాలు వినిపించకూడదని గట్టిగా చెబుతున్నారని, దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా నోరు మూసుకోవాల్సి వచ్చిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనూ అసమ్మతి కార్యకలాపాలను ప్రోత్సహించకూడదని అధిష్ఠానం భావిస్తుండడంతో.. రాష్ట్ర నేతలకు కూడా ఆ సంకేతాలు అందినట్లు తెలిసింది.
కాంగ్రె్‌సకు భవిష్యత్ లేదని పేర్కొన్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా పార్లమెంటులో సోనియాను కలిసే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె స్పందించలేదని సమాచారం. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరాట కార్యాచరణను ఎప్పటికప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి, ఇన్చార్జులకు తెలియజేస్తుండడం, సీనియర్ ఎంపీలతో నిరంతరం మాట్లాడుతుండడంతో ఢిల్లీలో ఆయన బలమైన ముద్ర వేయగలుగుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో రేవంత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేసినా అధిష్ఠానంలో ఎవరూ నమ్మే విధంగా కనిపించడం లేదని పేర్కొంటున్నాయి. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎవరు లేఖలు రాసినా.. సోనియాగాంధీ వాటిని పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపించడం, ఆయన రేవంత్‌తో వాటి గురించి చర్చిస్తుండడంతో అసమ్మతి కార్యకలాపాలు రేవంత్‌కు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. గతంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిలకు వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి స్థాయి నేతలు అసమ్మతి నిర్వహిస్తే ఒక అర్థం ఉండేదని, ఇప్పటి అసమ్మతి నేతలకు ఆ స్థాయి గానీ, విశ్వసనీయత గానీ లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం 20 మంది బలమైన నేతలు ఢిల్లీ వచ్చి రేవంత్‌కు వ్యతిరేకంగా నిరంతరం అసమ్మతిని ప్రచారం చేస్తే తప్ప.. ఆయనను ఎవరూ కదల్చలేరని పేర్కొంటున్నాయి. కానీ, రేవంత్ వ్యతిరేక శిబిరానికి అంత బలం గానీ, ఢిల్లీలో పలుకుబడి గానీ లేవని ఈ వర్గాలు భావిస్తున్నాయి.