Hyderabad: దివంగత పీజేఆర్ (PJR) పేరు తెలియని వారు ఎవరూ ఉండరని, పేదలకు పెద్దన్న పీజేఆర్ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి (Vijaya reddy) గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్‌తో వెలిశాయన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదని, చివరి శ్వాసవరకు పీజేఆర్ పేదల కోసం పని చేశారని కొనియాడారు. పీజేఆర్ పోరాటం వల్లనే కృష్ణాలో వాటా దక్కిందన్నారు. జంట నగరాలకు కృష్ణా వాటర్ కోసం ఆయన పోరాటం చేశారని, కొందరు తమ ఘనతగా ఇప్పుడు గొప్పలు చెప్పు కొంటున్నారని అన్నారు. నగరంలో పేదోళ్లకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇప్పించారన్నారు. పీజేఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ బహిష్కరించినా ఆయన కాంగ్రెస్ జెండా వీడలేదన్నారు. పీజేఆర్ పెంచి పోషించిన వారే ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యేలు అయ్యారన్నారు. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బస్తీ ప్రజల పక్షాన పోరాడటం కోసం నాయకత్వం అవసరమన్నారు. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారన్నారు. హైదరాబాద్ పేద ప్రజల పక్షాన పోరాడే దళపతి దొరికిందని, విజయారెడ్డికి మంచి గౌరవం దక్కుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి