కేసీఆర్ కుటుంబ మూలాలు బీహార్‌లో ఉన్నాయి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-02T19:50:30+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ కుటుంబ మూలాలు బీహార్‌లో ఉన్నాయి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ మూలాలు బీహార్‌లో ఉన్నాయని, కల్వకుంట్ల కుటుంబం బీహార్‌ నుంచి వలస వచ్చిందన్నారు. ఈ విషయాన్ని 2008లో కేసీఆర్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు 2 సార్లు అధికారం ఇచ్చారన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావం, అనుమానం మొదలైందని, కేసీఆర్‌ వ్యవహారం కూడా అనుమానాలను బలపరుస్తున్నాయని రేవంత్ అన్నారు. సీఎస్ సోమేష్‌కుమార్‌, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు.. రజత్‌కుమార్, అరవింద్‌కుమార్, సందీప్‌కుమార్, సుల్తానియా బీహార్ వాళ్లేనన్నారు. ఇతర కీలక శాఖల్లో బీహార్‌ అధికారులకు సీఎం పెద్దపీట వేశారని ఆరోపించారు. ఇక్కడి ఐఏఎస్‌లకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారన్నారు. బీహార్‌కు చెందిన మంత్రి సంజయ్‌కుమార్ ఝూ తనపై దాడి చేస్తున్నారని, కేసీఆర్‌ను ఎలా ప్రశ్నిస్తావంటూ సంజయ్‌కుమార్‌ అంటున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు.


ధరణి పోర్టల్‌లో లోపాల కారణంగా భూ వివాదాలు వస్తున్నాయని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంలో కాల్పులకు కూడా ఇదే కారణమన్నారు. ఇబ్రహీంపట్నం కాల్పుల్లో బీహార్‌కు చెందిన గ్యాంగ్‌ ఉందని, 20 ఏళ్ల క్రితం యజమానులుగా ఉన్నవారి పేర్లు ధరణి పోర్టల్‌లో వస్తున్నాయన్నారు. ప్రస్తుత భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల భూవివాదాలు వచ్చి హత్యలకూ తెగబడుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని నిజాం కాలంనాటి భూములు గోల్‌మాల్ అవుతున్నాయన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల భూములను కబ్జా చేస్తున్నారని, ఆర్డీవో కార్యాలయంలో భూముల రికార్డులు మాయం అయ్యాయన్నారు. బీహార్‌కు చెందిన అధికారులను అడ్డంపెట్టుకుని.. తెలంగాణలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని, అందుకే బీహార్‌కు చెందిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను సీఎం కేసీఆర్ తెచ్చుకున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-03-02T19:50:30+05:30 IST