ఏపీజీఈఏ రద్దు కోసం పోరాటం

ABN , First Publish Date - 2021-04-24T05:06:48+05:30 IST

ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కే రామ సూర్య నారాయణ ఉద్యోగ వ్యతిరేక నిరంకుశ విధానాలను అవలంబిస్తున్నారని, ఆ అసోసియేషన్‌ రద్దు కోసం న్యాయపోరాటం చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల నాయకులు పేర్కొన్నారు. ఏపీజీఈఏ చర్యలకు వ్యతిరేకంగా శుక్రవారం కల్టెరేట్‌ ఎదుట నిరసన తెలిపారు.

ఏపీజీఈఏ రద్దు కోసం పోరాటం
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న రెవెన్యూ ఉద్యోగులు

కలెక్టరేట్‌ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన

నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్‌ 23 : ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కే రామ సూర్య నారాయణ ఉద్యోగ వ్యతిరేక నిరంకుశ విధానాలను అవలంబిస్తున్నారని, ఆ అసోసియేషన్‌ రద్దు కోసం న్యాయపోరాటం చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల నాయకులు పేర్కొన్నారు. ఏపీజీఈఏ చర్యలకు వ్యతిరేకంగా శుక్రవారం కల్టెరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు వీ కృష్ణారావు మాట్లాడుతూ కమర్షియల్‌ టాక్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న కేఆర్‌ సూర్యనారాయణ, 2010లో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏపీజీఈఏ)ను స్థాపించారన్నారు. గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న అనేక సంఘాలను పక్కన పెట్టి ప్రస్తుత ప్రభుత్వం ఏపీజీఈఏకు దొడ్డిదారిన గుర్తింపు మంజూరు చేయడమేకాక జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో కూడా శాశ్వత సభ్యత్వం కల్పించిందని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, డీఏ, పీఆర్సీ, హెల్త్‌కార్డు, సీపీఎస్‌ రద్దు వంటి ఎన్నో సమస్యలు ఉండగా ఏ ఒక్కదానిపైనా ఆ సంఘం పోరాడలేదన్నారు. పైగా  కొన్ని ఇతర సంఘాలను అస్థిరపరిచే కార్యక్రమాలను మొదలు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న ఏపీఆర్‌ఎస్‌ఏ, ఏపీఎన్జీవో సంఘ భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో దావా వేశారన్నారు. కష్టపడి సంపాదించుకున్న ఆ కాపాడుకొంటామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి అల్లంపాటి పెంచలరెడ్డి,  ఏపీజేఏసీ అమరావతి కార్యదర్శి వై చెంచురామయ్య,  ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బొబ్బా మురళి, కోశాధికారి డానియల్‌ పీటర్‌, మహిళా నాయకురాలు కోటమ్మ,  తహసీల్దార్‌ రామలింగేశ్వరరావు, వీఆర్వోల సంఘం జిల్లా కార్యదర్శి దారా రమణయ్య,  రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు సమగ్ర నివేదికను అందచేసి, ప్రభుత్వానికి పంపాలని కోరారు.

Updated Date - 2021-04-24T05:06:48+05:30 IST