ఆదాయం... మందగమనం!

ABN , First Publish Date - 2021-06-14T03:44:29+05:30 IST

జిల్లాలో ఆస్తుల రిజిస్ర్టేషన్లపైనా కరోనా ప్రభావం పడింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలక శాఖల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ ఒకటి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రిజిస్ర్టేషన్లు మందకొడిగా సాగుతున్నాయి.

ఆదాయం... మందగమనం!
జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయం

రిజిస్ట్రేషన్లపై కరోనా దెబ్బ

గత నెలలో దారుణంగా పడిపోయిన క్రయవిక్రయాలు

గణనీయంగా తగ్గిన లావాదేవీలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఆస్తుల రిజిస్ర్టేషన్లపైనా కరోనా ప్రభావం పడింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలక శాఖల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ ఒకటి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రిజిస్ర్టేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. స్థిరాస్తి క్రయ, విక్రయాలు తగ్గాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. తొలిదశ కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు వరకూ రిజిస్ర్టేషన్లు తగ్గుముఖం పట్టాయి. తర్వాత కొంతమేర క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. ఇంతలోనే రెండో దశ కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రిజిస్ర్టేషన్లు మళ్లీ మందగించాయి. ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుండడంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే సగానికి పైగా క్రయవిక్రయాలు తగ్గాయి. ఏప్రిల్‌ కంటే మే నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. 


నెరవేరని లక్ష్యం..  

జిల్లాలో ఆమదాలవలస, హిరమండలం, ఇచ్ఛాపురం, కాశీబుగ్గ, కోటబొమ్మాళి, నరసన్నపేట, మందస, పాలకొండ, పాతపట్నం, పొందూరు, రణస్థలం, రాజాం, సోంపేట, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాల్లో మొత్తం 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. కొవిడ్‌ వ్యాప్తికి ముందు జిల్లావ్యాప్తంగా రోజుకి 200 పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. విక్రయ దస్తావేజులు, ఒప్పందాలు, కుటుంబ సభ్యుల ఆస్తుల పంపిణీ, వీలునామాలు, వివాహ రిజిస్ట్రేషన్లు, సవరణ దస్తావేజులు... ఇలా పలు రకాల లావాదేవీలు జరిగేవి.  కరోనా దృష్ట్యా ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు వెనకడుగు వేస్తున్నారు. భూ విక్రయాలకు సంబంధించి ఒప్పందాలు రాసుకున్నవారు సైతం రూ.100 స్టాంపు పేపరుపై దాన్ని పునరుద్ధరించుకుంటూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయ భూములతో పాటు, ఇళ్ల స్థలాల క్రయవిక్రయాలు సైతం స్తంభించాయి. ఏప్రిల్‌లో జిల్లా వ్యాప్తంగా 5,871 రిజిస్ట్రేషన్లు కాగా, గత నెలలో కేవలం 1,089 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఏప్రిల్‌లో ఈ శాఖ ద్వారా రూ.16కోట్లు రావాల్సి ఉండగా... రూ.12.48 కోట్ల ఆదాయం సమకూరింది. మే నెలకు సంబంధించి రూ.16 కోట్లు లక్ష్యం కాగా... కేవలం  రూ.2.46 కోట్లు మాత్రమే ఆదాయం మాత్రమే వచ్చింది. 


పనివేళల కుదింపు ప్రభావం.... 

మే 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఉదయం 6  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే జనసంచారం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇతర కార్యకలాపాలకు బయటకు రావడం తగ్గింది. మరోపక్క ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8   నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పని చేస్తున్నాయి. అంత తక్కువ వ్యవధిలో అధికారులు, సిబ్బంది సైతం ఐదారు దస్తావేజులకు మించి చేయలేకపోతున్నారు.  


పెరిగే అవకాశముంది

కరోనా దృష్ట్యా ఏప్రిల్‌ కంటే మే నెలలో రిజిస్ట్రేషన్లు చాలా తగ్గాయి. కర్ఫ్యూ కారణంగా పనివేళలు కుదించడంతో.. చాలా మంది రిజిస్ర్టేషన్లకు ఆసక్తి చూపడం లేదు. తాజాగా మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు సడలించడంతో రిజిస్ర్టేషన్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. 

 - ఆర్‌.సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్‌


జిల్లాలో ఇదీ పరిస్థితి

ఏప్రిల్‌           మే 

రిజిస్ట్రేషన్లు 5,871 1,089

లక్ష్యం  రూ.16 కోట్లు రూ.16.05 కోట్లు

ఆదాయం రూ.12.48 కోట్లు రూ.2.46 కోట్లు



Updated Date - 2021-06-14T03:44:29+05:30 IST