రివర్స్‌కు రివర్స్‌..!?

ABN , First Publish Date - 2021-06-24T06:07:09+05:30 IST

జిల్లాలో ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా 17 టీఎంసీల సామర్థ్యంతో బ్రహ్మంసాగర్‌ జలాశయం నిర్మించారు. టీజీపీ కుడి, ఎడమ ప్రధాన కాలువల కింద ఆయకట్టు 1.56 లక్షల ఎకరాలు. ఈ జలాశయాన్ని 2006లో జాతికి అంకితం చేశారు. 2007లో తొలిసారిగా 208 మీటర్ల లెవల్‌లో 13 టీఎంసీలు నింపితే..

రివర్స్‌కు రివర్స్‌..!?

బ్రహ్మంసాగర్‌ టెండర్లలో ఖజానాపై రూ.1.46 కోట్ల భారం
లీకేజీ మరమ్మతులకు రూ.46.68 కోట్లతో టెండర్లు
ఒక్క మెగా కంపెనీ మాత్రమే షెడ్యూల్‌ దాఖలు
3.56 శాతం ఎక్కువ రేట్లకు కోడ్‌
ఒకే కంపెనీ కావడంతో రివర్స్‌ టెండర్లకు రివర్సే..?
సింగిల్‌ టెండరు ఆమోదిస్తారా..? ప్రభుత్వానిదే తుది నిర్ణయం


బ్రహ్మంసాగర్‌ జలాశయం లీకేజీ మరమ్మతుల టెండర్లలో మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ ఒక్కటి మాత్రమే టెండరు షెడ్యూల్‌ దాఖలు చేసింది. కాంట్రాక్ట్‌ విలువపై 3.56 శాతం ఎక్కువ కోడ్‌ చేయడంతో ఖజానాపై రూ.1.46 కోట్లు అదనపు భారం పడనుంది. అయితే.. సింగిల్‌ టెండరును ప్రభుత్వం ఆమోదిస్తుందా..? మళ్లీ టెండర్లు పిలుస్తుందా..? వేచిచూడాల్సిందే. టెండర్‌ అమోదంపై తుది నిర్ణయం ప్రభుత్వానిదే. ఆమోదిస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి మంగళం పాడినట్లేనని సాగునీటి నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు పరిశీలిస్తే..

కడప, జూన 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా 17 టీఎంసీల సామర్థ్యంతో బ్రహ్మంసాగర్‌ జలాశయం నిర్మించారు. టీజీపీ కుడి, ఎడమ ప్రధాన కాలువల కింద ఆయకట్టు 1.56 లక్షల ఎకరాలు. ఈ జలాశయాన్ని 2006లో జాతికి అంకితం చేశారు. 2007లో తొలిసారిగా 208 మీటర్ల లెవల్‌లో 13 టీఎంసీలు నింపితే.. ఆనకట్ట నుంచి లీకేజీలు వచ్చాయి. పలుమార్లు నిపుణుల కమిటీ పరిశీలించింది. చివరగా గత ఏడాది ఫిబ్రవరిలో మరోసారి పరిశీలించిన కమిటీ లీకేజీ వచ్చే ప్రాంతంలో గరిష్ట నీటి మట్టం 216.5 మీటర్ల నుంచి దిగువ బాటమ్‌ లెవల్‌ (కటాఫ్‌ వాల్‌) వరకు 100 మీటర్ల పొడవు, 54 మీటర్ల ఎత్తులో ‘ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రం వాల్‌’, బయట వైపున శాండ్‌ ఫిల్టర్‌ నిర్మించాలని సూచించారు. లీకేజీ మరమ్మతులకు రూ.46.68 కోట్లతో టీజీపీ ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. నిధుల మంజూరులో జాప్యంపై ఆంధ్రజ్యోతి పలు కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న రూ.46.68 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అందులో కాంట్రాక్ట్‌ వాల్యూ (ఈసీవీ) రూ.41.02 కోట్లకు టీజీపీ ఇంజనీర్లు టెండర్లు పిలిచారు.

రివర్స్‌ టెండర్లకు రివర్సేనా..?!
బ్రహ్మంసాగర్‌ జలాశయం లీకేజీ మరమ్మతులకు నాలుగైదు కంపెనీలైనా ఇ-ప్రొక్యూర్మెంట్‌ టెండర్లలో షెడ్యూల్‌ దాఖలు చేస్తాయని ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు ఇంజనీర్లు భావించారు. మంగళవారం టెక్నికల్‌ బిడ్‌ ఓపన చేస్తే వారి అంచనాలకు అందని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఇంజనీరింగ్‌ కంపెనీ అయిన మెగా సంస్థ ఒక్కటే టెండరు షెడ్యూల్‌ దాఖలు చేసింది. బుధవారం ప్రైజ్‌ బిడ్‌ ఓపన చేయగా ఈసీవీ రూ.41.02 కోట్లపై 3.56 శాతం ఎక్కువకు అంటే రూ.42.48 కోట్లకు కోడ్‌ చేశారు. అంటే.. కాంట్రాక్ట్‌ విలువపైన రూ.1.46 కోట్లు అదనం. ఆ మేరకు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం తప్పడం లేదు. అయితే.. సీఎం జగన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రగతి పనుల టెండర్లలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ సొమ్మును ఆదా చేస్తున్నామని జగన ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. రివర్స్‌ టెండరింగ్‌ అంటే.. ఓ పనికి ఇద్దరు ఆపైన కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తే ఎల్‌-1 టెండరుదారుడు ఎంత అమౌంట్‌కు షెడ్యూల్‌ దాఖలు చేశారో.. అంతకంటే తక్కువకు పనులు చేస్తామని టెండరులో పాల్గొన్న కాంట్రాక్టరు ఆనలైన్లో రివర్స్‌లో అమౌంట్‌ కోడ్‌ చేస్తారు. రివర్స్‌లో ఎవరు తక్కువకు కోడ్‌ చేస్తారో వారికే పనులు అప్పగిస్తూ అగ్రిమెంట్‌ చేస్తారు. అయితే.. బ్రహ్మంసాగర్‌ పనుల్లో మెగా కంపెనీ ఒక్కటే 3.56 శాతం ఎక్కవ రేట్లకు షెడ్యూల్‌ దాఖలు చేసింది. పోటీ కంపెనీ లేకపోవడంతో రివర్స్‌ టెండర్లకు అవకాశం లేదు. సీఎం జగన ఎంతో ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి సొంత జిల్లా కడపలోనే రివర్స్‌ అయినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వానిదే తుది నిర్ణయం
సింగిల్‌ టెండరును ఆమోదించాలా..? మళ్లీ టెండర్లు పిలవాలా..? షరతులతో ఆ కాంట్రాక్ట్‌ కంపెనీకే పనులు అప్పగిస్తారా..? అనే విషయాలపై తుది నిర్ణయం ప్రభుత్వానిదే. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన టీజీపీ ఇంజనీర్లు టెండరు నివేదిక సీఓటీకి పంపుతారు. సింగిల్‌ టెండరు కావడంతో సీఓటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ విషయాన్ని ఇరిగేషన ప్రాజెక్ట్స్‌ సీఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా బ్రహ్మంసాగర్‌ టెండర్లలో మెగా కంపెనీ ఒక్కటే 3.56 శాతం ఎక్కువ రేట్లకు షెడ్యూల్‌ దాఖలు చేసిందన్నారు. టీజీపీ ఎస్‌ఈ ఇచ్చే నివేదిక ప్రకారం కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీఓటీ)కి పంపుతామన్నారు. సీఓటీ తీసుకునే నిర్ణయంపై ముందుకు వెళ్తాం అని వివరించారు.

Updated Date - 2021-06-24T06:07:09+05:30 IST