ఐటీఐఆర్‌పై పున:పరిశీలించండి

ABN , First Publish Date - 2022-10-02T09:57:41+05:30 IST

హైదరాబాద్‌కు ప్రకటించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐటీఐఆర్‌)ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పున:పరిశీలించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కోరారు.

ఐటీఐఆర్‌పై పున:పరిశీలించండి

  • కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్‌
  • వైద్య కళాశాలల కేటాయింపుపై
  • కిషన్‌రెడ్డిది తప్పుడు సమాచారమని వ్యాఖ్య

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు ప్రకటించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐటీఐఆర్‌)ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పున:పరిశీలించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కోరారు. శనివారం ఢిల్లీలో జరిగిన డిజిటల్‌ ఇండియా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాలకు సాఫ్ట్‌వేర్‌ పార్కులను కేటయించాలన్నారు. సైబర్‌ క్రైమ్‌, అశ్లీలతను కట్టడి చేయడానికి నూతన చట్టాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు. సోషల్‌ మీడియాను నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఐదు వైద్య కళాశాలలు మంజూరు చేసిందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  తప్పుడు సమాచారం ఇస్తున్నారని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. గత మూడేళ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 90వైద్య కళాశాలలు మంజూరు చేసిందని, ఇందులో తెలంగాణకు 9 కేటాయించిందని కిషన్‌రెడ్డి ఇటీవలే ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై శనివారం మంత్రి కేటీఆర్‌ స్పందించారు.


రాష్ట్రానికి 9 మెడికల్‌ కాలేజీలు కేంద్రం కేటాయించిందని చెప్పడం శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. ‘సోదరుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తాను.. కానీ తప్పుడు సమాచారం ఇచ్చే ఇలాంటి కేంద్రమంత్రిని తాను ఇంతవరకూ చూడలేదు’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. తప్పుడు ప్రకటన చేసినందుకు క్షమాపణ చెప్పే ధైర్యం కూడా కిషన్‌ రెడ్డికి లేదన్నారు. గుజరాత్‌ బాస్‌లను సంతోషపరచడానికి అర్ధసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి పేర్కొన్న ఒక్క హామీ కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. 


ఎస్‌ఎన్‌డీపీపైనా తప్పుడు మాటలు 

హైదరాబాద్‌లో వరదల నియంత్రణ కోసం చేపట్టిన స్ట్రాటజిక్‌ నాలా డెవలప్మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ) కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుపైనా కిషన్‌ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఈ పథకానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయకపోవడంతోనే కొద్దిపాటి వర్షాలకే నగరం అతలాకుతలం అవుతుందంటూ.. కిషన్‌ రెడ్డి చేసిన ట్వీట్‌పైనా కేటీఆర్‌ స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం రూ.985 కోట్లతో వరద నియంత్రణ చర్యలను హైదరాబాద్‌లో చేపట్టిందన్నారు. ఇప్పటికే అత్యధిక శాతం పనులు పూర్తయ్యాయని, ఒకటి రెండు నెలల్లో అన్నిటిని పూర్తి చేస్తామని చెప్పారు. స్వయంగా కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేట, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్థి పనులపైనా ఆయనకు అవగాహన లేదన్నారు. పైగా జరిగిన పనులను జరగనట్లు పేర్కొనడం తప్పుదోవ పట్టించడమేనన్నారు.

Updated Date - 2022-10-02T09:57:41+05:30 IST