గ్రామాభ్యుదయానికి పునరంకితం...!

ABN , First Publish Date - 2022-08-13T06:53:26+05:30 IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ సంబరాలు చేస్తున్నాం, సరే! బ్రిటీషువాడు ఎక్కడికి పోయాడనీ!

గ్రామాభ్యుదయానికి పునరంకితం...!

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ సంబరాలు చేస్తున్నాం, సరే! బ్రిటీషువాడు ఎక్కడికి పోయాడనీ! ప్రజలే ప్రభువులు అని రాజ్యాంగం శాసించినా, లేదు మేమే ప్రభువులం అంటూ మనందరి వనరులను దోచేస్తూ, హక్కులను హరిస్తూ, అభివృద్ధిని నాశనం చేస్తూ, పెత్తనాలు చేసే నిరంకుశపాలకులు గ్రామస్థాయి వరకు మన మధ్యే ఉండగా, వాడు బ్రిటీషువాడైతే ఏంటి, మన నేల మీదే పుట్టిన దేశద్రోహి అయితే ఏంటి?!


ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది నాయకులు, లక్షలాది ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసారు. మన దేశాన్ని వారి చెర నుండి విముక్తి చేసి, ప్రజలకే పగ్గాలు ఇచ్చే ఏర్పాటు చేసారు. మనల్ని మనమే పాలించుకునే స్వతంత్రం కల్పించి, ఆత్మగౌరవంతో జీవించటానికి ప్రతీ ఒక్కరికి హక్కులను, బాధ్యతలను, రక్షణలను, అధికారాలను కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసారు. ప్రజాస్వామ్యం అంటే పౌరులుగా, కేవలం ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడం కాదు. ప్రజల భాగస్వామ్యంతో, పారదర్శకంగా, మనకి సంబంధించిన విషయాలలో మనమే నిర్ణయాత్మకశక్తిగా వ్యవహరించడం అని ఉద్ఘాటించారు. వారు ఎన్నో త్యాగాలు చేసి మనకందించిన ఆ స్వతంత్ర ఫలాలతో, ఒక అందమైన భారతావనిని నిర్మిస్తామని కలలు కన్న ఆ మహానుభావులకు మనం వేదననే మిగిల్చాం.


స్వతంత్రం సిద్ధించిన, కొన్ని దశాబ్దాల వరకు గ్రామాలు, తెలివి, సేవానిరతి, స్వతంత్ర స్ఫూర్తి కలిగిన గ్రామపెద్దల దిశానిర్దేశంలో కొంతైనా విలువలతో నడిచాయి. కాని, ఇప్పుడు దుష్టులు -దుర్మార్గుల పాలనతో గ్రామాలు గాడి తప్పుతున్నాయి. ప్రజలు కాదు, వారు ఎన్నుకున్న పంచాయతీలూ కాదు, మేమే గ్రామానికి అప్రకటిత మహరాజులం అంటూ గ్రామస్థాయి అధికార పార్టీ అధ్యక్షులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వీరి వ్యవహారం ఎం.ఎల్.ఏ అభ్యర్ధికి గ్రామస్థాయిలో ప్రచారం చేయడంతో ప్రారంభమవుతుంది. కులాలవారీగా ప్రజలను చీల్చి, అభ్యర్ధి తరపున ఓటుకి డబ్బులు పంచటంలో, -మద్యంతో ఓటర్లను ఆకర్షించటంలో లీనమయ్యి ఉంటారు. తను ప్రచారం చేసిన ఆ అభ్యర్ధి, అతని పార్టీ గెలిస్తే ఇంకేముంది, ఆ గ్రామంపై సర్వాధికారాలు తమవే. స్థానిక ఎన్నికల నుండి నామినేటడ్ పోస్టుల వరకు వారు లేదా, వారు ప్రతిపాదించిన వారే అర్హులు. గ్రామస్థాయిలో ప్రభుత్వ వ్యవస్థను గుప్పెట్లోకి తెచ్చుకుని, గ్రామాన్ని సామ్రాజ్యంగా మార్చేశారు. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా, వారి నియోజకవర్గ గ్రామాల్లో ఈ కార్యకర్తల నిర్ణయాలమీదే ఆధారపడే స్థాయికి ప్రజాస్వామ్య వ్యవస్థను, గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలు దిగజార్చేరు.


మనది ప్రజాస్వామ్యం అని అంటున్నామంటే, మన భవిష్యత్తుకు రూపకర్తలం మనమే. మన ఊరు, మన అభివృద్ధి అంటూ, మన గ్రామంపై మనమందరం ఉమ్మడి బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఏ మార్పు అయితే కోరుకుంటున్నామో అది మనతోనే ప్రారంభం కావాలి. అందరి వేళ్ళూ తాము పుట్టిన ఊళ్ళలోనే ఉన్నాయి. గ్రామాలను అనాధలా, దుర్మార్గుల గుప్పెట్లో వదిలేయకుండా, మేధావులు, విద్యావంతులు, దేశభక్తి గల పౌరులు, ఎక్కడున్నా, వారి సొంత ఊరిపై అవగాహన పెంచుకోవాలి. వాటి అభివృద్ధికి తోడ్పడాలి. ఈ దేశం ఇంతేలే, గ్రామాలు ఇంతేలే అని రాజీపడకుండా, రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు హక్కు విలువను కాపాడుకుందాం, మన దేశానికి, గ్రామానికి మనమే మహరాజులవుదాం. అప్పుడే, స్వాతంత్ర్య సమరయోధులు కలలు కన్న భారతదేశాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. ఈ 75 వసంతాల వేడుక సందర్భంలో, మనం వారికి అందించే ఘననివాళి అదే! 


– డా. మనోహరి వెలమాటి 

Updated Date - 2022-08-13T06:53:26+05:30 IST