ధరణితో విప్లవాత్మక మార్పు

ABN , First Publish Date - 2021-10-27T04:52:02+05:30 IST

భూమి రికార్డుల చరిత్రలో ధరణి పోర్టల్‌ ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు.

ధరణితో విప్లవాత్మక మార్పు
ధరణి పోర్టల్‌లో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

- పాలమూరు అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీలో కలెక్టర్‌


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), అక్టోబరు 26 : భూమి రికార్డుల చరిత్రలో ధరణి పోర్టల్‌ ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. మంగళవారం పాలమూరు అర్బన్‌ తహసీల్దారు కార్యాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి వల్ల భూములకు సంబంధించి చాలా సమస్యలు తీరిపోయాయని అన్నారు. రిజిస్ట్రేషన్లు సులభతరంగా చేసుకోవడమే కాకుండా వెంటనే పట్టదారు పాసుబుక్కు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు  ఎలాంటి సమస్యలూ ఎదురవ్వలేదని, మొదటి రెండు నెలల్లోనే అన్నీ సమస్యలను అధిగమించామని తెలిపారు. ధరణి ప్రారంభించింనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అన్ని రకాల స్లాట్స్‌ కలుపుకొని 44,366 బుక్‌ అయ్యాయని, వాటిలో దాదాపుగా అన్నీ పరిష్కారమయ్యాయని తెలిపారు.  పాత భూములకు సంబంధించి 19,588 దరఖాస్తులు రాగా 18,934 పరిష్క రించామని, 646 దరఖాసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పార్ట్‌-బిలో ఉన్న కేసులను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నాళాకు సంబంధించి తహసీల్దారు దగ్గర స్లాట్‌ బుక్‌ చేసుకుంటే వెంటనే పని అయిపోతుందని తెలిపారు. ధరణికి సంబంధించి 2 క్రిమినల్‌ కేసులు నమోదు కాగా వారుకూడా వెనక్కి వచ్చి తిరిగి రిజిస్ట్రేషన్లు చేసిచ్చారని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కోసం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకొని ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకొనని వారితో కలెక్టర్‌ ప్రత్యేకంగా వారితో ఫోన్లో మాట్లాడి రిజిస్ట్రేషన్‌కు రాకుండా ఉండేందుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.  ధరణిపై అవగాహన లేని కారణంగా లబ్ధిదారులకు అందుబాటులో ధరణి సేవలను ఉంచేందుకు ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతే కాకా మీ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో అర్బన్‌ తహసీల్దారు పార్థసారథి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-27T04:52:02+05:30 IST