వరి బదులు ఏ పంట వేయాలి..?

ABN , First Publish Date - 2021-12-21T07:37:40+05:30 IST

యాసంగిలో వరి సాగుకు కళ్లెం వేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పంటలకు సరైన ప్రణాళికలు రూపొందించడం లేదు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా ఏపంటలు సాగు చేయాలి? ఏ

వరి బదులు ఏ పంట వేయాలి..?

  • ‘ప్రత్యామ్నాయం’పై స్పష్టత కరువు..
  • స్పల్ప కాలిక ప్రణాళికలోనూ జాప్యం
  • తెల్ల నువ్వులు, ఆముదం, పెసర్లకే చాన్స్‌


హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో వరి సాగుకు కళ్లెం వేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పంటలకు సరైన ప్రణాళికలు రూపొందించడం లేదు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా ఏపంటలు సాగు చేయాలి? ఏ విత్తనాలు అందుబాటులో ఉంచాలి? రైతులను ఆ పంటల సాగువైపు ఎలా మళ్లించాలి? వంటి అంశాల ప్రాతిపదికగా స్వల్పకాలిక వ్యవసాయ ప్రణాళికను వ్యవసాయ శాఖ తయారు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో వరి కోతలు వంద శాతం పూర్తి కావడానికి మరో మూడు వారాలు పడుతుంది. సంక్రాంతికి ముందు ఏ విత్తనాలు వేయాలి? సంక్రాంతి తర్వాత ఏ విత్తనాలు వేయాలి? అనే స్పష్టమైన ప్రణాళికను వ్యవసాయ శాఖ వెల్లడించలేదు. రైతులతో పంటల మార్పిడి చేయించడానికి కనీసం మూడేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్న విషయం విదితమే! కానీ, రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యవసాయ ప్రణాళిక అంటూ ఏదీ లేదు. తొలుత పత్తి, తర్వాత మొక్కజొన్న.. ఇలా ఒక్కో సీజన్‌లో ఒక్కో పంటపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ పోతోంది. తాజాగా యాసంగి విషయంలో కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకుంది.


మరోవైపు, రాష్ట్ర వ్యవసాయశాఖ ఇటీవల విడుదల చేసిన ప్రణాళిక కూడా తప్పుల తడకగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. వేరుశనగ విత్తేకాలాన్ని సెప్టెంబరు ఒకటి నుంచి నవంబరు 30 వరకు, శనగలు, కుసుమలు, ఆవాలు.. అక్టోబరు ఒకటి నవంబరు 15వరకు విత్తాలని సూచించారు. వాస్తవానికి ఈ ప్రణాళిక వెలువడే నాటికే ఆ కాల పరిమితి ముగిసిపోయింది. మినుములు, జొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలు వేయటానికి వ్యవసాయశాఖ డిసెంబరు 31 వరకు డెడ్‌లైన్‌ విధించగా.. వారంలోనే ఆ గడువు పూర్తికానుంది. ఇప్పుడు ఆరుతడి పంటలు విత్తితే... చలి తీవ్రతకు తట్టుకోలేవని, దిగుబడి తగ్గుతుందని, చలి తీవ్రత తగ్గిన తర్వాతే ఆరుతడి పంటలు వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కుసుమ మెట్ట పంట అయిన్పటికీ వరి సాగు చేసిన భూమిలో పండే అవకాశం లేదని చెబుతున్నారు. 


సంక్రాంతి తర్వాతే అనుకూలం

సాధారణంగా సంక్రాంతి తర్వాత చలి తగ్గుతుంది. రెండు నెలలు, మూడు నెలల కాల వ్యవధిలో చేతికొచ్చే పంటలు అప్పుడు సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల నువ్వులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. 90 రోజుల్లో(3 నెలలు) ఈ పంట చేతికి వస్తుంది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎప్పుడు విత్తినా నువ్వుల సాగుకు ఢోకా ఉండదని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. పెసర 60 రోజుల పంట.. జనవరి 15 నుంచి 31 తేదీలోపు ఎప్పుడు విత్తినా.. మార్చి నెలాఖరుకో, ఏప్రిల్‌ మొదటి వారంలోనో చేతికి వస్తుంది. ఆలస్యమైన చోట ఫిబ్రవరిలోనూ పెసర్లు విత్తుకోవచ్చని సూచిస్తున్నారు. మినుము కూడా లాభదాయక పంట అని, ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, జనవరి 15 తర్వాత విత్తితే 90 రోజుల్లో పంట చేతికి వస్తుందని చెబుతున్నారు. బురద నేలలు, చౌడు నేలల్లోనూ ఆముదాన్ని సాగు చేయొచ్చని, 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నపై రెండేళ్లుగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది కానీ.. ఇది రైతులకు పూర్తి అవగాహన ఉన్న పంట. వానాకాలమైనా, యాసంగి అయినా.. సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు సాగు చేసినా పంట కాలపరిమితి 120 రోజులు కావటంతో దిగుబడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పొద్దుతిరుగుడు సాగు కూడా యాసంగిలో అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, రాష్ట్రంలో పొద్దు తిరుగుడు విత్తనాల కొరత ఉంది.


చలి తగ్గిన తర్వాతే విత్తాలి

వాతావరణ, నేల పరిస్థితులకు అనుగుణంగా స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రకటించాలి. ఆరుతడి పంటలకు చలి కాలం అనుకూలం కాదు. ఆలస్యమైనా ఫర్వాలేదు. 60-90 రోజుల వ్యవధిలో వచ్చే పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. తెల్ల నువ్వులు, పెసర్లు, మినుములు, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర విత్తనాలేవీ రాష్ట్రంలో అందుబాటులో లేవు. ప్రభుత్వం స్పందించి మూడు వారాల్లోగా విత్తనాలు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది.

జలపతిరావు, సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త

Updated Date - 2021-12-21T07:37:40+05:30 IST