నష్టాల ఊబిలో వరి రైతులు

ABN , First Publish Date - 2020-10-27T11:31:06+05:30 IST

జిల్లాలో వరి రైతులకు కష్టం తప్పలేదు. అధిక వర్షాలతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. వరుసగా కురిసిన వర్షాలతో దాదాపు 60వేల ఎకరాల్లో పంట నష్టంవాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి

నష్టాల ఊబిలో వరి రైతులు

భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు

చేతికొచ్చే ముందు ఊహించని వానలు

ఆయకట్టులో తెగుళ్ల తిప్పలు 


నల్లగొండ, అక్టోబరు 26: జిల్లాలో వరి రైతులకు కష్టం తప్పలేదు. అధిక వర్షాలతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. వరుసగా  కురిసిన వర్షాలతో దాదాపు 60వేల ఎకరాల్లో పంట నష్టంవాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అంతకు  మించి  దాదాపు  1లక్షా50వేల ఎకరాల్లో పంట చేతికి రాకుండా పోతున్నట్లు సమాచారం. బోరు బావుల జూలై మాసంలో నాట్లు వేశారు. ప్రస్తుతం  అవి కోత దశలో ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో బోరు బావుల కింద దసరా పండుగకు ముందే  కోయాలని రైతులు ప్రయత్నంచగా వర్షాలతో కోతలు ప్రారంభించలేదు. చాలా ప్రాంతాల్లో మడికట్లలోనే నీళ్లల్లో వరి చేలు ఒరిగి  నానిపోయాయి. దీంతో వరి చేలకు నష్టం వాటిల్లింది. కొంత మంది రైతులు వరిని నీళ్ల నుంచిపైకి లేపి లుంగల మాదిరిగా కట్టారు. నీళ్లలో ఉంటే తడిసి వరి ఽధాన్యం మొలకెత్తుతోంది. ఇలా చేసినప్పటికీ ధాన్యం మొలకెత్తిన పరిస్థితి. లుంగలు కట్టేందుకు  ఒక ఎకరాకు వేల రూపాలు రైతులు ఖర్చు చేశారు. ఇంత చేసినా ధాన్యం తడిసి మద్ద అయి  మొలకెత్తిన పరిస్థితి ఉండటంతో  కొన్ని ప్రాంతాల్లో రైతులు చేతులెత్తేశారు. చాలా చోట్ల నష్టాలు తప్ప లాభం లేదు. అనుకుని ఆవరిని  నీళ్లలోనే వదిలేశారు. తడిసిన ధాన్యాన్ని కొంత మంది రైతులు అమ్ముకున్న సమయంలో క్వింటాకు రూ.1000 నుంచి రూ.1200 మాత్రమే  ధర పలకింది. దీంతో రైతులకు నష్టం వాటిల్లింది. 


సలహాలు ఇచ్చేవారు ఎవరు..?

భారీ వర్షాలతో, తెగుళ్లతో కష్టాలు ఎదుర్కొంటునప్పటికీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో లేరన్న  విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని చాలా మండలాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన  వ్యవసాయ శాస్త్రవేత్తలు, క్షేత్రస్థాయి అధికారులు కానరావడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం  సన్నరకాలను వేయాలని ఖచ్చితంగా చెప్పడం, నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయడంతో రైతులు సన్నరకాలు అధికంగా వేశారు. అయితే వేస్తున్న సన్న రకాల్లో నాణ్యత ఎంత? దిగుబడిపై ఎలాంటి ప్రభావం  చూపుతుంది? అనే విషయాన్ని అధికారులు చెప్పలేక పోయారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధికంగా సన్నవరి రకాలను దిగుమతి చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన సన్నరకాలనే అధికంగా రైతులు వాడారు. ఏయే రకాలు మంచిదనేది రైతులకు సూచించిన వారే కరువయ్యారు. 


తడిసిన ధాన్యంపై స్పష్టత ఏదీ?

జిల్లాలో సాధారణ వర్షాలకు తోడు  భారీ వర్షాలతో వేల ఎకరాల్లో వరి పంట తడిసిపోయింది. వేల ఎకరాల్లో వరి నేలవాలింది. తడిసిన ధ్యానాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి స్పష్టత రావడం లేదు. దీంతో రంగుమారిన ధాన్యంతో పాటు తడిసి ముద్ద అయిన ఽధాన్యానికి సంబంధించిన రైతులు ఆందోళనలో ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు లాంచనంగా ప్రారంభించారు తప్ప, కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పుంజుకోవడంలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండుగ, పబ్బమనేది లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. కొనుగోలు ఎప్పుడు చేస్తారనే దానిపై రైతులకు పడిగాపులు తప్పటంలేదు. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుకుప్పలుగా రాసులు పేరుకుపోయాయి. తడిసిన, రంగుమారిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 


తెగుళ్ల బెడద

జిల్లాలో వరి పంటకు తె గుళ్లు సోకుతున్నాయి. పచ్చ పురుగు, మొగిలిపురుగు, దోమపోటు వంటి సమస్యలతో వరిపంటకు నష్టం వాటిల్లింది. దీంతో ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే నాలుగైదు సార్లు మందులను పిచికారి చేశారు. దీంతో వేల రూపాయల అదనపు ఖర్చువస్తుండటంతో రైతులకు ఆర్థిక భారం పడుతోంది. ఆయకట్టు ప్రాంతాల్లో ఆగస్టు మాసంలో నాట్లు వేశారు. ఇప్పుడిప్పుడే వరిచేలు ఈనుతున్నాయి. కోతకు మరింత సమయం పట్టనుంది. ఆయకట్టు కింద మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన సన్నరకాల వడ్లను అధికంగా వాడారు. దీంతో  ఈ ప్రైవేటు సన్నరకాల ధాన్యం తెగుళ్లను తట్టుకోలేకపోతున్నట్టు సమాచారం. వరుసగా తెగుళ్లు సోకుతుండటంతో ఆయకట్టు రైతులు పెట్టుబడులు పెట్టలేక ఆందోళనకు గురవుతున్నారు. బోరు బావుల కింద భారీ వర్షాలతో ఒక సమస్య అయితే, ఆయకట్టు ప్రాంతాల్లో వర్షాలు, తెగుళ్లు రైతులను నట్టేట ముంచాయి. అయితే ప్రస్తుతం పొడి వాతారణం వరి రైతుకు కలిసిరావడంలేదు. తేమ అధికంగా ఉన్న పొడి వాతావరణం ఏర్పడినా తెగుళ్లు అధికంగానే ఉంటున్నాయి, తప్ప తగ్గడం  లేదు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. 


తెగుళ్ల నివారణకు వేల రూపాయల పెట్టుబడి

మూడు ఎకరాలు సన్నరకం వరి చేనుకు వరసగా తెగుళ్లు సోకుతున్నాయి. యాబై రోజుల క్రితం వరి నాటు వేశాను. వారంవారం తెగుళ్లు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 20 వేలు అదనంగా ఖర్చు చేశాను. 5 సార్లు మందుల పిచికారి చేశాను. తెగుళ్లు మాత్రం పోవడంలేదు. నష్టంవాటిల్లుతోంది. 

-నందికొండ వీరబాబు రైతు, సత్యనారాయణపురం, త్రిపురారం మండలం

Updated Date - 2020-10-27T11:31:06+05:30 IST