రైస్‌.. రివర్స్‌!

ABN , First Publish Date - 2021-11-25T06:33:28+05:30 IST

పేదల బియ్యం బొక్కేసిన అక్రమార్కులు సర్దుకునే పనిలో పడ్డారు.

రైస్‌.. రివర్స్‌!

గొల్లపూడి గోడౌన్లోకి వెలుపలి నుంచి 4 వేల బియ్యం బస్తాలు 

పశ్చిమ మండలంలోని రేషన్‌ షాపుల నుంచి కొనుగోలు 

లోపలి నుంచి తరలినందునే కొనుగోలు చేశారా? 

తనిఖీల్లో సరుకు కనిపించటానికి ఇదే కారణమా?

కంప్యూటర్‌ ఆపరేటర్‌ పాత్రపై సందేహాలు


పేదల బియ్యం బొక్కేసిన అక్రమార్కులు సర్దుకునే పనిలో పడ్డారు. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్‌ పరిధిలో జరిగిన భారీ స్కామ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగుతీసిన నేపథ్యంలో, జిల్లావ్యాప్తంగా పలు పాయింట్లలోని అవినీతిపరులు తమ తప్పుల లెక్కలను సరిచేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా గొల్లపూడి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో రివర్స్‌ డ్రామా చోటు చేసుకుంది. వెలుపలి నుంచి ప్రొక్యూర్‌ చేసిన నాలుగు వేల బియ్యం బస్తాలు ఈ గోడౌన్‌కు చేరుకోవటం సంచలనం సృష్టిస్తోంది. ఇన్ని వేల బియ్యం బస్తాలు బయట నుంచి ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? అనేది ఇప్పుడు అంతుపట్టని వ్యవహారంగా మారింది. గోడౌన్‌కు చెందిన ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ కనుసన్నల్లో ఈ వ్యవహారం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గొల్లపూడి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి కూడా పేదల బియ్యం పక్కదారి పట్టిందా? కైకలూరు అక్రమం వెలుగులోకి రావడం, అధికారులు దీనిపై దృష్టి సారించడంతో ఇక్కడి అక్రమార్కులు అప్రమత్తమయ్యారా? తరలిపోయిన బియ్యాన్ని భర్తీ చేసేందుకు రేషన్‌ దుకాణాల నుంచి బియ్యం కొనుగోలు చేసి, ఇక్కడ సర్దేస్తున్నారా? అనే సందేహాలకు అవుననే జవాబే వస్తోంది. ఈ గోడౌన్‌కు సాక్షాత్తూ విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ వెళ్లి పరిశీలించారు. నిల్వలు సక్రమంగానే ఉన్నాయని ఆయన భావించారు. అంతా అదే అనుకున్నారు. సబ్‌ కలెక్టర్‌ను కూడా ఏమార్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 


కంప్యూటర్‌ ఆపరేటర్‌ పాత్రపైనే అనుమానాలు

గొల్లపూడి గోడౌన్లోకి బయట నుంచి బియ్యం కొనుగోలు చేసి తీసుకువచ్చారన్నది తాజాగా వెలుగు చూసింది. అంటే ఇక్కడి బియ్యం ఎక్కడికి పోయినట్టు? ఇక్కడి నుంచి తరలించిన బియ్యం లెక్కలను సరి చేసుకునేందుకే అజిత్‌సింగ్‌నగర్‌, వన్‌టౌన్‌, భవానీపురం పరిసర ప్రాంత రేషన్‌ డిపోల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి మరీ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ బియ్యం వ్యాపారంలో అతను సిద్ధహస్తుడని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ అనారోగ్యంతో ఉండడంతో, ఆయన లేని సమయంలో ఈ వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. 


సబ్‌ కలెక్టర్‌ తనిఖీ చేసినా..

కైకలూరు ఉదంతంతో విజయవాడ డివిజన్‌ పరిధిలోని గోడౌన్లను సబ్‌ కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు. కళ్లెదుట నిల్వలు కనిపిస్తుండటంతో ఎలాంటి అనుమానాలూ రాలేదు. తాజాగా రేషన్‌డిపోల నుంచి నాలుగు వేల బియ్యం బస్తాలు గోడౌన్‌కు చేరుకోవటం చూస్తే ఈ గోడౌన్లో కూడా భారీగానే వ్యవహారం నడిచినట్టు అనుమానించాల్సి వస్తోంది. బయట నుంచి బియ్యాన్ని కొనుగోలు చేశారంటే.. ఇక్కడి బియ్యం బయటకు పోయాయనే అర్థం. ఇక్కడి నుంచి నాలుగు వేల బస్తాలే బయటకు తరలిపోయాయా? ఇంకా ఎక్కువగానే తరలిపోయాయా? ఆ లెక్కలను ఎలా సరి చేశారు? అనేది అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది.


తనిఖీల వివరాలు ఎందుకు చెప్పటం లేదు? 

కైకలూరు బియ్యం స్కామ్‌ నేపథ్యంలో, జిల్లావ్యాప్తంగా అనేక ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్లపై ఆరోపణలు వచ్చాయి. మొవ్వ స్టాక్‌ పాయింట్‌లోనూ ఇలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అవనిగడ్డ, నూజివీడు, జి.కొండూరు, మైలవరం పాయింట్లలోనూ అవకతవకలపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం గొల్లపూడి గోడౌన్‌ వ్యవహారం వెలుగు చూసింది. బహిర్గతం కాని గోడౌన్లు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు పలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లపై దాడులు చేయించారు. ఏఏ పాయింట్లలో అక్రమాలు జరిగాయి? ఎంత మేర బియ్యం, నిత్యావసరాలు బయటకు తరలిపోయాయి? అనే వివరాలను అధికారులు బహిర్గతపరచలేదు. దీంతో డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కైకలూరు స్కామ్‌లో మోసాన్ని సొమ్ము చేసుకునేందుకు బేరానికి దిగడాన్ని గమనిస్తే, జిల్లావ్యాప్తంగా నిర్వహించిన దాడుల వివరాలను బహిర్గత పరచకపోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2021-11-25T06:33:28+05:30 IST