భారీ అవినీతి నిజమే

ABN , First Publish Date - 2021-11-24T06:22:49+05:30 IST

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లో బియ్యం స్కామ్‌ నిజమని తేలింది.

భారీ అవినీతి నిజమే

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి 11 వేల బస్తాల బియ్యం మాయం!

ఆర్డీవో విచారణ పూర్తి

నివేదిక ఇవ్వడమే తరువాయి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లో బియ్యం స్కామ్‌ నిజమని తేలింది. ‘ఆంధ్రజ్యోతి’ చెప్పినట్టే అక్కడ భారీ అవినీతి చోటు చేసుకుంది. ఈ స్కామ్‌ను బయటపెట్టిన తర్వాత.. రాత్రికి రాత్రే ఐదు లారీల బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకువచ్చి సర్దినా, బియ్యం దొంగలు అడ్డంగా బుక్‌ అయ్యారు. ఈ వ్యవహారంపై మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి విచారణ ముగిసింది. మొత్తం 11వేలకు పైనే బియ్యం బస్తాలు మాయమయ్యాయని గుర్తించినట్టు సమాచారం. 25 వేలకు పైగా బియ్యం బస్తాలు మాయం అయినట్టు తొలుత వెలుగులోకి రాగా, విచారణాధికారులు తూకం వేయించినప్పటి నుంచి 11 వేలకు పైగా బస్తాల తేడా గుర్తించారు. ఇంత భారీ అవినీతి సెప్టెంబరు మూడవ వారంలోనే వెలుగు చూసినా, ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా కప్పిపెట్టే ప్రయత్నం చేయటం గమనార్హం. ఈ బిగ్‌ స్కామ్‌పై విచారణ బృందం అధికారిక నివేదికను ఇవ్వవలసి ఉంది. 


లబోదిబోమంటున్న రేషన్‌ డీలర్లు 

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ బిగ్‌ స్కామ్‌ ఉదంతంతో  స్టాక్‌ పాయింట్‌ పరిధిలోని మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల రేషన్‌ డీలర్లు తెర మీదకు వచ్చారు. స్టాక్‌ పాయింట్‌లో చోటుచేసుకున్న అక్రమాల కారణంగా తాము మోసపోయిన విషయాన్ని గుర్తించి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ పాయింట్‌ నుంచి తమకు రావాల్సిన బియ్యం, పంచదార, కందిపప్పు డిపోలకు దిగుమతి కాకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలను నిగ్గుదేల్చి తమకు న్యాయం చేయాలని అధికారులను అభ్యర్థించారు.


హుళక్కేశ్వరరావుపై వేటు  

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిపై ఎట్టకేలకు సస్పెండ్‌ వేటు వేశారు. ఆయన స్థానంలో ప్రసాద్‌ను నియమించారు. తనను సస్పెండ్‌ చేస్తే జాతకం బయట పెడతానని చెప్పిన హుళక్కేశ్వరరావు ప్రస్తుతం మౌనం దాల్చారు. ఆయన ఏ గుట్టు విప్పుతారన్నది ఆసక్తికరంగా ఉంది. ఈ వ్యవహారంలో సంబంధం లేకపోయినా తాను ఇరుక్కుపోయానంటూ ఆయన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనద్వారా ఈ పనిని ఎవరు చేయించారనేది చర్చనీయాంశంగా మారుతోంది. 

Updated Date - 2021-11-24T06:22:49+05:30 IST