లెక్క మారింది

ABN , First Publish Date - 2021-10-29T06:48:33+05:30 IST

తప్పు జరిగిందట. అయితే అది పెద్ద తప్పు కాదట.

లెక్క మారింది
తక్కువ బస్తాలైతే ఇంత భారీ సెట్టింగ్‌ ఎందుకో!

అవినీతి అధికారిణిని రక్షించేందుకేనా?

అక్రమం నిజమేనట.. మాయమైన బియ్యమే తక్కువట

పాతిక వేల బస్తాల బియ్యం స్కామ్‌లో.. గుర్తించింది 2 వేలేనట!

రెండు వేల బస్తాల కోసం గోడౌన్‌లో భారీ సెట్టింగ్స్‌ అవ సరమా? 

రెండో గోడౌన్‌లో మాయమైన 15 వేల బియ్యం బస్తాల సంగతేమిటి? 

రూ.40 లక్షల లంచం అంశాన్ని కప్పిపుచ్చేందుకేనా ఈ కథ?


తప్పు జరిగిందట. అయితే అది పెద్ద తప్పు కాదట. ఎవరిని మభ్యపెట్టడానికీ కాకి లెక్కలు? ఎవరిని రక్షించటానికి ఈ తిరకాసు లెక్కలు? అంతా అనుమానించినట్టే జరుగుతోంది.   కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో వెలుగు చూసిన అక్రమాలు నిజమంటూనే, విజిలెన్స్‌ తనిఖీల పేరుతో లెక్కలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి మాయమైంది పాతిక వేలకు పైగా బస్తాలు కాగా, రెండు వేల బస్తాలేనని లెక్కల్లో చూపిస్తున్నారు.. క్రేట్‌ చెక్కలతో భారీస్థాయిలో సెట్టింగ్‌లు వేసింది రెండు వేల బస్తాల కోసమేనా? అక్రమాన్ని కప్పిపుచ్చే క్రమంలో జరిగిన లంచం బేరాన్ని బయటకు రానీయకుండా చేసేందుకు కేసు తీవ్రతను తగ్గించేస్తున్న ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అవినీతి కేసులో అడ్డంగా బుక్‌ అయిపోతామన్న భయంతో విజిలెన్స్‌ను అడ్డుపెట్టుకుని అధికారులు తమ పథక రచనను అమలు చేశారు. ఈ వ్యవహారంపై జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ఆంధ్రజ్యోతికి పంపిన వివరణను చూస్తే, సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు ఆమెను ఎంత తప్పుదోవ పట్టించారో తేటతెల్లమవుతోంది. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి పాతిక వేలకు పైగా బస్తాలు మాయమయ్యాయని, వీటి విలువ రూ.5 కోట్లకు పైమాటే ఉంటుందన్నది వెలుగులోకి రాగా, కేవలం రెండు వేల బియ్యం బస్తాలే కనిపించటం లేదనడం విడ్డూరం కాక మరేమవుతుంది? ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో భారీస్థాయిలో బియ్యం మాయం అయ్యాయన్నది అందులోని సెట్టింగ్స్‌ చూస్తే అర్థమవుతోంది. ఏడాదికి పైగానే ఈ గోడౌన్‌లో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. సొంత సిబ్బంది తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చినా, వెంటనే చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడం వెనుక కారణం ఏమిటో సివిల్‌ సప్లయిస్‌ డీఎం రాజ్యలక్ష్మికే తెలియాలి. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో సివిల్‌ సప్లయిస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఏఎం) వరలక్ష్మి నిర్వహించిన తనిఖీల్లో భారీస్థాయిలో బియ్యం మాయమైనట్టు గుర్తించారు. అక్కడ ఉన్న రిజిస్టర్లను స్వాధీనం చేసుకుని, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ను సస్పెండ్‌ చేయాలని అదేరోజు ఆమె సివిల్‌ సప్లయిస్‌ డీఎం రాజ్యలక్ష్మికి నివేదిక ఇచ్చారు. 


ఎందుకింత జాప్యం?

సాధారణంగా ఇలాంటి తనిఖీల్లో పాతిక బస్తాలు దారిమళ్లినట్టు గుర్తించినా, బాధ్యులైన వారిపై అదేరోజు క్రిమినల్‌ కేసులు పెడతారు. ఇటువంటి అవినీతికి డీలర్లు పాల్పడితే 6ఏ కేసులతో పాటు, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, వెంటనే వారిని విధుల నుంచి తప్పిస్తారు. మరి కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో భారీ స్కామ్‌ను గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోకుండా, ఎందుకు రహస్యంగా ఉంచారు? ఆంధ్రజ్యోతి బయటపెట్టే వరకు కలెక్టర్‌ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? సివిల్‌ సప్లయిస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ వరలక్ష్మి నివేదికపై వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానాలు లేవు. శాఖాపరంగా లోతుగా విచారణ జరపలేదు. కేవలం విజిలెన్స్‌ను రంగంలోకి దించి, చేతులు దులుపుకున్నారు. అప్పుడే అధికారుల తీరుపై సందేహాలు తలెత్తాయి. ఈ కేసు తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నాల్లో భాగంగానే విజిలెన్స్‌ను రంగంలోకి దించారనే వాదన కూడా వినవచ్చింది. ఇప్పుడు ఆ సందేహాలే నిజమయ్యాయి. మాయమయింది తక్కువ బియ్యం బస్తాలేనని తాజాగా విజిలెన్స్‌ రిపోర్టును ఇవ్వటం.. సివిల్‌ సప్లయిస్‌ డీఎం, ఇతర అధికారులు జేసీకి దానినే నివేదించటం విమర్శలకు తావిస్తోంది. 


స్టాక్‌ రిజిస్టర్‌ లేదట!

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఉండవలసిన స్టాక్‌ రిజిస్టర్‌ అందుబాటులో లేదని, ఆ కారణంగానే ఆన్‌లైన్‌ వివరాల ద్వారా గోడౌన్‌లోని సరుకు నిల్వలను లెక్కించామని ఆంధ్రజ్యోతికి పంపిన వివరణలో జేసీ పేర్కొన్నారు. వాస్తవానికి పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ దగ్గరే రిజిస్టర్‌ ఉంది. దానిని తెప్పించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, అసలు లెక్క తేలుతుంది. ఈ పని ఎందుకు చేయటం లేదన్నది గుర్తించాల్సిన మరో ముఖ్యమైన అంశం.


తక్కువగా చూపించడమెందుకు?

భారీస్థాయిలో వెలుగు చూసిన స్కామ్‌ను తక్కువ చేసి చూపించే క్రమంలో అవినీతి కోణాన్ని మరుగున పరిచే ఎత్తుగడ దాగి ఉందన్నది తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తి నుంచి డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయంలోని అధికారిణి ఒకరు ఏకంగా రూ.40 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంత భారీ లంచం అడిగారంటేనే బియ్యం స్కామ్‌ ఏ స్థాయిలో జరిగిందనేది ఊహించవచ్చు. స్కామ్‌ను తక్కువగా చూపిస్తే అంత భారీ లంచం డిమాండ్‌ చేయటానికి అవకాశం ఉండదు కదా. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రొజెక్ట్‌ చేసేలా కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. 


రెండో గోడౌన్‌లో నిల్వల నిగ్గు తేల్చటంలో జాప్యమెందుకు? 

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు 12 కిలోమీటర్ల దూరంలో మరో గోడౌన్‌ ఉంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించిన తర్వాత సార్టెక్స్‌ బియ్యం బస్తాలను ఆ గోడౌన్‌కు తీసుకువస్తారు. ఆ గోడౌన్‌ నుంచి 15 వేల బస్తాలు మాయం అయ్యాయని వెలుగులోకి రాగా, దీనిపై ఇప్పటి వరకు పౌరసరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించలేదు.  కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పర్యవేక్షణలో మండవల్లిలో ఏర్పాటు చేసిన బఫర్‌ గోడౌన్‌లో సరుకు నిల్వల్లో భారీ వ్యత్యాసం ఉన్నదని ఆంధ్రజ్యోతికి ఇచ్చిన వివరణలో అధికారులే ధ్రువీకరిస్తున్నారు. ఈ సరుకు ఎంతో తెలుసుకోవటానికి సమయం పడుతుందని చెబుతున్నారు. కాటా ద్వారా నిగ్గు తేల్చాల్సిన అంశం కాబట్టి, ఈ నెల 30వ తేదీ వరకు ఉన్నతాధికారులను గడువు కోరామని చెబుతున్నారు. బఫర్‌ గోడౌన్‌లోని బస్తాలను కాటా వేయటానికి అవసరమైన సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతులు కూడా పొందినట్టు చెబుతున్నారు. 


ఇన్‌చార్జ్‌ మీద చర్యలు ఎందుకు లేవు?

ఒకపక్క అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులే చెబుతున్నారు. మరోపక్క బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి హుళక్కేశ్వరరావుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్యామ్‌కిషోర్‌ను మాత్రం విధుల నుంచి తొలగించారు. ఇన్‌చార్జిపై కలెక్టర్‌కు రిపోర్టు రాశారు. 


ఆడియో టేపుల కలకలం

ఇదే క్రమంలో ఈ లంచం వ్యవహారానికి సంబంధించి ఆడియో టేపులున్నాయనే అంశం కలకలం సృష్టిస్తోంది. ఈ టేపులు బయటకు వస్తే అసలు బండారం వెలుగు చూస్తుందనే చర్చ పౌరసరఫరాల విభాగంలో తీవ్రంగా నడుస్తోంది.


---------------

అక్రమాలు నిజమే 

‘ఆంధ్రజ్యోతి’కి జేసీ మాధవీలత వివరణ

 కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అక్రమాలు చోటు చేసుకోవటం వాస్తవమేనని జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత అంగీకరించారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస కథనాలపై గురువారం ఆమె వివరణ ఇచ్చారు. ఈ నెల 21వ తేదీన జిల్లా యంత్రాంగం, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆదేశాల మేరకు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌, సహాయక మేనేజర్‌లు కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లను తనిఖీ చేశారని, ప్రాథమికంగా అక్రమాలు బయట పడ్డాయని జేసీ ఆ వివరణలో పేర్కొన్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఉండవలసిన స్టాక్‌ రిజిస్టర్‌ లేని కారణంగా.. ఆన్‌లైన్‌ వివరాల ద్వారా సరుకును లెక్కించారని తెలిపారు. గోడౌన్‌లో  బియ్యం బస్తాల అమరిక శాస్ర్తీయమైన పద్ధతిలో లేదని, నాలుగు వైపులా బస్తాలను పేర్చి, మధ్యలో ఖాళీ ఉంచి, చూసే వారికి లాట్‌ మొత్తం బస్తాలతో ఉన్నట్టు భ్రమ కలిగేలా ఏర్పాటు చేసినట్టు తనిఖీల్లో గుర్తించారని పేర్కొన్నారు. లాట్‌లను లెక్కంచి, 1,714 సార్టెక్స్‌ బియ్యం బస్తాలు, 617 నాన్‌ సార్టెక్స్‌ బస్తాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారని, పీడీఎస్‌ కింద సరఫరా చేసే కందిపప్పు 530 బస్తాలు, పామోలిన్‌ అయిల్‌ 1,683 పాకెట్లు (105 పెట్టెలు) తక్కువగా ఉన్నట్టు గుర్తించారని పేర్కొన్నారు. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పర ్యవేక్షణలో ఉన్న బఫర్‌ గోడౌన్‌ను కూడా తనిఖీ చేయాల్సి ఉందని, అక్కడ సరకు నిల్వలో భారీ వ్యత్యాసాలు ఉన్నందున కాటా ద్వారా నిల్వలను లెక్కించాల్సి ఉందని తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదించగా, ఈ నెల 30వ తేదీ వరకు అనుమతులు ఇచ్చారని, ఇందుకోసం తగిన సిబ్బందిని కూడా నియమించామని పేర్కొన్నారు. అక్రమాలకు కారకులైన ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ బి.హుళక్కేశ్వరరావు, అతని సహాయకుడిగా ఉన్న ఎం.వెంకన్న అనే మరో ప్రైవేటు వ్యక్తి, కంప్యూటర్‌ ఆపరేట్‌ శ్యామ్‌కిషోర్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించడంతో పాటు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్యామ్‌కిషోర్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్టు తెలిపారు.  

Updated Date - 2021-10-29T06:48:33+05:30 IST