అంగన్‌వాడి కేంద్రాలకు నేరుగా బియ్యం సరఫరా చేయాలి

ABN , First Publish Date - 2022-07-06T06:25:02+05:30 IST

జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాలకు బియ్యాన్ని నేరుగా మండల స్టాకిస్టు కేంద్రం నుంచి సరఫరా చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు.

అంగన్‌వాడి కేంద్రాలకు నేరుగా బియ్యం సరఫరా చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాలకు బియ్యాన్ని నేరుగా మండల స్టాకిస్టు కేంద్రం నుంచి సరఫరా చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో మూడు నెలలుగా పైలట్‌ ప్రాజెక్టు ద్వారా మండల స్టాకిస్ట్‌ పాయింట్‌ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా బియ్యం పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నెల నుంచి ప్రతి మండల స్టాకిస్ట్‌ పాయింట్‌ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా బియ్యం సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి సెక్టార్‌ మ్యాపింగ్‌ ఎన్‌ఐసీ, ఈ పాస్‌ పోర్టర్‌లో అప్‌డేట్‌ చేశామని చెప్పారు. సీడీపీవోలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జితో సమన్వయం చేసుకుంటూ రూట్‌ ఆఫీసర్లను ఏర్పాటు చేసి సాయంత్రం ఐదు గంటలలోపు అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడి కేంద్రాల వద్ద టీచర్లు ఎలాంటి హామాలీ కానీ ఇతర చెల్లింపులు చేయవలసిన అవసరం లేదన్నారు. ఖాళీ గోనె సంచులను నిల్వ ఉంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జాగ్రత్తగా ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. డీడబ్ల్యూవోలు, బియ్యం రవాణాలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో అదను కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, సివిల్‌ సప్లయీస్‌ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సురేశ్‌,  ఎన్‌వైకే కో ఆర్డినేటర్‌ రాంబాబు, ఎల్‌డీఎం ఆంజనేయులు, హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి నతానియేలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్‌ రావు, ఏడీ సర్వే ల్యాండ్‌ రికార్డు అశోక్‌ పాల్గొన్నారు. 


 దళితబంధు యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలి


దళితబంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దళితబంధు పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌, మానకొండూర్‌, చొప్పదండి, కరీంనగర్‌ నియోజకవర్గంలో మంజూరుకానీ యూనిట్లకు చెక్‌ మెమోలు పంపించాలని అన్నారు. మంజూరైన వాటిని గ్రౌండింగ్‌ చేయాలని అన్నారు. ప్యాసింజర్‌ వాహనాలకు బ్యాడ్జి లైసెన్స్‌ తప్పకుండా ఉండాలని అన్నారు. 

Updated Date - 2022-07-06T06:25:02+05:30 IST