లెక్క మళ్లీ మొదలు!

ABN , First Publish Date - 2021-10-30T06:11:14+05:30 IST

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బ్లాక్‌ మార్కెట్‌కు తరలిన పేదల బియ్యం లెక్క తేల్చే పనిని ప్రారంభించారు.

లెక్క మళ్లీ మొదలు!
బియ్యం కాటా వేయిస్తున్న అధికారులు

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం నిల్వల లెక్కింపు ప్రారంభం 

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై తర్జనభర్జనలు 

కిలోల చొప్పున కాటా వేయిస్తున్న అధికారులు 

లెక్కింపులో కాలయాపన వెనుక మరో వ్యూహం

బయట నుంచి గోడౌన్‌కు లారీల్లో బియ్యం 


కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బ్లాక్‌ మార్కెట్‌కు తరలిన పేదల బియ్యం లెక్క తేల్చే పనిని ప్రారంభించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద బియ్యం కుంభకోణాన్ని తన తనిఖీల ద్వారా వెలుగులోకి తెచ్చిన పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ వరలక్ష్మి శుక్రవారం తాజాగా గోడౌన్‌లో ధాన్యం బస్తాల నిల్వల లెక్కింపు చేపట్టారు. అయితే ఈ లెక్కను రిజిస్టర్‌ల ప్రకారం చూడకుండా.. కిలోల లెక్కన కాటా వేయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కాలయాపన చేయించాలన్నది సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారుల వ్యూహంగా కనిపిస్తోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ కైకలూరు) : కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో పాతిక వేలకు పైగా బియ్యం బస్తాలు మాయం కాగా.. దీనిని తక్కువగా చూపించేందుకు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నంపై శుక్రవారం ‘లెక్క మారింది’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనంతో సివిల్‌ సప్లయిస్‌ డీఎం కార్యాలయం ఉలిక్కి పడింది. జిల్లా ఉన్నతాధికారి ఆదేశాలతో గోడౌన్‌లో బియ్యం నిగ్గు తేల్చే పని ప్రారంభమైంది. అయితే దీనిని కూడా చిత్తశుద్ధితో నిర్వహించటం లేదని తెలుస్తోంది. వేల బస్తాలు మాయమైతే, కిలోల చొప్పున కాటా వేస్తూ, లెక్కలు తీస్తున్నారు. దీనికి వెనక కూడా పెద్ద వ్యూహమే ఉందనిపిస్తోంది. ఇలా లెక్కిస్తే, ఈ ప్రక్రియ పూర్తి కావటానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. దీనిని అవకాశంగా చేసుకుని, బయటకు తరలించిన బియ్యాన్ని తిరిగి గోడౌన్‌లోకి చేర్చి, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారని తెలుస్తోంది.


గోడౌన్‌కు బయట నుంచి ఐదు లారీల బియ్యం

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం స్కామ్‌పై ‘ఆంధ్రజ్యోతి’లో మొదటి కథనం ప్రచురితమైన రోజునే గుట్టుచప్పుడు కాకుండా బయట నుంచి ఐదు లారీల బియ్యాన్ని కొనుగోలు చేసి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఇదే రీతిలో అర్ధరాత్రిళ్లు బియ్యం తీసుకువచ్చి గోడౌన్‌లో నిల్వ చేస్తే.. నిల్వల మొత్తం పెరుగుతాయి. అంటే అక్రమంగా తరలిన బియ్యాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నాల్లో అవినీతి అధికారులు సఫలీకృతులవుతారు.


రేషన్‌ డిపోలకు ఈ నెల లిఫ్టింగ్‌లో కోత.. ఆందోళనలో డీలర్లు

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్‌  పరిధిలోని చౌక దుకాణాలకు ఈ నెల పూర్తిస్థాయిలో కోటా లిఫ్టింగ్‌ అవలేదు. సగం కోటాను ముందుగా ఇచ్చారు. తర్వాత సరుకును ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు మాన్యువల్‌ రశీదు ఇచ్చారని తెలుస్తోంది. రెండు రోజుల్లో సరుకు పంపిస్తానని ఇన్‌చార్జ్‌ చెప్పిన తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మిగిలిన సరుకు ఇంతవరకు చేరకపోవడంతో పలువురు డీలర్లు గోడౌన్‌కు వచ్చి ఆందోళన చేశారు. దీనిపై డీలర్లంతా రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని భావిస్తున్నారు. 


ప్రైవేటు ఉద్యోగి, కంప్యూటర్‌ ఆపరేటర్‌లపై కేసులు 

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో పని చేస్తున్న ప్రైవేటు ఉద్యోగి వెంకన్న (వెంకట్‌), కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్యామ్‌కిషోర్‌లపై శుక్రవారం కైకలూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సివిల్‌ సప్లయిస్‌ అధికారులు కేసులు పెట్టారు. ఈ గోడౌన్‌ నుంచి రూ.80 లక్షల విలువ చేసే బియ్యం బస్తాలు మాయమయ్యాయని, బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అయితే పోలీసులు ఈ ఫిర్యాదులపై ఇంకా కేసు నమోదు చేయలేదు. 

Updated Date - 2021-10-30T06:11:14+05:30 IST