16 రోజులైనా రేషన్‌షాపులకు చేరని బియ్యం

Jun 16 2021 @ 23:12PM
గోదాంలలో లేని బియ్యం

ఫ బియ్యం కోసం చక్కర్లు కొడుతున్న లబ్ధిదారులు
ఫ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే

కామారెడ్డి, జూన్‌ 16: కరోనా కారణంగా రేషన్‌బియ్యాన్ని ప్రతీ లబ్ధిదారునికి 15కిలోల చొప్పున ఇస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కానీ, రేషన్‌షాపులకు బియ్యం సరఫరా కావడం లేదు. ప్రతీ నెల 1వ తేదీ నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఈ నెలలో 5వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విష యం తెలిసిందే. కామారెడ్డిలో మాత్రం 16 రోజులు గడుస్తున్నా అన్ని రేషన్‌ దుకాణాలకు సరిపడా బియ్యం అందకపోవడంతో లబ్ధిదారులు రేషన్‌ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. మరో నాలుగు రోజులే గడువు ఉండడంతో బియ్యం లభిస్తాయా లేదా అనే ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి సమీపంలోని నర్సనపల్లి గోదాంకు రేషన్‌ బియ్యం చేరకపోవడంతో స్థానిక దుకాణాలకు రేషన్‌ బియ్యం సరఫరా కావడం లేదు. గోదాంల చుట్టూ తిరుగుతున్నామని రేషన్‌డీలర్లు వాపోతున్నారు. అధికారులకు చెప్పినా కూడా పట్టి ంచుకోవడం లేదని రేషన్‌డీలర్లు తెలిపారు. బియ్యం కోసం లబ్ధిదారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని వారికి ఏమి చెప్పాలో తోచడం లేదని రేషన్‌డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌బియ్యాన్ని త్వరగా తెప్పించి రేషన్‌షాపులకు అప్పగిస్తే లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు. ఈనెల 20 వరకే రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. బియ్యం మాత్రం రేషన్‌షాపులకు సరఫరా చేయడం లేదని రేషన్‌ బియ్యం ఇచ్చేందుకు మరింత గడువు పెంచాలని డీలర్లు కోరుతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం అందించాలంటే త్వరగా బియ్యాన్ని సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాలు తాడ్వాయి, సదాశివనగర్‌ మండలాలకు సరిప డా రేషన్‌ బియ్యం గోదాంల నుంచి సరఫరా కాకపోవడం తో రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు అందించలేకపోతున్నామని డీలర్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 కిలోల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 కిలోల బియ్యాన్ని కలుపుకొని ఒక్కో లబ్ధిదారునికి 15 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని బియ్యం సరిపడా స్టాక్‌ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా చేయాలని వారు కోరారు.

Follow Us on: