రైస్‌వార్‌!

ABN , First Publish Date - 2021-11-03T07:00:39+05:30 IST

రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలించే వ్యాపారంలో చక్రం తిప్పుతున్న అక్రమార్కుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది.

రైస్‌వార్‌!
రేషన్‌ బియ్యంతో పట్టుబడిన లారీ

ధర, సేకరణ పరిధిపై ఆధిపత్యపోరు

పట్టుకోసం నల్లబజారు వ్యాపారుల ఎత్తులు

ఉప్పుగుండూరు, ఇంకొల్లు, పమిడిపాడు కీలక కేంద్రాలు

పేరాల టూ దగ్గుబాడుకు అమీర్‌, నాగూర్‌

చీరాల నుంచి చిలకలూరి పేటకు వెంకట్‌ రవాణా

ఉప్పుగుండూరు నేను.. పమిడిపాడు నువ్వు చూసుకో..

ఒప్పందానికి వచ్చిన కీలక వ్యాపారులు

వేటపాలెం, చినగంజాం మండలాల్లో 

పైచేయి కోసం పోటాపోటీ

ఒక వర్గానికి పెద్దదిక్కుగా కడప జిల్లావాసి

రేషన్‌ బియ్యంను 40వ్యాగన్ల ద్వారా కాకినాడ పోర్టుకు తరలించిన చరిత్ర చీరాలది. విషయం లీకై తర్వాత భారీగా పట్టుబడ్డాయి. అది అప్పట్లో సంచలనం. ఆ తర్వాత ఉగాండాకు వేల బస్తాలు సరఫరా చేస్తామంటూ భారీ ఎత్తున ఒప్పందం చేసుకున్న ఘటనలు బయటపడ్డాయి. అనేక పర్యాయాలు స్థానిక మిల్లుల్లో రేషన్‌ బియ్యం భారీస్థాయిలో దొరికాయి. అంతటి అక్రమ రవాణా ట్రాక్‌ రికార్డును ప్రస్తుతం కూడా కొందరు మాఫియాగా మారి కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారంలో ఆరితేరిన వారంతా ఇప్పుడు అధికారపార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ రెచ్చిపోతున్నారు. ఆ క్రమంలోనే పరిధి, ధర విషయంలో వారి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. దీంతోనే అప్పుడప్పుడూ బియ్యం పట్టుబడుతున్నాయి. ఇటీవల అధికారుల తనిఖీల్లో అంజయ్య, మల్లయ్య(లీజుదారుడు)మిల్లులపై జరిగిన దాడుల్లో రేషన్‌ బియ్యం చిక్కింది కూడా ఆ విధంగానే. అయితే వారి మధ్య ప్రాంతాల పంపిణీ పేరుతో ప్రతిపాదనలు రాగా అందులోనూ విభేదాలు, పట్టు కోసం వ్యూహాలు నడుస్తున్నాయి. మరి పోలీసులు, పౌరసరఫరాల అధికారులు ఏం చేస్తున్నారో మరి.  

చీరాల, నవంబరు 2 : రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలించే వ్యాపారంలో చక్రం తిప్పుతున్న అక్రమార్కుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. అది కాస్త ముదిరి ఇటీవల పాకాన పడింది. ఈనేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి రేషన్‌బియ్యం పట్టుబడ్డాయి. రాత్రి 12 గంటల తర్వాత చీరాల పట్టణ పరిధిలోని ఐక్యనగర్‌లో రేషన్‌ బియ్యంను లారీలో లోడ్‌ చేసే క్రమంలో కొందరి ద్వారా సమాచారం అందుకున్న ఎఫ్‌ఐ అర్జున్‌ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. తెల్ల గోతాల్లోకి మార్చిన 40 బస్తాల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. ఈక్రమంలో అందుకు సంబంధించి లారీడ్రైవర్‌ పర్వతరెడ్డి మినహా ఎవరూ అధికారులకు పట్టుబడలేదు. నిందితులను టూటౌన్‌ ఎస్సై శ్రీకాంత్‌కు అప్పగించారు. విచారణ కొనసాగుతోంది. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం కూడా చీరాల ప్రాంతంలో రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. గతంలో ఓ మిల్లులో పనిచేసిన వెంకట్‌ అనే వ్యక్తి స్థానికంగా రేషన్‌బియ్యం అక్రమ వ్యాపారంలో చురుగ్గా పనిచేస్తున్నాడు. తాను సేకరించిన బియ్యాన్ని చిలకలూరిపేటకు తరలిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి పట్టుబడ్డ రేషన్‌ బియ్యం అతనివేనని ప్రచారం జరుగుతోంది.


అమీర్‌, నాగూర్‌ కలిసి.. 

ఇదే దందాలో కీలకంగా ఉండే పేరాలకు చెందిన నాగూర్‌ పెద్దమొత్తంలో రేషన్‌ బియ్యం అక్రమదందా నిర్వహిస్తున్నాడు. నాగూర్‌కు సంబంధించిన ఓ వాహనం గతంలో రేషన్‌బియ్యం రవాణా చేస్తూ పట్టుబడింది. అలాగే చీరాలకు చెందిన అమీర్‌ దగ్గుబాడు కేంద్రంగా రేషన్‌ దందా నిర్వహిస్తున్నాడు. పేరాల నుంచి నాగూర్‌ తన వాహనాల్లో రేషన్‌ బియ్యాన్ని దగ్డుబాడులోని అమీర్‌ అడ్డాకు తరలిస్తుంటాడు. ఈక్రమంలో ఇటీవల కారంచేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వారి బండి పట్టుబడగా పోలీసులను ప్రసన్నం చేసుకుని తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆ వ్యాపారంలో ఉన్నవారు బహిరంగంగానే చెబుతున్నారు. అలాగే అమీర్‌ ఇంకొల్లు ప్రాంతం నుంచి పాల వ్యాన్‌ మాదిరిగా వాహనాన్ని తయారు చేయించి అందులో రేషన్‌బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తాడు. ప్రస్తుతం అదేవిధంగా అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.


మాకే ఇవ్వాలంటూ రాయబేరాలు

గతంలో వలపర్ల కేంద్రంగా వ్యవహారం నడిపిన మార్టూరుకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం చీరాలలోనే రేషన్‌ బియ్యం వ్యాపారం చేస్తున్నారు. వారు వెదుళ్లపల్లి వ్యక్తులకు సరుకు ఇస్తున్నారని, అదే సరుకు తమకు ఇస్తే బాగుంటుందని స్థానికంగా ఆ వ్యాపారం చేసే మిల్లర్లు, బడాబాబుగా పేరుపొందిన బాషాలు రాయబేరాలు నడుపుతున్నట్లు సమాచారం. అందులో ఉప్పుగుండూరుకు చెందిన ఓ వ్యక్తి చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు.


నేతల పేర్లతో వెంకట్రావు, వర్మ హల్‌చల్‌

వేటపాలెం, చిన్నగంజాం మండలాల్లో కూడా రేషన్‌దందాలో ఆధిపత్యపోరు నడుస్తోంది. అందులో వెంకట్రావు అనే వ్యక్తి తనకు నియోజకవర్గ కీలక నాయకుడితో ఉన్న పరిచయం నేపథ్యంలో ‘వేరే చెప్పాలా.. మొత్తం నేనే చూసుకుంటాను, నాతో కలసిరండి’ అంటూ  మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతనికి పోటీగా వర్మ అనే వ్యక్తి తనకు మరో కీలక నేతతో ఉన్న పరిచయం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వీరివురికీ సంబంధించి రేషన్‌ బియ్యం రవాణా చేస్తూ ఒకటికి రెండు, మూడు పర్యాయాలు వారి వాహనాలు పట్టుబడ్డాయి. అందులో వెంకట్రావు, అతని భాగస్తుడు రేషన్‌ రవాణాలో చేయితిరిగిన కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన సుబ్రమణ్యంకు చెందిన టర్బో లారీ ఈపురుపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పట్టుబడ్డప్పుడు పెద్ద చర్చే జరిగింది. ఆ కేసు నడుస్తోంది. అతనే వెంకట్రావుకు పెద్దదిక్కుగా దందా నడిపినట్లు సమాచారం. జిల్లాలో మొత్తం వ్యవహారం అంతా తామే నడపాలన్న దిశగా వారు పావులు కదుపుతున్నారు. కాగా మధ్యలో రేషన్‌ నల్లబజారు వ్యాపారంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో నరేష్‌, టోపీ శీను అనే వ్యక్తులు సీన్‌లోకి వచ్చేశారు. వర్మ ద్వారా వేటపాలెం, చీరాలలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఆ వర్గాల మధ్య పోరు నడుస్తోంది.


ఉప్పుగుండూరు నేను చూసుకుంటా.... పమిడిపాడు నువ్వు చూసుకో ...

గతంలో వలపర్ల, ఇంకొల్లు, చీరాల, ఉప్పుగుండూరు, పమిడిపాడులలో భారీస్థాయిలో రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. ఆక్రమంలో కొన్నిచోట్ల ఆ దందా ఆగింది. ఎస్పీ మలికగర్గ్‌ ప్రత్యేక దృష్టిసారించటం అందుకు కారణం. ఈ నేపథ్యంలో తాజాగా పమిడిపాడు కేంద్రంగా మధు అనే వ్యక్తి భారీస్థాయిలో ఈ దందా చేస్తున్నాడు. అతను అంతకుముందు ఉప్పుగుండూరులో చేసేవాడు. మారిన పరిణామాల క్రమంలో నరేష్‌, మధుల మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో ఉప్పుగుండూరు నరేష్‌, పమిడిపాడు మధులు చూసుకునే విధంగా మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంకు సంబంధించి చీరాల కేంద్రంగా ఓ బార్‌లో చర్చలు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు దృష్టిసారిస్తే వాస్తవాలు అన్నీ వెలుగులోకి వస్తాయి.


అక్రమ వ్యాపారం వాస్తవమే

సురేష్‌, డీఎస్‌వో

జిల్లాలో పలు మిల్లుల్లో రేషన్‌ బియ్యం పట్టుబడుతున్న విషయం వాస్తవమే.  డీలర్ల వద్ద అక్రమంగా రేషన్‌ బియ్యం కొనుగోలు, తరలింపు సంబంధించి నల్లబజారు వ్యాపారులను పట్టుకుంటున్నాం. కొందరిపై కన్నేసి ఉంచాం. కేసులు పెడుతున్నాం. పోలీసుల నిఘాలో పట్టుబడుతున్న వాటిపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమార్కులను ఉపేక్షించేది లేదు. చీరాలలో పట్టుబడ్డ బియ్యానికి సంబంధించి వ్యవహారం జేసీ దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు కొన్ని రేషన్‌ దుకాణాలను తనిఖీ చేస్తున్నారు.  పట్టుబడ్డ వారిని భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తాం.






Updated Date - 2021-11-03T07:00:39+05:30 IST