టీకాలు దాచుకుంటున్న ధనిక దేశాలు

Dec 8 2021 @ 00:47AM

కోవిడ్19 మహమ్మారికి వ్యాక్సిన్ సరఫరా పెరగడంతో ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే మరోమారు ఓమిక్రాన్ పేరుతో ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అందర్నీ కలవరపరుస్తోంది. దీని వ్యాప్తికి ఇది ప్రారంభమైన ఆఫ్రికా దేశాలే కాక అందరూ కారకులే. బ్రిటన్ మాజీ ప్రధాని గార్డెన్ బ్రౌన్ ఇటీవల రాసిన ఒక వ్యాసంలో టీకాకు సంబంధించిన పలు వివరాలు పంచుకుంటూ, టీకాల సరఫరా తగినంతగా లేని పేద దేశాల పరిస్థితిపట్ల ఆందోళన వ్యక్తపరిచారు. వారి వ్యాఖ్యల ప్రకారం ఇప్పటికే తయారైన 910కోట్ల టీకాలతోను, ఏడాది చివరి కల్లా సిద్ధం కానున్న మరో పన్నెండు వందల కోట్ల డోసులతోను అందరినీ కాపాడుకునే అవకాశం ఉన్నది. కానీ ధనిక దేశాలు వీటిని పోగేసి దాచుకుంటున్నాయి. డిసెంబరు నాటికి ఆఫ్రికన్ పేద దేశాల జనాభాలో 40శాతం మందికి టీకాలు ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరలేదు. జింబాబ్వేలో 25శాతం తొలి డోసు తీసుకోగా పూర్తిస్థాయి రక్షణ పొందినవారు 10 శాతం మాత్రమే. లెసోతో, ఎస్వాటిని వంటి దేశాల్లో ఒకే డోసు అవసరమయ్యే జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకూ 27శాతం, 22శాతం మంది ప్రజలు మాత్రమే వాటిని పొందగలిగారు. సుమారు 60కి పైగా ఆఫ్రికన్ దేశాలలో ఇప్పటికీ వారి జనాభాలో 25 శాతానికి లోపు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. ఓమిక్రాన్ పుట్టిన దేశంగా చెబుతున్న దక్షిణాఫ్రికా పరిస్థితి కూడా ఇదే. 


ప్రపంచంలోని 92 పేద దేశాలకు తమ టీకాలను అందిస్తామని గొప్పగా చెప్పుకున్న ధనిక దేశాలు ఆ హామీని అమల్లో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యాయి. అవసరమైన టీకాల్లో సగం దాకా సరఫరా చేస్తామని చెప్పిన అమెరికా నాలుగో వంతును మాత్రమే ఇవ్వగలిగింది. యూరోపియన్ యూనియన్ 19శాతం, యూకె 11శాతం, కెనడా 5శాతం టీకాలు మాత్రమే అందించాయి. చైనా, న్యూజిలాండ్లు హామీ ఇచ్చిన వాటిలో సగం ఇవ్వగలిగాయి. ఆస్ట్రేలియా 18శాతం, స్విట్జర్లాండ్ 12శాతం హామీ మాత్రమే నెరవేర్చగలిగాయి. ఈ ఘోర వైఫల్యం కారణంగా అల్పాదాయ దేశాలలో ఇప్పటికీ కేవలం మూడు శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు అందాయి. సంపన్న దేశాల్లో ఈ సంఖ్య 60శాతం ఉండటం గమనార్హం.


పేద దేశాల్లో పంపిణీ అవుతున్న ప్రతి టీకాకు పాశ్చాత్య దేశాల్లో బూస్టర్ డోసు, మూడో డోసు అంటూ ఆరు టీకాలు వేస్తున్నారు. ఈ అసమానత్వం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు మరో 20కోట్లు నమోదు కావచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. దీనివల్ల 50 లక్షల మరణాలకు ఇంకో ఐదు లక్షలు చేరవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.


జీ–20 దేశాల వైఖరి గర్హనీయం అంటూ గార్డెన్ బ్రౌన్ ఇచ్చిన వివరణ ప్రకారం ఇప్పుడు టీకాల ఉత్పత్తి అసలు సమస్య కానేకాదు. అనుచిత పంపిణీతోనే ఇబ్బందులు వస్తున్నాయి. జీ–20 దేశాలు మొత్తం టీకాలలో 89శాతాన్ని పోగేసుకున్నాయి. ఈ రోజుకు కూడా ఉత్పత్తి కానున్న టీకాలలోనూ 71శాతం ఈ ధనిక దేశాలే బుక్ చేసుకోవడం గమనార్హం.  ఇప్పటికైనా ధనిక దేశాలు వేగంగా అడుగులు వేయగలిగితే  జీ–7 దేశాల్లో వాడకుండా మిగిలిపోయిన 50కోట్ల టీకాలను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాలకు పంపి ఆదుకోవచ్చు. అమెరికా వద్ద దాదాపు 16.2కోట్ల డోసులు మిగిలి ఉన్నాయి. అవి ఈ నెలలో 25 కోట్లకు చేరవచ్చు. ఇంకో ఇరవై ఐదు కోట్ల టీకాలు యూరప్ లోనూ, బ్రిటన్ వద్ద మరో 3.3 కోట్ల టీకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. డిసెంబరు నాటికి పాశ్చాత్య దేశాల వద్ద ఉన్న టీకాలలో దాదాపు పది కోట్లు నిరుపయోగం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అవి అవసరమైన వారికి ఎంత త్వరగా చేరగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది.


అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై నానాటికీ ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లుతోంది. విపత్కర సమయాల్లో ఈ సంస్థల తాత్సారం, సంపన్న దేశాల చిత్తశుద్ధి రాహిత్యం లాంటివి ఈ సంస్థల ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. ఇవి ఉన్నది సంపన్న దేశాల ప్రయోజనాలను కాపాడుతూ పేద దేశాల పట్ల కేవలం ముసలి కన్నీరు కార్చడానికే అన్న అపప్రథ ప్రబలుతోంది. ఈ దురభిప్రాయాన్ని నీరుగార్చాలంటే నిర్దిష్ట లక్ష్యంతో కూడిన ప్రణాళిక, కార్యాచరణ అవసరం. ఆపత్కాలంలో పేద దేశాలని అన్ని విధాల ఆదుకున్నప్పుడే ఆయా అంతర్జాతీయ సంస్థల అస్తిత్వానికి సార్థకత ఉంటుంది. వారి చేయూతకై పేద దేశాలలో బడుగు ప్రజలంతా నిరంతరం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్నారు. వారి మౌన రోదనకు సభ్య సమాజం కేవలం మూగ సాక్షిగా మిగలరాదు.

బి. లలితానంద ప్రసాద్ 

రిటైర్డ్ ప్రొఫెసర్

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.